చాణక్య నీతి సూత్రాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా జీవితాన్ని మార్చుకుంటే జీవితం సజావుగా, విజయవంతంగా సాగుతుందని అని చెప్పవచ్చు.


చాణక్య నీతిలో మానవ సంక్షేమం, జీవన ప్రయోజనం గురించి చాలా ముఖ్య విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఈ విధానాలు జీవితంలో ముందుకు సాగడానికి మార్గం చూపడంతో పాటు, తప్పొప్పులను సవివరంగా తెలియజేస్తాయి. జీవితం విజయపథాన నడిచేందుకు చాణక్యుడు సూచించిన కొన్ని సూచనలను ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి. సంతోషకరమైన జీవితం కోసం మూడు విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దని చాణక్య నీతి చెబుతోంది. మరి ఆ మూడు విషయాలు ఏమిటో సవివరంగా తెలుసుకుందాం.


వైవాహిక విషయాలు


వివాహబంధంతో ఒకటైన దంపతుల మధ్య స్నేహం ముఖ్యంగా ఉండాల్సింది. దంపతులు ఒకరికొకరు స్నేహితులుగా మారగలిగినపుడు వారి మధ్య విబేధాలకు తావుండదు. స్నేహాన్ని మించిన బంధం మరోటి ఉండదు. భార్యాభర్తలు స్నేహితులుగా మసలుకోగలిగితే వారి మధ్య ఉన్న విషయాలను మరొకరితో పంచుకునే అవసరం రాదు. వైవాహిక బంధంలోని రహస్యాలను లేదా విషయాలను లేదా విబేధాలను మూడో వ్యక్తితో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. వైవాహిక బంధం ఎంత సున్నితమైందో అంతే ముఖ్యమైంది కూడా. దీన్ని కేవలం దంపతులకు మాత్రమే పరిమితం చేసుకోవాలి. వారి మధ్య ప్రేమనైనా, విబేధాన్నైనా మరొకరితో పంచుకోవడం అంత శ్రేయస్కరం కాదు. అసలు మూడో వ్యక్తితో రహస్యాలు పంచుకోవాల్సిన అవసరం రాకుండా దంపతులు మసలుకుంటే మరీ మంచిది. ఎందుకంటే ఈ విషయాలు ఎవరితో పంచుకున్నా సరే వారు దాన్ని దుర్వినియోగం చెయ్యవచ్చు. అది మీ అనుబంధానికి ముప్పు కావచ్చు. కనుక దాంపత్య విశేషాలు ఎవరితోనూ పంచుకోవద్దని చాణక్యుడు సలహా ఇస్తున్నాడు.


ఆర్థిక స్థితి


మనకు తెలుగులో ఒక సామెత ఉంది డబ్బుంటే దాచుకోవాలి, జబ్బుంటే పంచుకోవాలి అని. అంటే డబ్బు చాలా ఉంటే దాన్ని ప్రదర్శనకు పెట్టకూడదు. అలా పెడితే అనవసరపు ఇబ్బందులు రావచ్చు. అదే జబ్బు చేస్తే మాత్రం అందరికీ చెప్పాలని అన్నారు. ఎందుకంటే ఒకొక్కరు ఒక్కో సలహా ఇస్తారు. వైద్య విధానం గురించి చెబుతారు. అందులో ఏదైనా మనకు ఉపయోగపడవచ్చు. చాణక్య నీతి కూడా అదే చెబుతోంది. మన ఆర్థిక స్థితి గతుల గురించి ఎవరితోనూ పంచుకోకూడదు. అంతేకాదు డబ్బుకు సంబంధించిన విషయాల గురించిన చర్చలు కూడా జరపకూడదు. మీరు సరిపడినంత డబ్బుతో సమృద్ధిగా ఉన్నారా లేక అప్పులు, ఆర్థిక సమస్యలతో ఉన్నారా అనే విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దని చాణక్యుడి సూచన. డబ్బుంది అంటే మీకు దిష్టి పెట్టవచ్చు లేదా ఇబ్బందుల్లో ఉన్నాను అంటే చులకన చెయ్యవచ్చు. చాణక్యుడి ఈ సూచన సదా ఆచరణీయం.


మోసాన్ని దాచాలి


కొన్ని సందర్భాల్లో తప్పని సరి పరిస్థితుల్లో ఒక్కోసారి చిన్న చితకా మోసాలు చెయ్యాల్సి రావచ్చు. అయితే ఈ విషయాన్ని చాలా గోప్యంగా దాచుకోవాలి. అలాంటి విషయాలు బయటికి తెలిస్తే మీ మీద అప్పటి వరకు ఉన్న మంచి అభిప్రాయం చెడిపోవచ్చు. కొన్ని సార్లు మీరు ఇబ్బందుల్లో కూడా పడవచ్చు. ఒక్కోసారి తీవ్రమైన అవమానం పాలు కూడా కావలసి రావచ్చు. అంతేకాదు అప్పటి వరకు మీరు సాధించిన విజయాలు కూడా మసకబారి పోవచ్చు. కాబట్టి ఏదైనా చిన్నా చితక మోసం చేసినా, ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పినా ఆ విషయాలను రెండో వ్యక్తితో పంచుకోకూడదని చాణక్య నీతి చెబుతోంది.


Also read: గరుఢ పురాణం: ఈ పనులు చేసేవారు, వచ్చే జన్మలో ఇలా పుడతారట!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.