YSRCP Defence : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మూడున్నరేళ్ల వరకూ ఓ లెక్క.. ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఏం చేసినా చెల్లుతుందనే రాజకీయ వాతావరణం ఏర్పడింది. దాన్ని ఆ పార్టీ ఎలా ఉపయోగించుకుందన్న సంగతిని పక్కన పెడితే... రాజకీయంగా మాత్రం ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మూడున్నరేళ్ల పాటు టీడీపీ పై ఆరోపణలు.. విచారణలు.. కేసులతో హోరెత్తించింది. దీంతో అనేక మంది టీడీపీ సీనియర్లు బయటకు రాలేకపోయారు. కానీ ఇప్పుడు క్రమంగా పరిస్థితి రివర్స్ అయింది.
అప్పట్లో వైసీపీ ఆరోపణలు - టీడీపీ వివరణలు
ప్రభుత్వం మారిన మూడున్నరేళ్ల పాటు.. వైఎస్ఆర్సీపీ .. ఎదురుదాడి చేస్తూనే ఉంది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అని.. మరొకటని ఆరోపణలు జోరుగా చేశారు. అరెస్టులు చేయించారు. వీటన్నింటిపై వివరణ ఇచ్చుకోవడానికి టీడీపీ తంటాలు పడేది. ఇక మూడు రాజధానుల విషయంలోనూ ఫిక్స్ చేసినంత పని చేశారు. గట్టిగా విశాఖ రాజదానికి వ్యతిరేకమని చెప్పలేని పరిస్థితిని కల్పించి.. మూడు రాజధానులపై వీలైనంత తక్కువ వాయిస్ ఉండేలా చేయగలిగారు. వైసీపీ అఫెన్సివ్ రాజకీయాలతో టీడీపీ డిఫెన్స్ ఆడుతూ వచ్చింది. వివరణలు ఇచ్చుకుంటూ.. ధర్నాలు చేసుకుంటూ రాజకీయాలు చేసింది.
ఏడాది నుంచి మరిపోయిన పరిస్థితులు !
కారణం ఏదైనా ఏడాది కిందటి నుంచి పరిస్థితులు ఒక్క సారిగా మారిపోయాయి. చంద్రబాబునాయుడు రాయలసీమ నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కర్నూలు వెళ్లి అమరావతే మన రాజధాని అని ప్రకటించి వచ్చారు. తర్వాత విశాఖలోనూ అదే చెప్పారు. దీంతో ఇక టీడీపీ వాయిస్ పూర్తిగా మారిపోయింది. అదే సమయంలో వైసీపీ సర్కార్ కు మూడు రాజధానుల విషయంలో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వం పారదర్శకంగా లేకపోవడంతో ప్రజల్లోనూ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇక లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఆరోపణలు చేయడం.. వైసీపీ వివరణ ఇచ్చుకోవడం కామన్ గా మారిపోయింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మిస్ లీడింగ్, ఫ్యాక్ట్ చెక్ పేరుతో వివరణలు ఇచ్చుకోవడానికి ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది.
ఇప్పుడు ఎటు చూసినా విపక్షాల ముప్పేట దాడి - !
ఇప్పుడు ఏపీలో ఓ వైపు చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్ర నడుస్తోంది. మరో వైపు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారు. ముగ్గురూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో .. రోజుకు నలుగురు, ఐదుగురుమంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయాల్సి వస్తోంది. ఆ ముగ్గురు లేవనెత్తిన అంశాలపై ఎదురుదాడి చేస్తున్నారు కానీ.. ఎజెండా విపక్షాలు సెట్ చేస్తే వైసీపీ వివరణ ఇచ్చుకున్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇలా ఎందుకు మారిపోయిందో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు. రోజూ విపక్షాలు ఆరోపణలు చేయడం.. తాము వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో.. పొలిటికల్‌గా ఫిక్స్ అయ్యామన్న అభిప్రాయంతో వైసీపీ నేతలున్నారు.