Pawan Meets Jana Sena MLAs: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. వారి పనితీరుపై అందిన నివేదికల ఆధారంగా సమీక్షించినట్లుగా తెలుస్తోంది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆయన ఈ సమీక్షలు చేపట్టినట్లు జనసేన వర్గాలుచెబుతున్నాయి.
రోజంతా పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలకు పవన్ కల్యాణ్ ప్రాధాన్యం
జనసేన పార్టీ శాసనసభ్యుల పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఉదయం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అవుతూ, నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఒక్కో ఎమ్మెల్యేతో దాదాపు 30 నిమిషాలకు పైగా సమయం గడుపుతూ, క్షేత్రస్థాయిలో అందుతున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా పలు రకాల సమస్యలపై వారితో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వారికున్న ఇమేజ్, కూటమి పార్టీలతో సమన్వయంపై ముందస్తుగానే సమగ్ర రిపోర్ట్స్ తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నివేదికల ఆధారంగానే ఎమ్మెల్యేలతో పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఎమ్మెల్యే పనితీరుపై సుదీర్ఘ సమీక్ష
నియోజకవర్గాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిని సమీక్షించారు. పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటున్నారా లేదా అనే అంశంపై ఆరా తీశారు. కూటమి పార్టీల నేతలతో సఖ్యత , స్థానిక సమస్యల పరిష్కారంపై ఎంతవరకు దృష్టి పెట్టారనేది ప్రధానంగా ఆరా తీస్తున్నారు. ఈ సమీక్షల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గతంలోనే కొందరు నేతల వ్యవహారశైలిపై వచ్చిన ఫిర్యాదులను ఆయన తీవ్రంగా పరిగణించారు.
కీలక సూచనలు చేసిన పవన్ - కొంత మంది ఎమ్మెల్యేల తీరుపై అసంతృృప్తి
పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోకపోయినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. పనితీరు మెరుగుపరుచుకోకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని పరోక్షంగా సంకేతాలిచ్చారని అంటున్నారు. మొదటగా మండలి బుద్ధప్రసాద్‌తో ప్రారంభమైన ఈ వన్ టు వన్ భేటీలు, ఆ తర్వాత దేవ వరప్రసాద్, లోకం నాగ మాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సీహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబు, సుందరపు విజయ్ కుమార్‌లతో కొనసాగాయి. గెలిచిన వారందరూ కేవలం చట్టసభలకు పరిమితం కాకుండా, కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా జనంలో ఉండాలని పవన్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.