Youth leaders in Politics: వ్యవసాయం(Agriculture) మాదిరిగానే రాజకీయాల(Politics)లోనూ కొత్త వారు, ముఖ్యంగా చదువుకున్న యువత(Youth) పెద్దగా రావడం లేదు. వచ్చినా..ఎక్కువ కాలం మనలేక పోతున్నారు. అసలు ఇప్పుడున్న రాజకీయాల్లో యువత ప్రాధాన్యం కేవలం జెండాలు మోసేందు, జేజేలు కొట్టేందుకే అన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు.. దేశంలో యువ శక్తి(Youth) పెరుగుతోందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఆమేరకు రాజకీయాల్లోకి వస్తున్న యువత పెద్దగా కనిపించడం లేదు. దీనికి రాజకీయ పార్టీలు ప్రోత్సహించకపోవడం.. అదేసమయంలో ధన ప్రవాహం.. వంటివి ప్రధాన అవరోధాలుగా మారాయని నిపుణులు(Experts) చెబుతున్నారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో ఏ నాయకుడైనా మహాత్మా గాంధీ (Mahatma Gandhi)ని కలిసినా.. లేక ఆయనే ఎక్కడైనా పర్యటించినా.. ``ఈ నెలలో ఎంత మంది కొత్తవారిని ఉద్యమంలోకి తీసుకువచ్చారు?`` అని అడిగి మరీ కొత్తవారికి ప్రాధాన్యం ఇచ్చేవారు.
దీంతో స్వాతంత్య్రోద్యమ(Freedom Fight) మలి సంధ్య యువతీ యువకులతో నిండిపోయింది. ఇక, ఇప్పుడు మన పాలనమీద మనమే ఉద్యమాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది వేరే సంగతి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాలకు ప్రాధాన్యం ఎక్కువనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశవ్యాప్తంగా పుట్టగొడుగుల్లాఅనేక పార్టీలు పుట్టుకొస్తున్నాయి. కానీ, ఏ పార్టీని చూసినా.. యువతకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. పైకి ఇస్తున్నామని.. యువత పాత్రే కీలకమని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆమేరకు మెరుపు కనిపించడం లేదు. దీంతో చదువుకున్న యువత రాజకీయాల వైపు రావడం మానేశారు. ఫలితంగానే రాజకీయ అవినీతి పెరుగుతోందనే వాదన కూడా ఉండడం గమనార్హం.
సీనియర్లకే పెద్దపీట!
పార్టీ ఏదైనా.. నాయకులు ఎవరైనా.. అధినేతలకు ఎంత సీనియారిటీ ఉన్నా.. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఇటు అధికార పార్టీ వైఎస్సార్ సీపీలో అయినా.. ప్రతిపక్ష టీడీపీలో అయినా.. నాలుగున్నరేళ్లుగా.. జెండాలు మోసిన వారు.. జేజేలు కొట్టిన వారు ఉన్నారు. దీనికి కారణం.. తమకు కూడా గుర్తింపు వస్తుందని. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటే.. ఆయన వెనుక తిరిగిన వారిలో కీలకమైన నాయకులు ఒకరిద్దరు ఖాయంగా ఉంటారు. ఇది అన్ని పార్టీల్లోనూ ఉంది. అదేసమయంలో కేవలం ఎమ్మెల్యేకు మాత్రం పరిమితం కాకుండా.. పార్టీ కోసం పనిచేసిన యువతరం.. ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మంది ఉన్నారు. వీరంతా కూడా.. పార్టీల అభ్యున్నతిని కోరుతున్న వారే. ఏదైనా చిన్న అవకాశం రాకపోతుందా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వారే. అయితే.. వీరికి ఎప్పటికప్పుడు.. ప్రధాన పార్టీల నుంచి ఊరింపులు.. ఊరడింపులు తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశాలు మాత్రం కనుమరుగవుతున్నాయి.
యువతకు ఛాన్స్ ఇస్తే..
మరో రెండు మాసాల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన దక్కనివారు లేదా.. పొరుగు పార్టీలు బలంగా ఉన్నాయని నమ్ముతున్న వారు. పార్టీలు మారుతు న్నారు. దీంతో పార్టీలకు కొన్ని కొన్ని చోట్ల నాయకత్వాలు కరువవుతున్నాయి. ఇలాంటి స్థానాల్లో ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్నవారిని, యువతకు అవకాశం కల్పిస్తే.. వారి ద్వారా.. కేడర్ పుంజుకునే అవకాశం ఉంటుంది. తద్వారా పార్టీ కూడా.. గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే వాదన ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది. ఏదైనా కారణంగా ఒక ఎమ్మెల్యే జంప్ చేస్తే.. ఆ స్థానంలో అదే పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడిని వెతికి పట్టుకుని అవకాశం కల్పించారు. తద్వారా.. నాయకులను పెంచుకున్న సంస్కృతి ఉండేది. దీంతో కాంగ్రెస్(Congress), కమ్యూనిస్టు(Communists) పార్టీలు అప్పట్లో చాలా బలంగా ఉండేవి. అంతేకాదు.. అన్నగారు ఎన్టీఆర్(NTR) కూడా.. పొరుగు పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చే విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించేవారు. కానీ, ఇప్పుడు పొరుగు పార్టీల నేతలను ప్రోత్సహిస్తున్నట్టుగా.. సొంత పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహిస్తున్న పరిస్థితి లేదు. ఇది వైఎస్సార్ సీపీలోనూ.. టీడీపీలోనూ కామన్‌గా కనిపిస్తున్న ఫ్యాక్టర్.
33 శాతం ఇస్తామన్న టీడీపీ!
ఓ రెండేళ్ల కిందటికి వెళ్తే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu naidu).. తమ పార్టీలోనూ.. ప్రత్యక్ష రాజకీయాల్లోనూ 33 శాతం(33%) అవకాశాలు యువతకు ఇస్తామని ఒంగోలులో జరిగిన మహానాడు వేదికగా చెప్పారు. అంతేకాదు.. రాష్ట్రంలో యువ శక్తి పెరుగుతోందని.. దానిని రాజకీయంగా కూడా మలుచుకుని ప్రజాసేవ వైపు వారిని మళ్లిస్తామన్నారు. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి.. సాధ్యంకావడం లేదు. ఇక, వైఎస్సార్ సీపీ(YSRCP)లోనూ, భారతీయ జనతా పార్టీ(BJP)లోనూ.. ఇదే పోకడ కనిపిస్తోంది. పైకి ప్రస్తావిస్తున్న యువ మంత్రం.. కేవలం మాటలకే పరిమితమైంది. గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ కలిపి(కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి, బీజేపీ) యువతకు ఇచ్చిన సీట్ల సంఖ్య, అందునా కొత్త తరానికి ఇచ్చిన సీట్ల సంఖ్య 2 శాతం లోపేనంటే ఆశ్చర్యం వేస్తుంది.
దేశంలోను, రాష్ట్రాల్లోనూ యువత సంఖ్య పెరుగుతున్న దరిమిలా.. వారికి ఉద్యోగ , ఉపాధితోపాటు.. రాజకీయంగా అవకాశం కల్పిస్తే.. యువ రక్తం రాజకీయంగా ఈ దేశానికి ఎంతో మేలు చేస్తుంది. పైగా.. అవినీతి, అక్రమాలకు కొంతైనా అడ్డుకట్టపడుతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అయినా.. ఈ మేరకు పార్టీలు ఆలోచన చేస్తాయేమో చూడాలి.