Yanamala  letter is creating a stir in the Telugu Desam Party: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రాసిన ఓ లేఖ పై తెలుగుదేశం పార్టీ నాయకులు మండి పడుతున్నారు.  ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా వర్గాలు ఆయన చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసేందుకు ఆ లేఖ రాశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ లేఖ రాసి మూడు రోజులు అయింది. రోజు రోజుకు ఈ లేఖపై చర్చ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. విచిత్రంగా ఈ లేఖను ఇతర పార్టీల కన్నా టీడీపీ నేతలే ఎక్కువగా చర్చనీయాంశం చేస్తున్నారు. యనమల ఏ ఉద్దేశంతో ఈ లేఖ రాశారో మాత్రం ఇంకా ఆయన బయటకు వచ్చి స్పందించలేదు. 


కాకినాడ సెజ్ లో నష్టపోయిన బీసీ వర్గాలకు న్యాయం చేయాలని యనమల లేఖ 


కాకినాడ సెజ్, ఇతర పరిశ్రమల పేర్లతో పెద్ద ఎత్తున అగ్రకులాలకు చెందిన వాళ్లు బీసీల భూముల లాక్కున్నారని వారు పెద్దవాళ్లయ్యారు కానీ బీసీలు ఇంకా ఎదగలేదని యనమల రామకృష్ణుడు తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.  వారి భూములు వారికి ఇప్పించాలని లేఖరో కోరారు. ఈ  లేఖలో ఆయన కొంత మంది కులాల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయా వ్యాపారవేత్తల పేర్లలో కులాల తోకల్ని జత చేశారు. నిజంగా ఆయా వ్యాపారవేత్తల పేర్లలో లేని కులాల్ని కూడా తగిలించి రాయడంతో  సహజంగానే యనమల రామకృష్ణుడు కుట్రపూరితంగా .. బ్లాక్ మెయిల్ కోసం ఈ లేఖ రాశారన్న అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. 


ఎన్టీఆర్‌తో పాటు రాజకీయాల్లోకి వచ్చిన యనమల


యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ తో పాటు రాజకీయాల్లోకి వచ్చారు. యాదవ వర్గానికి చెందిన ఆయన తుని నుంచి వరుసగా ఐదు సార్లు గెలిచారు. మళ్లీ గెలవకపోయినా  ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా మంత్రిగా ఉన్నారు. 2014లో ఆయన ఓడిపోయినా మంత్రి పదవి లభించింది.  ఈ సారి మాత్రం ఆయనకు అవకాశం దక్కలేదు. బీసీ కోటాలో యనమల కుటుంబం పెద్ద ఎత్తున పదవులు పొందిందని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. తుని నుంచి ఈ సారి సోదరుడు కృష్ణుడుకి కాకుండా తన కుమార్తెకు సీటు ఇప్పించుకున్నారు.   యనమల కూతురు యనమల దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.  ఆయన అల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా గెలిచారు. ఆయన వియ్యంకుడు కడప జిల్లా మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.  యనమల స్వయంగా ఎమ్మెల్సీగా ఉన్నారు. 


రాజ్యసభ కోరుకున్నారా ? 
 
ఉమ్మడి తూ.గో జిల్లాలో ఆయన మాట కాదనుకుండా పనులు జరిగాయి. ప్రతి పనిలోనూ ఆయన ముద్ర ఉంటుంది. అంత పవర్ ఫుల్ రోల్ ఆయన పోషించారు. మరి ఆ కాకినాడ సెజ్ వస్తున్నప్పడు కానీ.. ఆ తర్వాత కానీ.. పరిశ్రమలు వస్తున్నప్పుడు కానీ ఫార్మా పరిశ్రమలకు వ్యతిరేకంగా భూపోరాటాలు జరిగినప్పుడు కానీ యనమల ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ఇక్కడ చాలా మందికి వచ్చేడౌట్.  దాన్నే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకూ టీడీపీ నేతలు ఆయన సిన్సియార్టీని సందేహించలేదు. కానీ ఒక్క లేఖతో ఆయన పరపతి అంతా క్యాడర్ లో పోగొట్టుకున్నట్లయింది. యనమల రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవి ఆశించి ఇలా రాజకీయం చేస్తున్నారని.. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎక్కువ మంది అనుకుంటుంటున్నారు. ఈ లేఖ ఉద్దేశం ఏమిటో.. అలా ఎందుకు రాయాల్సి వచ్చిందో యనమల క్లారిటీ ఇవ్వకపోతే పార్టీతో ఆయనకు గ్యాప్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.