Wanaparthy Congress meeting: వనపర్తి జిల్లా కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డిపై మాజీ మంత్రి చిన్నారెడ్డి వర్గం దాడి చేసింది. దాంతో శివసేనారెడ్డి సమావేశంలో మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. మరోవైపు కొత్తగా చేరిన ఎంపీపీ మేఘారెడ్డిపై మహిళల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డిని మోసం చేసి వచ్చి ఇక్కడ అలాగే చేద్దాం అనుకుంటే కుదరదు అన్నారు. పార్టీలోకి వచ్చి నాలుగు రోజులు కాకముందే టికెట్ ఎలా అడుగుతావ్ అంటూ పార్టీలోని ఓ వర్గం ప్రశ్నించింది. తన సమక్షంలోనే ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా, తన వర్గీయులు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనా రెడ్డిపై దాడి చేస్తున్నా ఆయన మౌనం వహించారు. చిన్నారెడ్డి తీరుపై పార్టీలోని మరో వర్గం అసంతతృప్తి వ్యక్తం చేసింది. చిన్నారెడ్డి, శివసేనారెడ్డి వర్గీయులు పరస్పర దాడులు చేసుకోవడంతో సమావేశం అర్దాంతరంగా ముగిసింది.
డీసీసీలకు కొత్త అధ్యక్షుల ఎంపిక విషయంలో తలెత్తిన విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వనపర్తి జిల్లా కాంగ్రెస్ లో పంచాయితీ రోజురోజుకూ ముదురుతోంది. మాజీ మంత్రి చిన్నారెడ్డిని లక్ష్యంగా చేసుకొని సీనియర్ నేతలు విమర్శలు చేస్తున్నారు. పదవులు కేవలం తన వర్గీయులకు కట్టబెట్టి, పార్టీకి సేవ చేస్తున్న సీనియర్లను అవమానించారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డికి ఈసారి టికెట్ ఇస్తే మాత్రం తాము పార్టీ విజయం కోసం పనిచేసేది లేదని కొన్ని రోజుల కిందట సీనియర్లు స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి సీనియర్లు తమ బాధలు చెప్పుకున్నారు.
యూత్ లీడర్ గా తొలిసారి టికెట్.. వైఎస్సార్ హయాంలో మంత్రిగా
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ కు కంచుకోటగా చూసే నియోజకవర్గాల్లో వనపర్తి ఒకటి. 1985లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతగా ఉంటూ జి. చిన్నారెడ్డి తొలిసారి వనపర్తి టికెట్ సాధించారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణయ్య చేతిలో ఓటమిచెందారు. 1989 ఎన్నికల్లో అదే ప్రత్యర్థి బాలకృష్ణయ్యపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు చిన్నారెడ్డి. 1994 ఎన్నికల్లో మూడోసారి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావుల చంద్రశేఖర్ రెడ్డి చేతిలో ఓటమిచెందారు. 1999 ఎన్నికల్లో వనపర్తి నుంచే పోటీ చేసి ప్రత్యర్థి రావుల చంద్రశేఖర్ రెడ్డిపై 3500 మెజారిటీతో విజయం సాధించారు. 2004లో ఐదవసారి పోటీలో దిగి వరుస విజయం సాధించి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. దివంగత నేత వైఎస్సార్ మంత్రివర్గంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలు అందించారు. కానీ 2009లో రావుల చంద్రశేఖర్ చేతిలో ఓటమిచెందారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత జి. చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గం నుండి నాల్గవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి భంగపడ్డారు. 2021లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ జిల్లాల పట్ట భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డికి సీనియర్ కార్యకర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.