TDP leader Buddha Venkanna: గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఓటమి ఖాయమని తేలిపోయిందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంటన్న అన్నారు. అందుకే రౌడీ మూకలతో టీడీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు.
వంగవీటి వర్దంతి రాజకీయం...
వంగవీటి మోహనరంగా వర్దంతి చేయవద్దని చెప్పడానికి నాని ఎవరని ప్రశ్నించారు బుద్ధా వెంటకన్న. మోహనరంగా అన్ని వర్గాల గుండెల్లో నిలిచన వ్యక్తి అని అన్నారు. తన తండ్రి పేరుతో కార్యక్రమాలు వద్దని చెప్పే అర్హత వంగవీటి రాధాకృష్ణకు మాత్రమే ఉందన్నారు. కొడాలి నాని అనుచరులకు రంగా పేరు ఎత్తే అర్హత ఉందా అని నిలదీశారు. గుడివాడ ప్రజలు నానిని తరిమి కొట్టడం ఖాయమన్నారు. క్రిస్మస్ వేడుకులు పెడితే నాని దగ్గరకి పది మంది కూడా రాలేదన్నారు. కాపులు, బీసీలు, దళితులు, కమ్మ అందరూ నానిని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇష్టం వచ్చినట్లుగా తిరగడం, మాట్లాడటమే నానికి తెలుసునని, ఈ సారి గెలుస్తా అని చెప్పే దమ్ము నానికి ఉందా అని నిలదీశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా పేదల బియ్యం బొక్కారని, రంగా వర్దంతి చేయవద్దనడానికి అర్హత ఏంటని ప్రశ్నించారు. 
రాధాకృష్ణకు శనిలా పట్టి, ఆయన జీవితంతో ఆడుకున్నారని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 2014లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచే నాని కుట్ర చేశారని, 2019లో రాధాకు వైసీపీ నుంచి వైఎస్ జగన్ సీటు ఇవ్వకపోతే నాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాధా పార్టీని‌ వీడితే  నాని ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. మీకు పదవులు కావాలి, రాధాకృష్ణకు అన్యాయం చేస్తే మాట్లాడవా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న వేళ మళ్లీ రాధా, రంగా జపం‌ చేస్తున్నారని అన్నారు. ఓడిపోతే ఉరేసుకుంటానని అన్నా ప్రజలు కొడాలి నానిని  పట్టించుకోరని చెప్పారు. వైసీపీ రౌడీలు అరాచకాలు చేస్తే... టీడీపీ వాళ్లపై లాఠీఛార్జీ‌ చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు కూడా చట్ట ప్రకారం వ్యవహరించాలని, లేకుంటే అన్నీ గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. 
తాము తెగిస్తే మీరు రోడ్ల మీద కూడా తిరగలేరని, నానికి దమ్ముంటే పోలీసులు రక్షణ లేకుండా గుడివాడ సెంటర్లో  తేల్చుకుందా రావాలని సవాల్ విసిరిరారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలు‌ చేస్తారా, నాని గడ్డం వేసుకుని మాయల పకీరులా మాయలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాజకీయంగా నానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయన్నారు. ఇప్పటికైనా మంచిగా ఉంటే ప్రజలు, టీడీపీ శ్రేణులు క్షమిస్తారని, లేదంటే నానికి తగిన శాస్తి‌ చేయడం ఖాయమన్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న పోలీసులు..
గుడివాడ వెళ్లడానికి ప్రభుత్వ నుండి తాను అనుమతి ఎందుకు తీసుకోవాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు రావి వెంకటేశ్వర రావును కలిసేందుకు కూడా పోలీస్ అనుమతి తీసుకోవాలా అని నిలదీశారు. పోలీసులు ఎందుకు ఉదయం నుండి నన్ను వెంబడిస్తున్నరని ప్రశ్నించారు. రంగా వర్దంతిలో పాల్గొనేందుకు కూడా నాకు స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. అడుగడుగునా తనకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా పోలీసులు ఎవరి డైరెక్షన్ లో పని చేస్తున్నారని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం రావి వెంకటేశ్వర రావును బెదిరిస్తుందని, మమ్మల్ని బయటకు వెళ్ళకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రభుత్వం కుట్రచేస్తుందని, అసలు వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.