Sabita Reaction On Teegala : తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం మహేశ్వరంలో టీఆర్ఎస్ నేతల మధ్య ఏర్పడిన వివాదాలు ఆ పార్టీలో సంచలనాత్మకం అయ్యాయి. నేరుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఏ సందర్భంలో తీగల కృష్ణారెడ్డి అలా మాట్లాడారో అర్థం కావడం లేదని.. ఆ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కబ్జాలు జరిగి ఉంటే సీఎం కేసీఆర్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. మిస్ గైడ్ చేస్తున్నట్లుగా మాట్లాడటం సరి కాదన్నారు. ఈ అంశంపై తాము పార్టీలో మాట్లాడుకుంటామని.. సబిత స్పష్టం చేశారు.


సబిత టీఆర్ఎస్‌లో చేరికతో తీగలకు ఉక్కపోత 


మహేశ్వరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ తరపున తీగల కృష్ణారెడ్డి పోటీ చేశారు. సబితా ఇంద్రా రెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆమె టీఆర్ఎస్‌లో చేరారు. అప్పట్నుంచి నియోజకవర్గంలో తీగల వర్గానికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ కారణంగా ఆయన అసంతృప్తికి గురవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డికే టిక్కెట్ ఇస్తారన్న ఊహాగానాలువి నిపిస్తున్నాయి. ఈ కారణంగా హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేందుకు తీగల కృష్ణారెడ్డి అసంతృప్తి వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. 


మంత్రి సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు


మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మీర్‌పేటను నాశనం చేస్తున్నారని తీగల ఆరోపిస్తున్నారని.. భూ కబ్జాలను మంత్రి సబిత ప్రోత్సహిస్తున్నారని.. చెరువులు, స్కూలు స్థలాలను కూడా వదలడం లేదని ఆరోపించారు. చెరువుల్లో శిలాఫలకాలు పాతుతున్నారని ఆరోపించారు. మీర్‌పేటలో జరుగుతున్న అన్యాయాలపై తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు.  సబితా ఇంద్రారెడ్డి తమ పార్టీలో (టీఆర్ఎస్) ఎమ్మెల్యేగా గెలవలేదని విమర్శించారు. ఆమె కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చారని అన్నారు. 


పరిస్థితిని చక్కదిద్దేందుకు టీఆర్ఎస్ నేతల ప్రయత్నం 


స్థానిక మంత్రాలయ చెరువు దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని తీగల వ్యతిరేకిస్తున్నారు. చెరువుల పరిరక్షణ కోసం తాను ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరిక చేశారు. ట్రంక్ లైన్ నిర్మాణం ఇప్పటివరకూ చేయలేదని సబితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మంత్రి సబిత వ్యవహరిస్తున్న తీరుపై, ఆమె అవినీతికి సంబంధించిన వివరాలను సీఎం కేసీఆర్ కు అందిస్తానని చెప్పారు. ఇద్దరు నేతలు మీడియా పరంగా వ్యాఖ్యలు చేసుకుంటూడటంతో సర్దుబాటు చేసేందుకు టీఆర్ఎస్ హైకమాండ్ రంగంలోకి దిగింది.