ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం వర్గాలను మరింత దగ్గర చేసుకునేందుకు వైఎస్‌ఆర్‌సీపీ భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ముస్లిం వర్గాలతో నియోజకవర్గాల వారీగా అవసరమైతే ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కీలక నేతలతో అధినాయకత్వం మంతనాలు జరుపుతున్నట్టు పార్టీలో జోరుగా ప్రచారం నడుస్తోంది. 


కీలకంగా ఉన్న ముస్లిం మైనార్టీ వర్గాలతో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. ముస్లిం మైనారిటీలను ఓటు బ్యాంకుగా గతంలో రాజకీయపార్టీలు ఉపయోగించుకునేవని సజ్జల కామెంట్‌ చేశారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, నేడు వైఎస్‌ జగన్ ముస్లిం మైనారిటీల్లో వెనకబాటుతనాన్ని రూపుమాపాలనే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు వారి కుటుంబాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయని అన్నారు. వైఎస్ జగన్ ముస్లిం మైనారిటీలను శాసన సభ్యులుగా ,శాసన మండలి సభ్యులుగా నామినేటెడ్ పదవుల్లో, స్థానిక సంస్థల్లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. 


ప్రస్తుతం అమలు జరుగుతున్న అమ్మఒడితోపాటు షాదితోఫా, విదేశీ విద్య వంటి అనేక పథకాలు ముస్లింలలో పేదరికాన్ని పొగొట్టేవిధంగా ఉన్నాయనడంలో సందేహం లేదన్నారు సజ్జల. ఆ పథకాలు అందుకుంటున్న ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీలు తమ వర్గంలో చైతన్యం తీసుకువచ్చే విధంగా పని చేయాలని సూచించారు. దేశంలో ముస్లిం మైనారిటీలకు అత్యంత సురక్షితమైన రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ అనటంలో అతిశయోక్త కాదన్నారు. ముస్లిం మైనారిటీల సమస్యలను పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలియ చేయాలని సూచించారు.


త్వరలో మరో భారీ కార్యక్రమం...
ఇప్పటికే జగన్ ప్రభుత్వం మా నమ్మకం జగన్ పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇక మైనార్టీ వర్గాలను దగ్గకు తీసుకునేందుకు మరో భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే విజయవాడ లేదా కడప కేంద్రంగా మైనార్టీ వర్గాల సమావేశానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గాలతో పార్టీ పరంగా సమావేశానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఎన్నికల నాటికి అన్ని వర్గాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 


డిప్యూటీ సీఎంని చేసింది వైసీపీనే
మైనార్టిలను డిప్యూటీ సీఎంగా చేసి బాధ్యతలు అప్పగించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. మైనార్టీలతో నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. రాష్ర్టంలో ముస్లిం మైనారిటీలు వైఎస్సార్‌సీపీకి, రాష్ర్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అండగా ఉండాలని నిశ్చయించుకోవడం శుభపరిణామం అన్నారు. 


దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీల భద్రతకు, సంక్షేమానికి, వారి ఉన్నతికి అనేక నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తున్న ఘనత జగన్‌దేనని అంజాద్‌ బాషా అన్నారు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లు ముస్లిం మైనారిటీ కుటుంబాలలో ఏ విధంగా వెలుగులు నింపాయో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని రంగాల్లో అభివృద్దికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. ముస్లింలకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ ఇటీవల కాలంలో టిడిపి నేతలు, చంద్రబాబు, లోకేష్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వాటిని ముస్లింలందరూ తిప్పికొట్టాలన్నారు. 


చంద్రబాబు హయాంలో ముస్లింలపై చేసిన అరాచకాలు తమను గాయపరిచాయన్నారు అంజాద్‌ బాషా. వాటిని ముస్లింల ఎవ్వరూ మరిచిపోలేదన్నారు. ముస్లిం జనాభా నివసిస్తున్న ప్రాంతాలలో జగన్ చేసిన మేలును, చంద్రబాబు చేసిన అరాచకాలపై చైతన్యం తేవాలన్నారు. జిల్లా స్థాయిలలో ముస్లిం మైనారిటీలతో సదస్సులను నిర్వహించి వారిలో చైతన్యం తెస్తామని వివరించారు.