Giddi Satyanarayana As The P.Gannavaram Janasena Mla Candidate: వచ్చే ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ - జనసేన పొత్తులో భాగంగా సీట్లు పంచుకున్నాయి. ఈ క్రమంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం (P.Gannavaram) నియోజకవర్గంలో తొలుత టీడీపీ బరిలో నిలిచింది. అయితే, తాజాగా ఈ సీటు జనసేనకు మారింది. తొలి విడత టీడీపీ జాబితాలో ఆ పార్టీ నేత మహాసేన రాజేశ్ కు చంద్రబాబు ఈ టికెట్ కేటాయించగా.. తాజాగా పవన్ కల్యాణ్ (Pawankalyan) ఇదే స్థానం నుంచి తన పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించారు. ఈ స్థానంలో గిడ్డి సత్యనారాయణ జనసేన (Janasena) నుంచి పోటీ చేస్తారని పవన్ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్నికల నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందజేశారు. ఈయన హైదరాబాద్ లో పోలీస్ అధికారిగా పని చేశారు. అనంతరం జనసేనలో చేరారు.


పి.గన్నవరం నియోజకవర్గంలో తొలుత టీడీపీ నేత మహాసేన రాజేశ్ కు టికెట్ కేటాయించారు. దీనిపై టీడీపీ, జనసేనలో కొన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అనంతరం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సీటును జనసేనకు కేటాయించగా.. పవన్ కల్యాణ్ అభ్యర్థిని ఖరారు చేశారు.


పోలవరం నుంచి


అలాగే, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం నుంచి టీడీపీ - బీజేపీ - జనసేనల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు పోటీ చేయనున్నారు. ఈ మేరకు జనసేన నేత నాగబాబు ఆయనకు పత్రాలను అందజేశారు. ఇక్కడ అందరినీ కలుపుకొని పని చేస్తానని.. 3 పార్టీల నేతలు, కార్యకర్తల సమన్వయంతో పోలవరంలో భారీ మెజార్టీ సాధిస్తానని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ స్థానం నుంచి టీడీపీ తరఫున బొరగం శ్రీనివాస్ కూడా టికెట్ ఆశించారు.


పవన్ కల్యాణ్ ఏమన్నారంటే.?


ఈ సందర్భంగా పి.గన్నవరం నియోజకవర్గం నేతలతో జనసేనాని పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. 'స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడి కనీసం నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా చేశారు. పి.గన్నవరం జనసేన నేతలంతా వాటన్నింటినీ తట్టుకుని ఒకే మాట మీద నిలబడ్డారు. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఇతర పక్షాలతో కలిసి సత్తా చాటారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి. ఈ ఎన్నికలు రాష్ట్ర దిశ దశను నిర్దేశించేవి. పోటీ చేసే ప్రతీ స్థానం కీలకమే. పి.గన్నవరంలో జనసేన కచ్చితంగా గెలుస్తుంది.' అని పవన్ ధీమా వ్యక్తం చేశారు.


మరోవైపు, ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అన్నీ పార్టీలూ ప్రచారం ముమ్మరం చేశాయి. బరిలో నిలిచిన టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి అభ్యర్థులు అన్ని వర్గాలతో మమేకమవుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు, శనివారం టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులకు వర్క్ షాప్ నిర్వహించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు వారికి కీలక సూచనలు చేశారు.


Also Read: Bode Prasad : సీటు లేదని చెప్పిన బోడె ప్రసాద్‌కు టిక్కెట్ - చంద్రబాబు ఎందుకు మనసు మార్చుకున్నారు?