వై నాట్ 175 @ వైసీపీ... ఇదే ఏపీలో అధికార పక్షం టార్గెట్. ఎన్నికల వేడి రగిల్చిన సంవత్సరంగా 2022 నిలిచింది. మూడేళ్ల పాలన పూర్తి చేసుకుని నాలుగేళ్ల పాలనకు ఎంట్రీ ఇస్తూనే 2024 అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ రెడీ అవుతోంది.
98.4 శాతం వాగ్దానాల అమలు...
మూడున్నరేళ్ల పాలనలోనే 98.4 శాతం వాగ్దానాల అమలు, సంక్షేమ రాజ్యం స్థాపన చేశామని వైఎస్సార్‌సీపీ నేతలు పలుమార్లు అన్నారు. సంక్షేమం అంటే జగన్‌.. జగన్‌ అంటే సంక్షేమం అన్నట్టుగా పరిపాలన సాగించామని వైసీపీ నేతలు చుబుతున్నారు. డీబీటీ–నాన్‌ డీబీటీ ద్వారా మూడున్నరేళ్లలో దాదాపు రూ. 3.5 లక్షల కోట్లు పేదలకు పంపిణీ చేసి రికార్డ్ నెలకొల్పినట్లుగా పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు, వికేంద్రీకరణతో గడప వద్దకే పరిపాలనకు పార్టీ తెర తీసింది. వరుస విజయాలతో వైఎస్‌ఆర్సీపీ ప్రస్థానం 2022 లోనే 2024 టార్గెట్ ను నిర్దేశించిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ అవతరించారని పార్టీ నేతలు వ్యాఖ్యలు చేశారు. 2024లో వార్‌ వన్‌ సైడే.. 175కు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తామని దీమాగా చెబుతున్నారు. వెనుకబడిన కులాలకు వెన్నుదన్నుగా జగన్‌.. పార్టీకి బ్యాక్‌ బోన్‌‌గా బీసీలు, సామాజిక న్యాయానికి పెద్దపీ, మహిళలకు అన్నింటా అగ్రతాంబూలం ఇచ్చామని స్పష్టం చేస్తున్నారు.
లాక్‌‌డౌన్‌ రోజుల్లో పేదవాడి ఊపిరిగా ఆ పథకాలే...
వైసీపీ పాలన ప్రారంభమైన ఏడాదిలోనే యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌ రాష్ట్రంపైనా తీవ్ర ప్రభావం చూపింది. కొవిడ్‌19 వ్యాప్తి సమయంలో ఉపాధి లేక, తిండి గింజలకే గగనమైన ఆ భయంకరమైన రోజుల్లో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి  అమలు చేసిన సంక్షేమ పథకాలే పేదలకు ఆలంబన అయ్యాయని వైసీపీ నేతలు పలుమార్లు ప్రస్తావించారు. ‘ఆ సంక్షేమ పథకాలే లేకపోతే.. మా ప్రాణాలు ఏమైపోయేవో.‘ అని ఆ లాక్‌ డౌన్‌ రోజులను గుర్తు చేసుకుంటున్న వాళ్లు ఇంకా ఉన్నారు. దాదాపు రెండేళ్ళపాటు కరోనా సమయంలో, ప్రజలను, ముఖ్యంగా రెక్కాడితే గానీ డొక్కాడని పేదలను ఆదుకున్నది ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే. కరోనా వ్యాప్తి ప్రభుత్వానికి ఆదాయం పడిపోయి, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా, రాష్ట్రంలోని పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా అందించిన వైద్య సేవలుగానీ, సంక్షేమ పథకాల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసిన సొమ్ములుగానీ.. వారిని బతికించాయంటే అతిశయోక్తి కాదంటున్నారు వైసీపీ నేతలు.
మేనిఫెస్టోనే వైఎస్‌ఆర్సీపీ ఆత్మ...
ప్రతి పార్టీకీ ఒక పొలిటికల్‌ ఫిలాసఫీ ఉంటుంది. వైఎస్‌ఆర్సీపీ పొలిటికల్‌ ఫిలాసఫీ ఆ పార్టీ మేనిఫెస్టోనే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేదల సంక్షేమం. ఇదే వైఎస్‌ఆర్సీపీ ఫిలాసఫీ. కులం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు అసలే చూడం అంటూ ప్రతి గడపకూ సంక్షేమ పాలన అందిస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధిప్తామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వరకే పార్టీలు.. ఎన్నికల తర్వాత అందరి సంక్షేమం తమ బాధ్యత అన్నట్లు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. నవరత్నాల పాలనకు అర్ధం చెబుతూ... ఇంటింటికీ గడప గడపకూ అందే సామాజిక న్యాయం, సాధికారత. ఏపీ ప్రభుత్వం ఐదు రకాల సాధికారతలు లక్ష్యంగా ఈ మూడున్నర ఏళ్ళలో అడుగులు వేసింది. 
