Vangaveeti Mohana Ranga Vardhanthi At Vijayawada: వైసీపీలోని కాపు నేతలు ఓ వైపున వంగవీటి మోహనరంగా వర్దంతి సందర్భంగా నివాళులర్పిస్తూనే మరోవైపు వంగవీటి రాధాకు సవాల్ విసురుతున్నారు. రంగాను హత్య చేసిన పార్టీలో ఉన్న వంగవీటి రాధా, దమ్ముంటే మాజీ సీఎం చంద్రబాబుతో రంగా చిత్రపటానికి నివాళులర్పించేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గుంటూరు మేయర్ హాట్ కామెంట్స్...
గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, వంగవీటి వారసుడు వంగవీటి రాధాకి సవాల్ విసిరారు. మోహనరంగాను హత్య చేసిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీలోనే ఉన్న వంగవీటి రాధా, చిత్తశుద్ది ఉంటే చంద్రబాబుతో రంగా చిత్రపటానికి నివాళులర్పించాలని సవాల్ చేశారు. అలా చేయలేని పక్షంలో టీడీపీ నుంచి రాధా బయటకు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. వంగవీటి రంగా వర్దంతిని పురస్కరించుకొని గుంటూరులో నిర్వహించిన కార్యక్రమాల్లో మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు పాల్గొని మాట్లాడారు. ఇప్పటికీ వంగవీటి రంగాకు నిజమయిన అభిమానులు ఉన్నారంటే, వారంతా వైసీపీ నేతలు, కార్యకర్తలేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ గూండాలు చంద్రబాబు నాయకత్వంలో వంగవీటి మోహన రంగాను దారుణంగా హత్య చేసిన విషయం ప్రజలు మరచిపోలేదన్నారు. వంగవీటి రంగాకు నిజమయినన వారసుడు ఏపీ సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. రంగా వారసుడు రాధా టీడీపీలో ఉన్నాడంటే, రంగా ఆత్మఘోషిస్తోందన్నారు. రంగా ఆశయాల కోసం వైసీపీ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. చంద్రబాబు గెలుపు కోసం రాధా పని చేయటం బాధాకరం అన్నారు. తన సవాల్ ను రాధా స్వీకరించాలని డిమాండ్ చేశారు.
గుడివాడలో గరం గరం...
తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహనరంగా వర్దంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అయితే ఇదే టైంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. గుడివాడలో ఒక రోజు ముందు నుంచే వంగవీటి రంగా వర్దంతి వేడుకలను వేదికగా చేసుకొని రచ్చ మెదలైంది. టీడీపీ నేతలకు రంగా వర్దంతిని నిర్వహించే అర్హత లేదంటూ వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో అర్దరాత్రి సమయంలో గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్దితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది.
కొడాలి నాని కామెంట్స్...
రాజకీయ నేతలకు, ప్రజలకు సేవ చేయాలనుకునే వారికి ఆదర్శనీయులైన ప్రజా నాయకుడు మోహనరంగా అని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రంగా చనిపోయి 34 సంవత్సరాలు గడిచినా.. ప్రజల గుండెల్లో చెరగని స్థానం ఏర్పరచుకున్న వ్యక్తి అని అన్నారు. ఎమ్మెల్యే అయినప్పటినుంచీ క్రమం తప్పకుండా 18 ఏళ్లుగా ఆయన జయంతి, వర్ధంతి సభలను నిర్వహిస్తూ, ప్రజా ఉద్యమ నాయకుడిగా ఆయన చేసిన సేవల్ని స్మరించుకుంటున్నామన్నారు. టీడీపీకి చెందిన కొన్ని కుట్రపూరిత రాజకీయశక్తులు రంగాను పొట్టన పెట్టుకున్నాయని, ఆయన్ను హత్య చేసిన కిరాతక వ్యక్తులు, కిరాతక పార్టీలు ఈరోజు ఎలాంటి దారుణ స్థితిలో ఉన్నాయో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 
వంగవీటి రంగా చేసిన తప్పేంటి..? ఆయన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని విభేదించి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఉద్యమించేందుకు, ఒక వ్యక్తి శక్తిగా మారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మరువలేని వ్యక్తిగా నేటికి కీర్తి గడిస్తున్నారని చెప్పారు. ప్రజల ఆదరణతో ఎదిగారని, అప్పట్లో రంగాకు లభిస్తున్న ఆదరణను చూసి కన్నుకుట్టి, ఓర్వలేని గుణంతో ఆయన్ను అడుగడుగునా ఇబ్బందులు పెడితే.. రాజకీయంగా పాతాళానికి తొక్కేయాలని చూస్తే ‘నాకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు. నన్ను అడుగు కూడా కదలనీయకుండా కట్టడి చేస్తున్నారని, ప్రాణానికి ముప్పు ఉందని  వంగవీటి మోహనరంగా  నిరసన దీక్షలో కూర్చొని బహిరంగంగా చెబితే.. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అతి కిరాతకంగా ఆయన్ను చంపించిందని ఆరోపించారు. ఆయన భౌతికంగా మనందరి మధ్య లేకుండా చేసినప్పటికీ, 34 ఏళ్లుగా ఆయన్ను ప్రజల గుండెల్లో నుంచి దూరం చేయలేకపోయారన్నారు. రంగాని హత్య చేసిన వ్యక్తులే ఈరోజు ఆయన వర్దంతులు, జయంతులు జరుపుతూ రాజకీయాలకు పేరును వాడుకుంటూ ఆయన బూట్లు నాకుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.