YSRCP Target mangalagiri : వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నియోజకవర్గాల్లో ఒకటి మంగళగరి. టీడీపీ యువనేత నారా లోకేష్ ఒక సారి అక్కడ్నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రెండో సారి అక్కడ్నుంచే పోటీ చేయబోతున్నారు. ఓడినప్పటికీ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకునే పని చేసుకుంటున్న ఆయన.. సొంత ఖర్చుతో ప్రజల్ని ఆదుకుంటున్నారు. మరో వైపు పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. బీసీ మంత్రం పాటిస్తూ.. లోకేష్ కు చెక్ పెట్టాలని వైసీపీ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పలువురు టీడీపీ నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. వారెవరూ సరితూగే పరిస్థితి లేదని క్లారిటీ రావడంతో కొత్త అభ్యర్థిని ఖరారు చేశారని అంటున్నారు.
చేనేత వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని వైసీపీ నిర్ణయం
లోకేష్‌కు చెక్ పెట్టాలంటే బీసీ అభ్యర్థిని అదీ కూడా చేనేత వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ తరపున 2014లో పోటీ చేసిన గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ఆయనకే టిక్కెట్ అన్న ప్రచారం జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు టిక్కెట్ రాదని క్లారిటీ రావడంతో సైలెంట్ అయ్యారు. గంజి చిరంజీవి కొన్నాళ్లు ఉత్సాహంగా తిరిగినా ఇటీవల ఆయనపైనా వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ నమ్మకం కలగడం లేదు. సొంత వర్గంలోనూ ఆయనకు పలుకుబడి లేదని ఏకపక్షంగా మద్దతిచ్చే పరిస్థితి లేదని తెలియడంతో.. అక్కడ ఎవరికీ తెలియని చేనేత వర్గానికి చెందిన ప్రముఖ నేతను నిలబెట్టాలని అనుకుంటున్నారు.
కర్నూలుకు చెందిన బుట్టా రేణుక పేరు దాదాపు ఫైనల్
కర్నూలు ఎంపీగా 2014dలో గెలిచిన బుట్టా రేణుక చేనేత వర్గానికి చెందిన వారే. అయితే ఆమెకు గత ఎన్నికల్లో టిక్కెట్ లభించలేదు. ఇప్పుడు కర్నూలులో కానీ.. మరో చోట కానీ టిక్కెట్ సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. అదే మంగళగిరిలో అయితే బాగుంటుందని ఐ ప్యాక్ తో సర్వేలు చేయించారని అంటున్నారు. గట్టి పోటీ ఇస్తారనే నమ్కకం ఏర్పడటంతో స్థానిక నేతలందర్నీ ఒప్పించే బాధ్యతను రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ కు అప్పగించారు. ఆయన మంగళగిరి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు. అందరూ అంగీకరిస్తే.. బుట్టా రేణుక మంగళగిరిలో పని ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.
లోకేష్ తరపున బాధ్యతలు తీసుకున్న పంచుమర్తి అనూరాధ
ఇటీవల ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించిన పంచుమర్తి అనూరాధ మంగళగిరనే తన ప్రోటోకాల్ నియోజకవర్గంగా ఎంచుకున్నారు. ఆమె కూడా మంగళగిరిలో చేనేత వర్గానికి చెందిన వారే కావడంతో.. టీడీపీ వైసీపీ వ్యూహానికి ప్రతి వ్యూహం అమలు చేయడం ప్రారంభించినట్లయింది. చేనేత పెద్దలతో లోకేష్ చాలా సార్లు సమావేశం అయ్యారు. అలాగే పంచుమర్తి అనూరాధ కూడా విస్తృతంగా పర్యటిస్తూండటంతో.. ఎన్నికల్లో మంగళగిరి పోరాటం ఓ రేంజ్‌లో జరిగే అవకాశం ఉంది.