తెలంగాణలో అధికార పార్టీలో ఒక్కొక్కరు గొంతులు సవరిస్తున్నారా ? నిన్నటివరకు మౌనంగా ఉన్న నేతలంతా ఇప్పుడు అసంతృప్తి వెల్లగక్కుతున్నారా? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. అసంతృప్తి నేతలంతా ఒకరి తర్వాత మరొకరు నిరసనగళం విప్పుతున్నారు. డైరక్ట్‌ గా కాకున్నా పార్టీలో చేరిన వలసనేతలను అడ్డుపెట్టుకొని నోరు తెరుస్తున్నారు. ఇప్పుడా లిస్ట్‌ లో సీనియర్‌ నేత, హైదరాబాద్ మాజీ మేయర్‌ తీగల కూడా చేరారు.


గతకొంతకాలంగా పార్టీకి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు తీగల కృష్ణారెడ్డి. అయితే ఇప్పుడు సడెన్‌ గా వాయిస్‌ రైజ్‌ చేశారు. అది కూడా మంత్రి సబితా రెడ్డిని టార్గెట్‌ చేస్తూ విమర్శలకు దిగారు. మీర్‌పేట నియోజకవర్గంలో జరగుతున్న అక్రమాలపై గళమెత్తారు. చెరువులను కబ్జా చేస్తూ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నారని, సూళ్లని కూడా కమర్షియల్‌ బిల్డింగ్‌లుగా మార్చేస్తున్నారని ఆరోపించారు. మీర్‌పేట నియోజకవర్గమంతా అపరిశుభత్రతో ఉంటోందన్నారు. ఎక్కడ చూసిన చెత్తాచెదారం, నిర్మాణానికి నోచుకోని రోడ్లతో అస్తవ్యస్థంగా ఉందన్నారు. 


ఇంతలా ప్రజలు బాధలు పడుతున్నా మంత్రి సబితా రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు తీగల. రోజురోజుకి నియోజకవర్గ ప్రజల నుంచి విన్నపాలు ఎక్కువవడం వల్లే మీడియా ముందుకు వచ్చానన్నారు. సబితా అండతోనే నియోజకవర్గంలో అక్రమాలు, కబ్జాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తానని అక్కడే పంచాయతీ తేల్చుకుంటానని స్పష్టం చేశారు.


తీగ‌ల ఎందుకు పార్టీ మార‌తారు?


2009లో మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డినప్పుడు టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి మ‌ల్ రెడ్డి రంగారెడ్డిని ఓడించి తెలుగుదేశం పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే టీఆర్ఎస్ పార్టీ చేరారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన స‌బితా ఇంద్రా రెడ్డి చేతిలోనే మ‌రోసారి ఓట‌మిపాల‌య్యారు. ఆ త‌ర్వాత సబితా ఇంద్రారెడ్డి కాంగ్ర‌స్ పార్టీ నుంచి టీఆర్ఎస్ చేరి మంత్రి కూడా అయ్యారు. ఈ ప‌రిస్థితుల్లో తీగ‌ల కృష్టారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి వ‌ర్గాల మ‌ధ్య నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిప‌త్య పోరు ఎక్కువైంది. దీంతో గ‌త కొంత‌కాలంగా మౌనంగా ఉన్న తీగ‌ల కృష్ణారెడ్డి ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌తుండంటో మ‌ళ్లీ మ‌హేశ్వ‌రం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాల‌నుకుంటున్నారు. అయితే అది ఏ పార్టీ నుంచి అనేది తేల‌డంలేదు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ కూడా ఆయ‌న్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయ‌ని ఆయ‌న వ‌ర్గీయులు చెబుతున్నారు. 


ఇక మౌనం వీడిన‌ట్లేనా?


ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు ఎందుకు సబితపై ఆరోపణలు చేస్తున్నరన్న మీడియా ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశారు తీగల. పార్టీ మారే ఆలోచనతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్న ప్రశ్నకు ఆగ్రహం వ్యక్తం చేశారు.  తన ప్రాణాలు పోయే వరకు టీఆర్‌ఎస్‌ పార్టీని వీడేది లేదన్నారు. ఇష్టం లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటానే కానీ ఏ పార్టీ మారే ప్రసక్తేలేదన్నారు. అంతేకాదు ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్లని చెప్పుతో కొడతానని హెచ్చరించారు. అయితే అయ‌న హాస్తం గూటికి చేర‌డానికి ఈనెల 11న ముహూర్తం కూడా ఫిక్స్ అయింద‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. 


అసలే అవకాశం కోసం చూస్తోన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి టీఆర్‌ఎస్‌లోని నిరసన గళాలు కలిసొచ్చేలా ఉన్నాయి. త్వరలోనే గులాబీ పార్టీలోని  చాలామంది అసంతృప్తి నేతలు హ‌స్తం గూటికో, కాషాయం కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నట్లు రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.