AP Kapu Politics :  ఏపీలో రానున్న ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారుతోంది కాపు వర్గం. తమ చిరకాల కోరికలను తీర్చేవారికే మా మద్దతు అని ఇప్పటికే ఆ వర్గం నేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో కాపునాడు సభకి ప్రధాన పార్టీలు ముఖ్యంగా టిడిపి, వైసీపీ దూరంగా ఉండటం వెనక ఉన్న కారణాలపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకహోదా పోయింది.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కూడా ఇప్పుడు ప్రధాన అంశంగా ఏపీ రాజకీయాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం రాజకీయపార్టీలన్నీ కాపు జపం చేస్తున్నాయి. 


ప్రతీ ఎన్నికల్లోనూ కీలకంగా కాపు వర్గం 



గత ఎన్నికల్లోనే  కాదు ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కాపు ఓట్లు కీలకంగా ఉంటాయి. అందుకే పార్టీలు ఎన్నికల సమయంలో కాపు వర్గాన్ని ఆకట్టుకోవడానికి ఆయా పార్టీలు వ్యూహరచన చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ వర్గం నేతలు ఇక ఏ పార్టీని విశ్వసించే యోచనలో లేరు. అంతేకాదు తమ చిరకాల కోరికలను తీర్చే వాళ్లకే ఈసారి గెలిపిస్తామని షరుతులతో కూడిన ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధమైనట్లు కాపువర్గ నేతలు చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇప్పటికే కాపు నేత ముద్రగడ పద్మనాభం ఏపీ సిఎం  జగన్‌ కి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. మరోసారి మీరు గెలవాలంటే మా డిమాండ్ల గురించి ఆలోచించాల్సిందే అన్న హెచ్చరికలాంటిది ఈ లేఖ అన్న మాటలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. 


రిజర్వేషన్లు.. సీఎం పోస్టు లక్ష్యం 


గత కొన్నేళ్లుగా కాపు నేతలు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేంద్రం కేటాయించిన పది శాతంలో ఐదు శాతం కాపులకు కేటాయించింది. కానీ అది చెల్లదని సీఎం  జగన్ ఆపేశారు. అయితే అవి చెల్లుతాయని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో తీర్పు.. ఆ తర్వాత కేంద్రం క్లారిటీతో స్పష్టమయింది.  అందుకే కాపులు మరోసారి రిజర్వేషన్‌ పై పట్టుదలతో ఉన్నారు. అంతేకాదు ఈసారి సిఎం సీటుపై కూడా కన్నేశారు. రానున్న ఎన్నికల్లో కాపు ఓట్లు పడాలంటే రెండు షరతులను పెట్టారు ఆ వర్గం నేతలు. ఒకటి 5శాతం రిజర్వేషన్‌ రెండోది సిఎం సీటు అని తేల్చేశారు. ముద్రగడ రిజర్వేషన్‌ గురించి ప్రస్తావిస్తుంటే విశాఖలో జరుగుతున్న కాపుమహానాడు మాత్రం సిఎం సీటు ఇచ్చే పార్టీకే వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. 


వచ్చే ఎన్నికల్లో కాపుల ఓట్లు ఎవరికి ?


ఈ పరిణామాలతో రానున్న ఎన్నికలపై కాపు ఓట్ల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తి కరంగా మారింది.  విశాఖలో జరుగుతున్న కాపుమహాసభ వేదికగా మరోసారి తమ బలం చూపించి రానున్న ఎన్నికల్లో అనుకున్నది సాధించాలని ఆ వర్గం భావిస్తోంది. మరి ఈ సభకి వైసీపీ, టిడిపి దూరంగా ఉండటం వెనక ప్రధాన కారణం ఆ రెండు  కోరికలే అన్న మాటలు వినిపిస్తున్నాయి. జనసేనకి మద్దతుగా ఉందన్న కారణంతోనే ఈ రెండు పార్టీలు దూరంగా ఉన్నాయన్న టాక్‌ వినిపిస్తున్నా అసలు కారణం మాత్రం 5శాతం రిజర్వేషన్‌ , సిఎం సీటు అన్నది ప్రధానమని గుసగుసలు వినిపిస్తున్నాయి.