Why Congress and YSRCP Cannot Alliance:  2024 ఎన్నికల చారిత్రాత్మక పరాజయం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గతంలో నేను ఒంటరిగానే వస్తాను.. ప్రజలతోనే నా పొత్తు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు.  ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలతో అదనపు శక్తుల కోసం, మిత్రుల కోసం ఆరాటపడుతున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని బలంగా ఢీకొట్టాలంటే ఒంటరి పోరాటం మాత్రమే సరిపోదని వైసీపీ అగ్రనాయకత్వం గ్రహించింది. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నేత, రీజినల్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి  ప్రజా సమస్యలపై కలిసి వచ్చే అన్ని శక్తులతో, పార్టీలతో కలిసి పోరాడటానికి తాము సిద్ధం  అంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో వైసీపీకి ఉన్న పొత్తుల   పరిమితుల వల్ల ఆశించిన స్థాయిలో ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు.

Continues below advertisement

 కమ్యూనిస్టులపై ఆశలు.. కానీ  .. 

వైసీపీ ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలను   తమ వైపు తిప్పుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది. వారితో కలిసి రాజకీయాలు చేస్తోంది.   సీట్ల సర్దుబాటు లాంటి ఎన్నికల పొత్తుల వరకు వెళ్లకపోయినా.. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాలు  చేయడానికి తాము రెడీ అని సంకేతాలు పంపుతోంది. అయితే, లెఫ్ట్ పార్టీలు వైసీపీతో చేతులు కలపడం దాదాపు అసాధ్యమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ   అగ్రనాయకత్వంతో నడుపుతున్న సన్నిహిత సంబంధాలే ఇందుకు ప్రధాన కారణం.   పార్లమెంట్‌లో బీజేపీకి పరోక్షంగా పూర్తి మద్దతు ఇచ్చిన వైసీపీతో జతకడితే, సిద్ధాంతపరంగా తమ ఉనికికే ప్రమాదమని కమ్యూనిస్టులు భావిస్తున్నారు. పైగా గతంలో అమరావతి, విశాఖ ఉక్కు వంటి విషయాల్లో వైసీపీ తీరును లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

Continues below advertisement

 కాంగ్రెస్‌తో చెడిపోయిన బంధం.. వెళ్లలేని, కలవలేని పరిస్థితి! 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో  కలిసి పనిచేసే ప్రసక్తే లేదని జగన్ ఇప్పటికే తేల్చిచెప్పారు. ఒకవేళ పొరపాటున కాంగ్రెస్‌తో కలిసే నిర్ణయం తీసుకుంటే ఏపీ రాజకీయ చిత్రం మొత్తం మారిపోతుంది. కానీ, గతంలో కాంగ్రెస్ తనను జైలుకు పంపిందనే వ్యక్తిగత కక్షతో పాటు, ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న తన సొంత సోదరి వైఎస్ షర్మిల తో ఉన్న తీవ్రమైన ఆస్తుల వివాదాలు, రాజకీయ విభేదాల వల్ల కాంగ్రెస్ వైపు జగన్ కన్నెత్తి కూడా చూడలేరు. అటు కాంగ్రెస్ కూడా జగన్ రాజకీయ శైలిని తీవ్రంగా ఎండగడుతోంది. ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలతో వైసీపీకి అనుసంధానం కుదిరే అవకాశం పూర్తిగా మూసుకుపోయింది.

 చిన్న పార్టీలైనా పట్టించుకుంటాయా?  

ఇక మిగిలింది ఎవరికీ పెద్దగా తెలియని చిన్న పార్టీలు లేదా ప్రాంతీయ రిజిస్టర్డ్ పార్టీలు.  మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎవరితోనైనా కలుస్తాం అని సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు గులాబీ ముక్కలు విసిరినా, ఆ సందేశాలను సీరియస్‌గా తీసుకునే నాథుడే కరువయ్యాడు. కూటమి ప్రభుత్వం అత్యంత బలమైన మేజారిటీతో ఉన్నప్పుడు, 11 సీట్లకు పడిపోయిన వైసీపీతో చేతులు కలిపి అధికార పక్షం ఆగ్రహానికి గురికావడం ఎందుకనే భయం చాలా చిన్న పార్టీలలో ఉంది. తాత్కాలిక లాభాల కోసం వైసీపీ వైపు వెళ్తే భవిష్యత్తు సామాజిక సమీకరణాలు దెబ్బతింటాయనే ఆందోళన కూడా రీజినల్ నేతలలో వ్యక్తమవుతోంది.

 వైసీపీకి ఒంటరి పోరాటమే  శరణ్యం! 

ఎలాంటి రాజకీయ సమీకరణాలను విశ్లేషించినా.. రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి  ఒంటరి పోరాటం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. పొరుగున ఉన్న ఏ పార్టీ కూడా వైసీపీతో వేదిక పంచుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే జగన్మోహన్ రెడ్డి కేవలం ఇతర పార్టీల పొత్తులపై ఆశలు పెట్టుకోకుండా.. క్షేత్రస్థాయిలో చెల్లాచెదురైన తమ సొంత క్యాడర్‌ను బలోపేతం చేసుకోవడం, ప్రజా సమస్యలపై నిలబడటంపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది తప్ప, కూటమి కట్టే ఆప్షన్ ప్రస్తుతానికి వైసీపీకి దాదాపు శూన్యమనే అనుకోవచ్చు.