AP Politics: వైసీపీ రివర్స్‌ పాలనకే కాదు రివర్స్ బారోయింగ్ పద్ధతికీ తెరలేపిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు చేసిన వైసీపీ సర్కార్‌... వాటికి లెక్కలు మాత్రం చూపడం లేదున్నారు. జగన్ చెప్పినట్లే ఈ నాలుగున్నరేళ్లలో కేవలం లక్షా 72 వేల కోట్లే అప్పు తెచ్చామని చెబుతున్నా... వాటిల్లో 91 వేల కోట్లకు లెక్కలే లేవు. ఈ లెక్కలు దాచడానికి రివర్స్ బారోయింగ్ అనే కొత్త పద్ధతిని తెచ్చిందని మనోహర్ ఆరోపించారు. లెక్కల్లో చూపని ఈ డబ్బంతా ఎటు పోయిందని మనోహర్ ప్రశ్నించారు. బడ్జెట్ ప్రిపరేషన్ లో ఈ విషయం బయట పడిందన్న ఆయన... ఆ కోట్లాది రూపాయలు ఎక్కడికి పోయాయి. ఎవరికి చేరాయన్నది ప్రభుత్వ పెద్దలకు, ఆర్థికశాఖ అధికారులకు తెలుసన్నారు, లెక్కలు, ఎటు పోయాయి అనేది ప్రభుత్వ పెద్దలకు, ఆర్థిక శాఖ ముఖ్య అధికారికి మాత్రమే తెలుసన్నారు.
నిధులపై చర్చించేదుకు సి‌ద్ధమా?
రివర్స్ బారోయింగ్ పేరు చెప్పి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,391.43 కోట్లు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.30,764.27 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.33,843.69 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.9,253.90 కోట్లు వైసీపీ ప్రభుత్వం సేకరించిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ నిధులపై చర్చించేదుకు సి‌ద్ధమా అంటూ మనోహర్ సవాల్ విసిరారు. జగన్ వస్తానంటే విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చర్చిద్దామంటూ ఆయన ప్లేస్ డిసైడ్ చేశారు. సాధారణ అప్పులు, కార్పొరేషన్ రుణాలు, ఇతర రుణాలతో సంబంధం లేకుండా ఈ కొత్త అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. రివర్స్ బారోయింగ్ ద్వారా తీసుకున్న అప్పుల సొమ్ము ప్రభుత్వ పథకాలకు గానీ, ప్రాజెక్టుల నిర్మాణాలకు గానీ, ఇతర పథకాలకు గానీ మళ్లించలేదని...మరి ఈ సొమ్ము మొత్తం ఎటుపోయినట్లని మనోహర్ ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల కన్నా ఇంకా ఎక్కువ మొత్తమే అప్పులు చేశారని...వీటన్నింటినీ సొంత ఖాతాలకు మళ్లించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
సభలు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా
రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసి రెండు అంతర్జాతీయ బ్యాంకుల వద్ద రాష్ట్రాన్ని బ్లాక్ చేసేలా చేసి, పరువు తీసిన ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా సిద్ధం అంటూ సభలు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని మనోహర్ ఎద్దేవా చేశారు. ప్రజలు జగన్‌ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ సభల్లో ప్రతిపక్ష నాయకుల బొమ్మలు పెట్టి పంచ్‌ బ్యాగులతో వారిని కొట్టించడం జగన్ సైకో ఇజానికి నిదర్శనమన్నారు. ఇలాంటి చర్యలు కార్యకర్తలను రెచ్చగొట్టమేనని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలు మేల్కొకుంటే ఆ తర్వాత వారిని కాపాడేందుకు జగన్ సహా నేతలెవ్వరూ రారని హెచ్చరించారు. త్వరలోనే పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్లు మనోహర్ తెలిపారు. 
బహిరంగ సభలతో పాటు కీలకనాయకులు, కార్యకర్తలతో ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేనలోకి చేరికలు పెరిగాయి. ప్రముఖ నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన తండ్రి కె. నారాయణస్వామి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. లక్ష్మీపతి గతంలో ఆర్టీఏ బోర్డు నెంబర్‌గానూ, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ గా పనిచేశారు.