YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రలో ఉద్రిక్తత ఏర్పండింది. ప్రజాప్రస్థానంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష 31వ వారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం లక్కవరం గ్రామంలో నిర్వహించారు. దీక్ష ముగించుకుని వెళ్తుండగా.. వైఎస్ఆర్ టీపీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నపై కొంత మంది దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఏపూరి సోమన్న పక్కనున్న మహిళా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు.
ఈ సందర్భంగా షర్మిల పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లపై దాడి చేస్తారా.. అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే సైదిరెడ్డే టీఆర్ఎస్ గూండాలను పంపారని ఆరోపించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. దీక్షా స్థలానికి వచ్చిన టీఆర్ఎస్ మఠంపల్లి మండల అధ్యక్షుడు పిచ్చయ్యపై మండిపడ్డారు షర్మిల. మహిళలపై దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల.
వైఎస్ విగ్రహం వద్దకు చేరుకుని కార్యకర్తలతో కలసి బైఠాయించారు. పోలీసు జులుం నశించాలి.. టీఆర్ఎస్ డౌన్.. డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడికి ప్రయత్నించిన ఇద్దర్నీ చూశారు కదా.. చూసి కూడా ఎందుకు పట్టుకోలేదు.. వాళ్లిద్దర్నీ తీసుకుని రండి.. కేసు పెట్టి అరెస్టు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ షర్మిల తేల్చి చెప్పారు. వర్షం పడుతున్నా షర్మిల అక్కడనుంచి కదల్లేదు. మటంపల్లి మండలం టీఆరెఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చెసే వరకు దీక్ష విరమించే లేదని నిందితులను కస్టడీ లోకి తీసుకొనే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు.