YSRCP Politics: మొన్న 11 ..ఇప్పుడు 27 మొత్తం 38 సీట్లకు ఇంచార్జులను ప్రకటించింది వైసీపీ(YCP). చివరి నిమిషంలో మార్పులు లేకుంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసేది వీళ్లే. గతంలో జగన్ పూర్తిగా తన ఇమేజ్ మీదనే 151 మంది ఎమ్మెల్యేల(MLAs)ను..22 మంది ఎంపీల(MPs)ను గెలిపించారని వైసీపీ క్లెయిమ్ చేసుకుంటూ వస్తోంది. ఈసారి ఆ ఇమేజ్‌కు తోడుగా సంక్షేమ పథకాల అమలు జోడిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అందుకే 175 కు 175 సీట్లు గెలుస్తాం అంటూ స్వయంగా పార్టీ అధినేత జగన్(Jagan) పదేపదే చెబుతున్నారు.
అధినేత జగన్ కాన్ఫిడెన్స్ చూసిన కొందరు నేతలు తమ వారసుల రాజకీయ అరంగేట్రానికి ఇదే రైట్ టైంగా భావించి వ్యూహాలు రచించారు. చాలా రోజుల నుంచి తమ కుమారులకు టికెట్లు ఇవ్వాలని మంతనాలు జరిపారు. జగన్ దాన్ని తోసి పుచ్చారని వైనాట్ 175 అనే గోల్ రీచ్ కావాలంటే ప్రయోగాలు వద్దని భావించారని పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి.
ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలంగాణ(Telangana) ఎన్నికల రిజల్ట్ తర్వాత ఏపీలో కూడా అధికార పార్టీ నుంచి అసంతృప్తులు బయటకు వస్తున్నారు. బాహాటంగానే అధినేతను విమర్శిస్తున్నారు. వీటన్నింటి కారణంగా నేతల అభిప్రాయానికి పెద్దపీట వేసిన జగన్ వారి కోరిక మేరకు వారసులకు లైన్ క్లియర్ చేశారు. అందులో భాగంగానే ఎన్నికల్లో సీట్లు కట్టబెడుతున్నారు అన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. ఇప్పటివరకూ ఐదుగురు వారసులు వైసీపీ సీట్లు దక్కించుకున్నారు.
పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) S/o పేర్ని నాని - మచిలీ పట్నం
జగన్ మొదటి కేబినెట్‌లో మంత్రి పదవి పొందిన పేర్ని నాని తన కుటుంబంలో మూడో తరాన్ని రాజకీయాల్లోకి దించుతున్నారు. మంత్రివర్గ పునర్వవవస్థికరణలో భాగంగా కేబినెట్‌లో స్థానం కోల్పోయిన నాని తాను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు అనౌన్స్ చేశారు. బదులుగా తన కుమారుడు కృష్ణమూర్తి అలియాస్ కిట్టుకు ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం బందరు పాలిటిక్స్‌లో కిట్టుదే ప్రధాన పాత్ర. చివరకు మచిలీపట్నం వైసీపీ బాధ్యతలు కిట్టుకే కేటాయించారు జగన్.
భూమన అభినయ్ రెడ్డి s/o కరుణాకర్ రెడ్డి - తిరుపతి
2019 ఎన్నికల్లో గెలిచినప్పుడే అదే తన చివరి ఎన్నిక అని ప్రకటించారు భూమన కరుణాకరరెడ్డి. ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న ఆయన తన కుమారుడు మోహిత్ రెడ్డిని తిరుపతి ఎమ్మెల్యే చెయ్యాలనే పట్టుదలతో ఉన్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిలో ఉన్న మోహిత్ రెడ్డిని గత అక్టోబర్‌లోనే తిరుపతి సీటు అభ్యర్థిగా ప్రకటించారు దక్షిణ కోస్తా జిల్లాల ఇంచార్జీ విజయ సాయి రెడ్డి. తాజాగా ఇంచార్జుల లిస్ట్‌లో మోహిత్ రెడ్డి పేరు ఉండడంతో ఆ ప్రకటన అధికారికమైంది.
పిల్లి సూర్య ప్రకాష్ s/o సుభాష్ చంద్రబోస్ - రామచంద్రాపురం
వైసీపీ ఎంపీ, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ కుమారుడు పిల్లి సూర్య ప్రకాష్‌కు రామచంద్రపురం అసెంబ్లీ సీటు దక్కింది. మొదటి నుంచీ వైఎస్ ఫ్యామిలీ పట్ల విధేయుడుగా ఉన్న బోస్‌కు మరో మంత్రి చెల్లు బోయిన వేణుకు ఈ సీటు విషయంలో వాగ్వాదమే నడిచింది. అవసరమైతే ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా అనేంతగా పిల్లి సుభాష్ చంద్రబోస్ పట్టుబట్టారు. చివరకు మధ్యే మార్గంగా చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు రాజమండ్రి రూరల్ కేటాయిస్తూ బోస్ కుమారుడు సూర్య ప్రకాశ్‌కు రామచంద్రపురం బాధ్యతలు అప్పగించారు జగన్.
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి S/o భాస్కర్ రెడ్డి- చంద్రగిరి
జగన్‌కు అత్యంత ఆప్తులుగా పేరున్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి కుటుంబం నుంచి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి అసెంబ్లీ ఇంచార్జ్ పదవీ దక్కింది. 2014,2019 ఎన్నికల్లో భాస్కర్ రెడ్డి ఇక్కడ పోటీ చేశారు. అయితే 2024 ఎన్నికల్లో పోటీ పై ఆశక్తి లేదని చాలా సార్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజక వర్గంలో పార్టీ కార్యక్రమాలు మోహిత్ రెడ్డే చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమం గడప గడపకూ కార్యక్రమంలో మోహిత్ పాల్గొనడం పై విపక్షాలు గొడవ చేశాయి. ఏ అధికారంతో మోహిత్ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అని వారు విమర్శలు గుప్పించారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి తుడా (TUDA) చైర్మన్ గా మోహిత్‌కు పదవి ఇవ్వడంతో వాటికి చెక్ పడింది. ఇప్పుడు ఏకంగా చంద్రగిరి ఇంచార్జీ బాధ్యతలు సైతం మోహిత్ ను వరించాయి.
షేక్ నూరి ఫాతిమా D/o షేక్ ముస్తఫా - గుంటూరు ఈస్ట్
2014,19 ఎన్నికల్లో వరుసగా గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆర్థిక సమస్యలే దీనికి కారణం అన్నది ఆయన వాదన. ఎమ్మెల్యేగా ఉండడంతో వ్యాపారాలు సరిగ్గా చూసుకోలేక పోతున్నట్టు తన సన్నిహితులతో చెప్పుకుంటూ వచ్చారు. దానికి తోడు గతేడాది ఆయనపై జరిగిన IT దాడులు కూడా ముస్తఫాకు రాజకీయాలపై ఆశక్తి పోయేలా చేశాయని చెబుతున్నారు. దానితో తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని వ్యాపారాలపై దృష్టి పెట్టాలని.. దానికి బదులుగా తన కుమార్తెకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని జగన్ ముందు ప్రతిపాదన ఉంచారు. ముందు కాదన్నా పార్టీ అధ్యక్షుడు జగన్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాకే గుంటూరు ఈస్ట్ సీటు అప్పగించారు.