Ys Sharmila Sensational Comments in Visakha Drugs Issue: విశాఖలో చిక్కిన డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని మండిపడ్డారు. 'డ్రగ్స్ రవాణా, వినియోగంలో ఏపీకి నెంబర్ వన్ ముద్ర వేశారు. ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీ వైపే. పదేళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారు. 25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే... తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. నిఘా వ్యవస్థకు తెలియకుండా రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా వస్తాయి.?. డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా.?. టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలకు సిగ్గుండాలి.' అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


'సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలి'


ఈ కేసులో తెర వెనుక ఎంతటి పెద్ద వాళ్లున్నా నిగ్గు తేల్చాలని సీబీఐను కోరుతున్నట్లు షర్మిల తెలిపారు. 'ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు, పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో ఓ కమిటీ వేయాలి.' అని ఆమె డిమాండ్ చేశారు.


కాగా, విశాఖలో బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్‌లో శుక్రవారం కొకైన్ పట్టుబడింది. ఇప్పటికే పలు దఫాలుగా డ్రగ్‌ డిటెక్షన్‌ పరీక్షలు చేసిన సీబీఐ అధికారులు.. మరోసారి పరీక్షలు చేయనున్నారు. మెజిస్ట్రేట్‌ ఎదుట 140 శాంపిల్స్‌ను పరీక్షించనున్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. అయితే  కంటైనర్‌లో ఉన్న స్టాక్‌ డ్రగ్స్‌ కాదని సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టు యాజమాన్యం తెలుపుతోంది. రొయ్యల మేత కోసం బ్రెజిల్‌లో ఈస్ట్‌ కొనుగోలు చేశామని.. కంటైనర్‌లో ఎలాంటి డ్రగ్స్‌ లేవని స్పష్టం చేసింది. కంటైనర్‌లో డ్రగ్స్‌ లేవని నిరూపిస్తామని పేర్కొంది. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. అటు, ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.


Also Read: P.Gannavaram: ఆ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన - టీడీపీ నుంచి జనసేనకు పి.గన్నవరం నియోజకవర్గం