ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపుగా మాూడేళ్లు పూర్తవుతున్నాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకే వచ్చే మే నుంచి ఎమ్మెల్యేలు అందరూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. జూలైలో ప్లీనరీ నిర్వహించాలని... అప్పటి కల్లా అందరూ ప్రజలతో మేమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందిస్తామని ప్రకటించేశారు. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న సమయంలో అందరూ ఎన్నికలకు సిద్దం కావాలని జగన్ సూచిస్తూండటం వైఎస్ఆర్‌సీపీలోని చర్చనీయాంశం అవుతోంది.
మే నుంచి వైఎస్ఆర్‌సీపీ పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాలు !
ప్రతిపక్షం నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా రాజకీయ కార్యకలాపాలను అధికారపార్టీలు తగ్గించేస్తాయి. వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి కూడా అంతే. పైగా కరోనా కారణంగా చాలా కాలం పాటు ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేకుండాపోయింది. ఈ కారణంగా ఇకపై పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలను చేపట్టాలని.. మే నెల నుంచి అందరం రోడ్ల మీదకు రావాలని.. ఇంటింటికీ వెళ్లి ప్రజలందరికీ చేరువ కావాలని మంత్రులకు,ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
త్వరలో ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం !
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు పెద్దగా అపాయింట్‌మెంట్లు కేటాయించలేకపోయారు. త్వరలో అందరితోనూ విడివిడిగా సమావేశంఅవ్వాలనేఆలోచనచేస్తున్నారు.' వచ్చే రెండేళ్లలో ఏమేం చేద్దాం ? ' ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళదాం అనేది అతి త్వరలో నిర్వహించబోయే సమావేశాల్లో దిశా నిర్దేశం చేసుకోవాలని నిర్ణయించారు. ప్రజల వద్దకు వెళ్లే ముందు వారికి సేవలందిస్తున్న వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాలను ఏప్రిల్‌లో నిర్వహించాలని సిఎం జగన్ చెప్పినట్లు సమాచారం. మంత్రులంతా వారానికి 3 రోజులకు తగ్గకుండా పార్టీకి సమయం కేటాయించాలని సిఎం స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనులు చేయాలని దిశానిర్దేశం చేస్తున్నారంటే ముందస్తు ఎన్నికల ఆలోచన ఉన్నట్లేనని కొంత మంది భావిస్తున్నారు. అయితే ఏడాదిన్నర ముందు నుంచి ఎన్నికలకు సిద్ధం కావడం కామనేనని కొంత మంది చెబుతున్నారు.
త్వరలో నియోజకవర్గానికి రూ. రెండు కోట్ల నిధులు !
సంక్షేమ పథకాల విషయంలో ఇబ్బందులు లేకపోయినా అభివృద్ధి విషయంలో ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యేలు,మంత్రులు ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్పంపుతున్నారు. దానికి పరిష్కారంగానే నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున అభివఅద్ధి నిధులు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోని గ్రామాలన్నింటినీ సందర్శించాలని అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 10 న మధ్యాహ్నం అసెంబ్లీలోని కమిటీ హాలులో వైఎస్ఆర్‌సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యాచరణపై ప్రణాళిక ప్రకటించే అవకాశంఉంది. వైఎస్ వర్థంతి సందర్బంగా ప్లీనరీ నిర్వహిస్తారు.