Jaggareddy :  టీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ అనే పేరును తొలగించి ..సీఎం కేసీఆర్..  తెలంగాణను అవమానించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏపీకి వెళుతున్నారు కాబట్టి చంద్రబాబు తెలంగాణకు వచ్చారని, సైలెంట్‌గా ఉన్న బాబును తెలంగాణకు రావడానికి కేసీఆరే అవకాశం ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ ను తీసేసి బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నారని, వారు ఇక్కడ బలపడేందుకు ఎందుకు ప్రయత్నించరని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జాతీయ పార్టీ పేరుతో ఏపీలో పోటీ చేస్తుంటే, టీడీపీ కూడా ఇక్కడ బలపడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లనే తెలంగాణలో ఈ పరిస్థితి తలెత్తిందని, చంద్రబాబును ఇక తప్పుపట్టడానికి ఏముందని జగ్గారెడ్డి ప్రశ్నించారు.


ఏపీలో కేసీఆర్ అట్రాక్ట్ చేయలేదు..కానీ తెలంగాణలో చంద్రబాబు చేస్తారు !


కేసీఆర్ ఏపీలో అట్రాక్ట్ చేయలేరు.. కానీ బాబు తెలంగాణను అట్రాక్ట్ చేయగలరని అన్నారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందన్నారు. కేసీఆర్‌లో ఎక్కడో ఓ మూలన సమైక్య భావన ఉందన్నారు. తెలంగాణ వాదాన్ని ముఖ్యమంత్రి చంపేశారని, రాజకీయ బ్రతుకునిచ్చిన చెట్టునే కేసీఆర్ నరికేశారన్నారు.చంద్రబాబు ఇక కేసీఆర్‌తో ఆడుకుంటారని, కూటములు, పొత్తులపై ముందు ముందు తెలుస్తుందని, తెలంగాణలో ఇక సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయని జగ్గారెడ్ది జోస్యం చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటకకు బిఆర్ఎస్ వెళితే టీడీపీ కూడా వెళుతుందన్నారు. బిఆర్ఎస్‌తో కేసీఆర్ సక్సస్ అయ్యే పరిస్థితి ఉండదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 


భవిష్యత్‌లో కాంగ్రెస్,  టీడీపీ , బీఅర్ఎస్ కలవొచ్చు ! 


భవిష్యత్‌లో కాంగ్రెస్,  టీడీపీ , బీఅర్ఎస్ కలిసిన కలవచ్చని జగ్గారెడ్డి అంచనా వేశారు.  షర్మిల ప్రభావం కొంత ఉండొచ్చు… బీఎస్పీ ప్రభావం కూడా ఉంటుందని అన్నారు. బీఅర్ఎస్ తెలుగు వాళ్ళు ఉన్న చోట్ల ప్రభావం ఉంటుందన్న ఆయన మళ్ళీ అక్కడికి కూడా టీడీపీ వెళ్తుందని తెలిపారు.   టీడీపీ ఇప్పుడు మంచి ఎంట్రీ దొరికిందని, చంద్ర బాబు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటాడని జగ్గారెడ్డి అన్నారు. బాబు ఈ అవకాశాన్ని వదులుకొడని, బాబు మీద ఎంత మంది మంత్రులు మొత్తుకున్నా లాభం లేదని జగ్గారెడ్డి తెలిపారు.


బీఆర్ఎస్ ఎక్కడికి వెళ్లినా టీడీపీ అక్కడికి వెళ్తుందని జగ్గారెడ్డి జోస్యం 
  
తెలంగాణ పంచాయితీ అయి పోయిందని ఇక కేసీఆర్ ఏపీ లో సక్సెస్ కాలేడని అన్నారు. కానీ చంద్రబాబు తెలంగాణ లో సక్సెస్ అవుతాడని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్న కేసీఆర్‌ చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదని కేసీఆర్‌ అన్నాడని జగ్గారెడ్డి గుర్తు చేశారు. కానీ తెలంగాణ వాదాన్ని అడ్డంపెట్టుకుని గెలిచాడని విమర్శించారు. తెలంగాణ వాదాన్ని కేసీఆర్‌ చంపేశాడని, రాష్ట్రం ఉంది కానీ వాదం పోయిందని జగ్గారెడ్డి తెలిపారు. చంద్రబాబు, టీడీపీ మీద ఎన్ని నోర్లు మొత్తుకున్నా లాభం లేదని అన్నారు. టీడీపీకి మంచి ఎంట్రీ ఇచ్చారు కేసీఆర్‌ అన్నారు.