ఇందులో మొదటిది ఆర్ధిక సాధికారత– డీబీటీ, నాన్‌ డీబీటీ పరంగా అడుగులు వేసింది. 
రెండోది రాజకీయ సాధికారత– దీనికి అద్దం పట్టే విధంగా పదవులు, నియామకాలు. 
మూడోది సామాజిక సాధికారత– ఇందుకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎన్టీ, మైనార్టీ, పేదలే లక్ష్యంగా పథకాలు. 
నాలుగోది మహిళా సాధికారత– అన్నింటా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, మహిళలకు భద్రత, భరోసా.
ఐదోది విద్యా సాధికారత– విద్య ద్వారానే అందరి జీవితాల్లో మార్పులు, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల్లో పెను మార్పులు మార్పులు వస్తాయని ఈ విధానాలే జగన్‌ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి. 
చేతల్లో సామాజిక న్యాయం
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, బాబూ జగజ్జీవన్‌రామ్, మహాత్మ జ్యోతిబాపూలే, కొమరం భీమ్, మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ల వంటి మహనీయులు కలలుగన్న సామాజిక న్యాయాన్ని సీఎం జగన్ చేతల్లో చూపిస్తున్నారని ప్రజల నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్న నేత అని వైసీపీ చెబుతోంది. అమరావతి రాజధానిలో పేదలకు, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇళ్ళ పట్టాలు ఇస్తే డెమోగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని వాదించిన ఆనాటి  పాలకుల ఆలోచనలు, విధానాల నుంచి.. బ్యాక్‌ వర్డ్‌ వర్గాలే తమ ప్రభుత్వానికి బ్యాక్‌ బోన్‌ వర్గాలని ఢంకా బజాయించి చెప్పిన నాయకుడు జగన్‌ అంటున్నారు. బడుగు, బలహీనవర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా చైతన్యాన్ని మూడున్నరేళ్ళలోనే మంత్రివర్గం నుంచి క్షేత్రస్థాయి వరకు అమలు చేస్తున్నారు 
ఏపీ మంత్రి వర్గంలో దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చింది మొదలు.. 139 కులాల బీసీలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు నుంచి కార్పొరేషన్లు, నామినేటెడ్‌ పదవులు, దేవాదాయ శాఖ ఆలయ కమిటీలు, ట్రస్టు బోర్డులు పదవుల్లో, గ్రామ పంచాయితీ నుంచి మండలస్థాయి, మున్సిపల్, జిల్లా పరిషత్‌ పదవుల వరకు అన్నింటా 50 శాతంకుపైగా పదవులు అణగారిన వర్గాలే దక్కించుకున్నాయి. ఈ వర్గాలకు 50 శాతం పదవులు ఇవ్వాలని అసెంబ్లీలో చట్టం చేసిన ఏకైక నాయకుడు జగన్‌. అందులో మహిళలకు 50 శాతం పదవులు ఇచ్చారు. 


దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్లు చేయించి, జగనన్న కాలనీల ద్వారా ఇళ్ళు నిర్మిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో ఇప్పటికే 21.20 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇంతకాలం సామాజిక న్యాయం, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం మహిళలకు అన్న నినాదాలను రాష్ట్రంలో విధానంగా మార్చుతున్నారు.  
సామాజిక న్యాయం ఇలా..
జగన్‌ మంత్రిమండలిలో మొదటి విడతలో 56 శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు స్ధానం కల్పిస్తే.. రెండో విడతలో ఏకంగా 70 శాతానికి అవకాశం ఇచ్చారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రులు పదవులు ఇస్తే, అందులో నలుగురు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇచ్చారు. 25 మంది మంత్రుల్లో 11 మంది ఈ రోజు బీసీలే ఉన్నారు. జగన్‌  ప్రభుత్వంలో కేవలం మూడున్నర ఏళ్ళలో రాజ్యసభకు 8 మందిని పంపితే అందులో నలుగురు బీసీలే. శాసనమండలిలో పార్టీ తరపున 32 మంది ఎమ్మెల్సీలను చట్టసభలకు పంపితే.. అందులో 18 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు. శాసనసభ స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారామ్‌ బీసీ. శాసనమండలి చైర్మన్‌ మోషెన్‌ రాజు ఒక ఎస్సీ. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ మైనార్టీ వర్గానికి చెందిన జకియాఖానం అని వైసీపీ నేతలు సామాజిక న్యాయంపై సైతం గడప గడపకు ప్రభుత్వంలో ప్రచారం చేస్తున్నారు.