ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇలా ఎంత మంది కూర్చుని మాట్లాడుకున్నా మూడోకంటికి తెలియకుండా అనే మాట ప్రయోగిస్తాం. ఇద్దరు కూర్చుని మాట్లాడితే నాలుగు కళ్లు, ముగ్గురు మాట్లాడితే ఆరు కళ్లు, నలుగురు మాట్లాడితే ఎనిమిది కళ్లు ఉంటాయి. మరి మూడో కన్ను అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది. దేవతల్లో కూడా శివుడికి మాత్రమే మూడోకన్ను ఉంటుందని చెప్పుకుంటాం. మనిషికి మూడో కన్ను ఉంటుందా అనే ఆలోచన వచ్చిందా.. ఆ ఆలోచన వచ్చిందంటే మీరు సరిగ్గానే ఆలోచిస్తున్నారని అర్థం. ఎందుకంటే పరమేశ్వరుడికి మాత్రమే కాదు మనిషికి కూడా మూడోకన్ను ఉంటుంది. మూడోకన్ను మాత్రమేకాదు మన శరీరం పాదాల నుంచి తల వరకూ ఒక్కో అవయవానికి పురాణాల్లో చెప్పుకుని 14 లోకాలకు సంబంధం ఉంది. ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుంటే మానవ శరీర నిర్మాణం వెనుక అంత అంతరార్థం ఉందా అని ఆశ్చర్యపోతారు.
Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే అక్కడ శిలైనా కదలదు...
లోకాలు మూడని కొందరు, ఏడని కొందరు,  14 అని కొందరు చెబుతారు. వాస్తవానికి 14 లెక్కే సరైనదని చెబుతారు. ఎందుకంటే మనకు పైన ఆరు లోకాలు...కింద ఏడు లోకాలు ఉన్నాయని చెబుతారు.
ఊర్ధ్వ లోకాలు 
మనిషి ఊర్ధ్వ ముఖంగా మాత్రమే ప్రయాణం చేయాలని చెబుతారు. ఊర్థ్వ లోకాలు ఏంటంటే భూలోకం, భువర్లోకం, సువర్ణలోకం అంటే స్వర్గం, మహార్లోకం, జనోలోకం, తపోలోకం, సత్య లోకం (మోక్ష దశ పుట్టుక మరణం లేని దశ అదే బ్రహ్మ దశ )
అధోలోకాలు: 
అతల, సుతల ( బలి చక్రవర్తి చోటు)
వితల: శివుడు అంశం, తలాతల: మయుడు ఉండే చోటు
మహాతల: నాగులు ఉండే చోటు (నాగలోకం)
రసాతల: రాక్షసులు ఉండే చోటు
పాతాళం: వాసుకి ఉండే చోటు
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
ఈ లోకాలని మానవ దేహానికి లింకేంటంటే..
మన శరీరంలో మూలాధారం నుంచి పైకి క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక,అనహత, విశుద్ధి,ఆజ్ఞ చక్రాలనే 6చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి ఏడు.  మూలా ధారానికి దిగువన కూడా ఏడు చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. 
1. మూలాధారం: వెన్నుపూస అంత్య భాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం ఇది. దీనికి మహాగణపతి అధిదేవత. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు.
2. స్వాధిష్టానం:  బొడ్డు క్రింద, జననేంద్రియాల వద్ద ఉంటుంది. వివేకం దీని లక్షణం.
3. మణిపూరం: నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం ఇది
4. అనాహతం: హృదయం దగ్గర ఉంటుంది. అపరోక్ష జ్ఞానానికి స్థానం
5. విశుద్ధం: కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం.
6. ఆజ్ఞ: కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.
7. సహస్రారం: తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.

పాతాళ లోకం గురించి చూస్తే..
1. అతల: అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామం దీని లక్షణం
2. వితల: నీరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.
3. సుతల: బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.
4. తలాతలం: అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండి తనానికి ఇది స్థానం.
5. రసాతల: కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణo
6. మహాతల: అవివేకము దీని లక్షణము. పాదాల్లో ఉంటుంది.
7. పాతాళం: కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. 
ఇవన్నీ ఎందుకు చెబుతారంటే ఎదుగుదల అయినా, ఆలోచన అయినా ఊర్థ్వముఖంగా ఉండాలి కానీ దిగువ ముఖంగా ఉండరాదు. పాతాళ లోకాల చక్రాల గురించి ప్రస్తావించిన విషయాలను పరిగణలోకి తీసుకుని ఆ దుర్గుణాలను దూరం చేసుకుంటే మనిషిగా సక్సెస్ అయినట్టే అని చెబుతారు.