Bandi Sanjay: పార్టీలోకి ఎవరు వచ్చినా అహ్వానిస్తామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు బీజేపీలోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో బండి సంజయ్ స్పందిస్తూ బీజేపీలోకి అందరూ ఆహ్వానితులే అన్నారు. కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ రావాల్సిందేనని బండి సంజయ్ తెలిపారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో బీజేపీ చేరికల కమిటీ కలుస్తుందన్న విషయమై తనకు సమాచారం లేదన్న సంజయ్.. తనకు చెప్పకపోవడం తప్పేమీ కాదని అన్నారు. పార్టీలో ఎవరికి అప్పగించిన పనులు వారు చేసుకుంటూ వెళ్తారని ఆయన పేర్కొన్నారు. తనకు తెలిసిన వారితో తాను.. ఈటల రాజేందర్ కు తెలిసిన వారితో ఆయన మాట్లాడుతున్నామని బండి సంజయ్ తెలిపారు.


మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇవాళ బీజేపీ చేరికల కమిటీ కలవనుంది. ఈటల రాజేందర్ నేతృత్వంలోని చేరికల కమిటీ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ రావు సహా ఇతర బీజేపీ సీనియర్ నాయకులు ఇవాళ పొంగులేటిని కలిసి బీజేపీలోకి ఆహ్వానించనున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలోనే లంచ్ మీటింగ్ కు నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే పలుసార్లు ఈటల నేతృత్వంలోని బీజేపీ చేరికల కమిటీ నాయకులు పొంగులేటిని కలిసిన విషయం తెలిసిందే. నేడు పొంగులేటి బీజేపీలో చేరే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పొంగులేటి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.


కర్ణాటక ఎన్నికల అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పెద్ద ఎత్తున బహిరంగసభ నిర్వహించి పొంగులేటి బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికలో ఉమ్మడి ఖమ్మంపై కమలం పార్టీ బలం పెంచుకోనుంది. పొంగులేటితో పాటు మాజీ మంత్రి జూపల్లి కూడా కాషాయ దళంలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆయనను కూడా పార్టీలోకి ఆహ్వానించడానికి బీజేపీ చేరికల కమిటీ ప్రయత్నాలు చేస్తోంది.


పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికి ఒక్కసారి మాత్రమే ఎంపీగా వైఎస్ఆర్‌సీపీ తరపున  గెలిచారు. బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ కేసీఆర్ ఆయనకు మరోసారి టిక్కెట్ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్ ఇవ్వలేమని తేల్చేశారు. కానీ పొంగులేటి మాత్రం ప్రతి నియోజకవర్గంలోనూ తనదైన వర్గాన్ని పెంచి పోషించుకున్నారు. తనకు బలం ఉందని ఎప్పటికప్పుడు హైకమాండ్‌ కు నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ సారి ఎన్నికల్లో తనతో పాటు తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే పార్టీ మారిపోతానని హెచ్చరించారు. అలాగే చేశారు. ఆయన ఏ పార్టీలో చేరలేదు కానీ.. అభ్యర్థుల్నిప్రకటిస్తూ పోతున్నారు. తాను ఏ పార్టీలో చేరినా వారందరికీ టిక్కెట్ ఖాయమని చెబుతున్నారు.అందుకే ఏ పార్టీలో చేరాలనుకున్నా ఖమ్మం జిల్లా మొత్తాన్ని తన చేతుల్లో పెట్టాలని ఆయన కోరుతున్నారు. 


పొంగులేటిని చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నిస్తోంది. రెండు సీట్లు మినహా మొత్తం ఖమ్మం పొంగులేటి చేతుల్లో పెడతామని హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. కానీ బడా కాంట్రాక్టర్ అయిన పొంగులేటి చూసి చూసి కాంగ్రెస్ లో చేరగలరా అనేదే చాలా మందికి వస్తున్న సందేహం. కాంగ్రెస్ లా బీజేపీ ఆఫర్లు ఇవ్వడం లేదు కానీ... పొంగులేటికి ఆహ్వానం పలుకుతోంది. కానీ పొంగులేటి పెట్టిన షరతులను బీజేపీ హైకమాండ్ పట్టించుకోలేదని చెబుతున్నారు. ఎంతో అత్యవసరం అయితే తప్ప చేరే నేతలు పెట్టే కండిషన్లకు బీజేపీ అంగీకరించదు. ఇక్కడా అదే జరిగిందని చెబుతున్నారు.