YSRCP Stands With Avinash Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీనికి కారణం రాజకీయ కోణంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంను పెట్టారని ఇవి వేధింపులే కాబట్టి అండగా ఉంటున్నామని చెబుతున్నారు. ఇందులో వాస్తవికత ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కానీ ఏపీలో వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా అధికార పార్టీ అండగా ఉంటోంది. వియ్ స్టాండ్ విత్ అవినాష్ రెడ్డి అని అందరూ భరోసారి నిలుస్తున్నారు. మరి ఈ కేసులో రాజకీయ కోణం ఉందా ? రాజకీయ కారణాలతో ఈ కేసులు పెట్టారా ? వైఎస్ కుటుంబంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న ఈ కేసులో వైఎస్ఆర్‌సీపీ అవినాష్ రెడ్డికి మద్దతుగా నిలవడంతో అర్థం ఏమిటి?
వైఎస్ అవినాష్ రెడ్డికి పూర్తి మద్దతుగా వైఎస్ఆర్‌సీపీ !
హైకోర్టు అరెస్ట్ నుంచి సోమవారం వరకూ రిలీఫ్ ఇచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి సీబీఐ ఆఫీసు ఎదుట మీడియాతో మాట్లాడారు. ఆయన ఈ కేసులో కొన్ని విషయాలు చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి రెండో పెళ్లి, ఆ పెళ్లి ద్వారా ఓ కుమారుడు, ఆయన తన పేరును మహ్మద్ అక్బర్‌గా మార్చుకున్నారన్న విషయం.. ఆస్తుల కోసం హత్య జరిగిందన్న అంశాలను వివరించారు. తాను ఇప్పటివరకూ నోరు విప్పలేదని ఇక మొత్తం చెబుతానని ప్రకటించారు. ఆయన చెప్పిన దాంట్లో ఎన్ని నిజాలున్నాయి.. అవాస్తవాలున్నాయి.. అదే నిజం అయితే ఎందుకు సాక్ష్యాలు మాయం చేసే ప్రయత్నం చేశారు.. వంటి అనుమానాలను పక్కన పెడితే.. ఈ విషయాలను అవినాష్ రెడ్డి చెప్పిన వెంటనే సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ అవినాష్ రెడ్డికి మద్దతు క్యాంపెన్ ప్రారంభించింది. చివరికి వియ్ స్టాండ్ విత్ అవినాష్ రెడ్డి అనే డీపీని కూడా సోషల్ మీడియాలో పెట్టుకున్నారు.
ఇది రాజకీయ వేధింపుల కేసు కాదు ఇలా నిందితుడిగా అండగా ఉండటం వల్ల చెడ్డ పేరు రాదా ?
ఢిల్లీ లిక్కర్ స్కాంను రాజకీయ వేధింపుల కేసుగా పరిగణించడానికి అవకాశం ఉంది. ఎందుకు పరిగణించాలో కూడా వారు కారణాలు చెబుతారు. అయితే అవినాష్ రెడ్డి ఎదుర్కొంటున్న కేసులు మాత్రం రాజకీయ వేధింపులు కాదు. స్వయంగా ఓ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్ అయిన వివేకానందరెడ్డి దారుణ హత్య. ఓ మనిషిని..అదీ వృద్ధుడ్ని ఇంత కిరాతకంగా హత్య చేసేవాళ్లు కూడా ఉంటారా అన్న పద్దతిలో ఈ హత్య జరిగింది. ఇప్పట్లో ఈ హత్యకు చంద్రబాబు కారణం అని ఆరోపించారు. తర్వాత తర్వాత అన్నీ పక్కకుపోయాయి. ఇప్పుడు వైఎస్ వినేకానందరెడ్డి కుమార్తె, అల్లుడే చంపించారని వాదిస్తున్నారు. ఎలా చూసినా ఇది పూర్తిగా కుటుంబంలోని సమస్య అవుతుంది. ఇప్పుడు సీబీఐ వేగంగా విచారణ జరపడం కానీ..ఇతర అంశాలు కానీ రాజకీయ జోక్యంతో సరి పోలనివి. కేసీఆర్ లాగా కేంద్రంపై యుద్ధం ప్రకటించి ఉంటే.. సీబీఐ కావాలే దూకుడుగా ఉందని ఆరోపించడానికి ఓ అవకాశం ఉండేది. కానీ కేంద్రంతో ఏ ప్రభుత్వమూ ఉండనంత సన్నిహితంగా ఉంటుంది. ఇలాంటప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డికి అండగా ఉంటున్నట్లుగా ప్రచారం చేసుకోడం వల్ల వైసీపీకి లాభమా ? నష్టమా ?
వైఎస్ వివేకా కుమార్తె, అల్లుడిపై ఆరోపణలు వ్యూహాత్మక తప్పిదమా ?
వైఎస్ వివేకా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలు తుడిచేయడం.. కేసు లేకుండా అంత్యక్రియలు పూర్తి చేయడం.. పోస్టు మార్టం కూడా చేయకుండా అన్ని లాంంఛనాలు పూర్తి చేయాలని అనుకున్నారన్న వార్తలు వచ్చాయి. తర్వాత వైఎస్ సునీత పట్టుబట్టి పోస్టుమార్టం చేయించారు. ఆ తర్వాత తన తండ్రి హంతకులకు శిక్ష పడటానికి ఆమె పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సరిగ్గా దర్యాప్తు చేయడం లేదని సీబీఐ విచారణ కోసం కోర్టుకు వెళ్లారు. సాధించుకున్నారు. నిందితులకు శిక్ష పడాలని పోరాడుతున్నారు. విచారణలో వెల్లడవుతున్న విషయాలతో అవినాష్ రెడ్డి ఇబ్బంది పడతూంటే.. అవినాష్ రెడ్డి మాత్రం రివర్స్ లో సునీతపై ఆరోపణలు చేస్తున్నారు. అవినాష్ కు వైసీపీ మద్దతుగా ఉంటోంది. ఫలితంగా ఈ అంశంపై వైసీపీ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అవినీతి కేసులకు.. హత్య కేసులకు తేడా ఉంటుంది. హత్య కేసుల్లో నిందితులకు వియ్ స్టాండ్ అంటే సపోర్ట్ చేస్తే ఆయా పార్టీలపై ప్రజల్లో వ్యతిరేక భావం పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.