Perni Nani Counter To Chandrababu On Volunteers Issue: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. బూటకాలు, నయ వంచనకు మారుపేరని.. కులాల పేరుతో వాడుకుని మోసం చేసి విసిరేశారని మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా వాలంటీర్లకు గౌరవం వేతనం రూ.10 వేలు చేస్తానంటూ ఎర వేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం చంద్రబాబు చేసిన ప్రకటనపై ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన కౌంటర్ ఇచ్చారు. 'టీడీపీ అధికారంలోకి వస్తే గౌరవ వేతనం రూ.10 వేలు చేస్తానని వాలంటీర్లకు చంద్రబాబు ఎర వేస్తున్నారు. నాలుగున్నరేళ్లు వారిని మానసికంగా క్షోభకు గురి చేసి.. ఆత్మాభిమానాన్ని కించపరిచారు. వాలంటీర్లు బియ్యం మూటలు మోస్తారని.. డేటా సేకరించి పరాయి దేశాలకు అమ్ముతారని చంద్రబాబు విమర్శించారు. తన రాజకీయం కోసం వాలంటీర్లపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ప్రజల్లో తిరుగుబాటు రావడంతో చంద్రబాబుకు వాలంటీర్లు మంచోళ్లు అయిపోయారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తా.. రూ.10 వేలిస్తా అంటున్నారు.' అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.


'వాలంటీర్లు డబ్బుకు అమ్ముడుపోరు'


వాలంటీర్లు సేవా భావంతో పని చేస్తున్నారు కానీ.. డబ్బు కోసం కాదని వారు డబ్బులకు అమ్ముడుపోరని పేర్ని నాని అన్నారు. 'చంద్రబాబు, దత్తపుత్రుడు డబ్బుకు అమ్ముడుపోవచ్చు. కానీ, వాలంటీర్లు డబ్బుకు అమ్ముడుపోరు. చంద్రబాబు వస్తే సీఎం జగన్ పెట్టిన వాలంటీర్లను తొలగిస్తాడు. జన్మభూమి కమిటీలకు పేరు మార్చి వాలంటీర్లుగా తమ వారినే పెట్టుకుంటాడు. ఇప్పటికే గ్రామాల్లో టీడీపీ నేతలు హామీలిస్తూ తిరుతున్నది నిజం కాదా.?.' అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసాలు, కుట్రలు నమ్మే వాళ్లు ఎవరూ లేని.. ఆయన డబ్బు ఎర చూపితే వాలంటీర్లు తలొగ్గరని అన్నారు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ పై 2.50 లక్షల మంది వాలంటీర్లకు భరోసా ఉందని.. మళ్లీ జగన్ వచ్చాక తమను ఎలా చూసుకుంటారో వారికి తెలుసని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చంద్రబాబు తాబేదారు అని.. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు కోసం పని చేశాడని ఆరోపించారు. రిటైర్ అయ్యాక మళ్లీ చంద్రబాబు కోసమే సేవ చేస్తున్నాడని మండిపడ్డారు.


వాలంటీర్ల చుట్టూ రాజకీయం


కాగా, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో వారిని పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ పథాకాల అమలుకు సంబంధించి దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ నెలకొంది. ఈసీ ఆదేశాలతో సచివాలయాల వద్దకు వెళ్లి లబ్ధిదారులు పింఛను తీసుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, చంద్రబాబు వల్లే పింఛన్ దారులకు సకాలంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లు అందించలేకపోయామని.. వైసీపీ విమర్శలు గుప్పించింది. దీనిపై ప్రతిపక్ష టీడీపీ, జనసేన నేతలు సైతం సర్కారుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని.. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా చెయ్యొచ్చని.. కానీ అలా చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల ఈసీకి లేఖ సైతం రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొందరు లబ్ధిదారులు ఎండలో సచివాలయాల వద్ద మరణించారని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారాల్లో సైతం ఈ అంశంపై సీఎం జగన్.. ప్రతిపక్ష టీడీపీ సైతం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా, ఉగాది సందర్భంగా చంద్రబాబు వాలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేలు కాదు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. దీనిపైనే, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా స్పందిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.


Also Read: Chandrababu: వాలంటీర్లకు చంద్రబాబు బంపరాఫర్ - గౌరవ వేతనం పెంచుతామని హామీ, ఎంతంటే?