Home Loan: 2022-23 ఆర్థిక సంవత్సరంలో, RBI తన రెపో రేటును చాలాసార్లు పెంచింది. దీనివల్ల గృహ రుణంపై వడ్డీ రేటు గతం కంటే చాలా ఎక్కువగా పెరిగింది. వడ్డీ రేటు పెంపు కారణంగా, ఇంటి లోన్లకు అర్హులైన వారి సంఖ్య కూడా తగ్గింది. చాలామందికి, అవసరమైనంత లేదా ఎక్కువ మొత్తంలో గృహ రుణం (House Loan Amount) పొందడం ఒక సమస్యగా మారింది.
ఎక్కువ హౌస్ లోన్ ఎలా పొందాలి?
గృహ రుణం పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే, అధిక మొత్తాన్ని లోన్ రూపంలో పొందవచ్చు, మీ కలల సౌధాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా కట్టుకోవచ్చు. మీరు తీసుకునే రుణ మొత్తం, మీ క్రెడిట్ స్కోర్ & తిరిగి చెల్లించే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకులు ఇంకా చాలా అంశాలను తనిఖీ చేస్తాయి. అన్ని రకాల ఎంక్వైరీల తర్వాతే మీకు లోన్ ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తాయి.
1. మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి
మంచి క్రెడిట్ స్కోర్ ఉండే, తక్కువ వడ్డీ రేటుతో ఎక్కువ మొత్తం హోమ్ లోన్ పొందవచ్చు. SBI నుంచి HDFC వరకు, అన్ని ఆర్థిక సంస్థలు కస్టమర్ల క్రెడిట్ స్కోర్ (Credit Score) ఆధారంగా ఇంటి రుణం మొత్తాన్ని నిర్ణయిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మంచి క్రెడిట్ స్కోర్ మీకు రాచబాట లాంటింది. తక్కువ వడ్డీ రేటుకే ఎక్కువ రుణం పొందే అవకాశానికి దారి చూపుతుంది.
2. లోన్ కాల పరిమితి ఎక్కువగా ఉండాలి
లోన్ కాల పరిమితిని (loan tenure) పెంచడం వల్ల హోమ్ లోన్ EMI తగ్గుతుంది. తద్వారా, అధిక లోన్ మొత్తాన్ని పొందేందుకు మీకు వీలవుతుంది. మీ హోమ్ లోన్ కాల పరిమితిని పెంచమని బ్యాంకును మీరు అడగవచ్చు.
3. జాయింట్ అకౌంట్
మీతో పాటు మరొకరిని చేర్చుకుంటే, మీరు అధిక రుణ మొత్తాన్ని పొందవచ్చు. ఇద్దరు వ్యక్తులు కలిసి చెల్లిస్తారు కాబట్టి రిస్క్ తక్కువని బ్యాంక్ నమ్ముతుంది. కాబట్టి, ఎక్కువ మొత్తంలో లోన్ మంజూరు చేస్తుంది. అయితే, బ్యాంకు రుణగ్రహీతలు ఇద్దరి అర్హతను చెక్ చేసుకుంటుంది. ఆ తర్వాతే లోన్ అమౌంట్‌ను డిసైడ్ చేస్తుంది.
4. డౌన్ పేమెంట్ పెంచడం
డౌన్ పేమెంట్ పెంచడం కూడా ఒక మంచి మార్గం. మీ చేతిలో తగినంత డబ్బు ఉంటే దానిని డౌన్ పేమెంట్ (down payment) రూపంలో కట్టండి. తద్వారా, బ్యాంక్ నుంచి అధిక రుణ మొత్తాన్ని పొందవచ్చు. డౌన్ పేమెంట్ చేయడం వలన మీ EMI తగ్గుతుంది, కాల పరిమితిని కూడా తగ్గించవచ్చు.
5. ఇప్పటికే ఉన్న రుణాన్ని తీర్చండి లేదా తగ్గించండి
మీకు ఇప్పటికే రుణం లేదా రుణాలు ఉంటే, ముందుగా వాటిని పూర్తిగా తీర్చేయండి లేదా గణనీయంగా తగ్గించండి. క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్‌లో ఉంటే, దానిని తక్షణం క్లియర్ చేయండి. ఆ తర్వాతే ఇంటి రుణం కోసం దరఖాస్తు చేయండి. మీపై ఎక్కువ రుణ భారం లేకపోతే, బ్యాంక్ మంచి లోన్ అమౌంట్‌ను అందజేస్తుంది.