YSRCP is doing politics by saying that PPP means privatization: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం ,నిర్వహణను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్‌లో చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ముఖ్యంగా పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని ప్రభుత్వం వాదిస్తుండగా, ఇది పేదలకు వైద్యం దూరం చేసే ప్రైవేటీకరణే అని వైసీపీ ఆరోపిస్తోంది. అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
17లో పీపీపీ మోడల్‌లోకి 10 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్మాణాలు ప్రారంభఇంచిన 17 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వానికి భారంగా మారింది. ప్రభుత్వ నిధులపై భారం తగ్గించుకుంటూ, మౌలిక సదుపాయాలను వేగంగా పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం 10 కాలేజీలకు పీపీపీ విధానాన్ని ఎంచుకుంది. పీపీపీలో ప్రభుత్వం భూమిని ఇస్తే, ప్రైవేట్ భాగస్వామి పెట్టుబడి పెట్టి భవనాలు నిర్మించి, నిర్ణీత కాలం పాటు నిర్వహిస్తారు. తర్వాత ప్రభుత్వానికి బదలాయిస్తారు. మాజీ సీఎం జగన్ ఈ అంశాన్ని భారీ కుంభకోణం"గా అభివర్ణిస్తోంది. ప్రభుత్వ భూమిని, కోట్లాది రూపాయల విలువైన ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. మెడికల్ సీట్ల ధరలు పెరుగుతాయని, పేదలకు ఉచిత వైద్యం అందదని ప్రచారం చేస్తూ, దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని కూడా చేపట్టారు. ప్రైవేట్ సంస్థలు లాభాల కోసం చూస్తాయి కాబట్టి, చివరికి ఇది పేదల వైద్యానికి గొడ్డలిపెట్టు అవుతుందని వారి వాదన.
పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదంటున్న ప్రభుత్వం
ప్రైవేటీకరణ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. పీపీపీలో ఉన్నప్పటికీ, ఈ కాలేజీలు ప్రభుత్వ పేరుతోనే నడుస్తాయని, నిబంధనలు కూడా ప్రభుత్వమే నిర్దేశిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కాలేజీల్లో 70% సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదలకు ఉచితంగా అందుతాయి. 50% సీట్లు జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఒప్పంద కాలం ముగిసిన తర్వాత ఆస్తులన్నీ తిరిగి ప్రభుత్వం వశమవుతాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నారు. పీపీపీ మోడల్ అనేది విజయవంతమైన మోడల్ అంటోంది. పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఇదే సిఫారసు చేసింది. ఆ స్థాయీ సంఘంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి కూడా సభ్యుడిగా ఉన్నారు.
తిప్పికొట్టలేకపోతున్న టీడీపీ
నిజానికి, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి పీపీపీ మోడల్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నాయి. అయితే, ఏపీలో ఇది అభివృద్ధి వర్సెస్ సంక్షేమం అనే రాజకీయ పోరుగా మారింది. జగన్ పాలనలో జరిగిన ఆర్థిక తప్పిదాల వల్లే నేడు పీపీపీకి వెళ్లాల్సి వచ్చిందని ప్రభుత్వం విమర్శిస్తుండగా, పేదలకు వైద్యం అమ్మేస్తున్నారని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. పీపీపీ , ప్రైవేటీకరణ మధ్య ఉన్న సాంకేతిక వ్యత్యాసాన్ని విస్మరించి, దీనిని ఒక బలమైన రాజకీయ అస్త్రంగా మార్చుకోవడంలో వైసీపీ విజయం సాధించినట్లే కనిపిస్తోంది. ప్రభుత్వం దీనిపై ప్రజలకు మరింత లోతుగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.