YSRCP in NDA : ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి జగన్ మోహన్ రెఢ్డి హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఒక్క రోజులోనే బీజేపీ అగ్రనేతలిద్దరితోనూ సమావేశమయ్యారు మళ్లీ తిరిగి తాడేపల్లికి వచ్చేశారు. అయితే ఆయన ఏ అంశాలపై చర్చ జరిగిదంన్నదానిపై స్పష్టత లేదు కానీ.. కేంద్ర మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్న సమయంలో ఆయన పర్యటన ఢిల్లీ వర్గాల్లో విస్తృత చర్చకు కారణం అవుతోంది. ఇప్పటికే ఎన్డీఏలో చేరేందుకు వైసీపీ ఆసక్తి చూపించిందన్న ప్రచారం జరుగుతూండటమే దీనికి కారణం.
టీడీపీ ఎన్డీఏ గూటికి చేరకుండా జగన్ ప్రయత్నాలు
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం, నీతి ఆయోగ్ సమావేశాల కోసం గత నెలలో ఢిల్లీ పర్యటనకు వెల్లినసీఎం జగన్ ఎన్డీఏలో వైఎస్ఆర్‌సీపీ చేరికపై చర్చలు జరిపారన్న ప్రచారం జరిగింది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ.. టీడీపీ దగ్గరకు కదులుతున్న సూాచనలు కనిపిస్తూండటంతో సీఎం జగన్ చురుగ్గా కదిలారని అంటున్నారు. ఎన్డీఏలోకి మళ్లీ టీడీపీని ఆహ్వానించవద్దని.. అవసరం అయితే తమ పార్టీనే ఎన్డీఏలో చేరుతుందని బీజేపీ పెద్దలకు ఆయన హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. బీజేపీకి చెందిన కొంత మంది ఉన్నత స్థాయి నేతలు ఈ సమాచారాన్ని కొంత మంది రాష్ట్ర నేతలకు చేరవేశారు. ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దక్షిణాదిలో బీజేపీ నమ్మకమైన మిత్రుల కోసం చూస్తోంది. టీడీపీ తాము సిద్ధమేనని సంకేతాలు పంపుతోంది. కానీ అలాంటి చాయిస్ ఇవ్వకూడదని జగన్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
ఏపీకి కేంద్ర మంత్రి వర్గంలో లేని పదవి
దేశంలో అన్ని రాష్ట్రాలు చివరికి ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ ఏపీ నుంచి మాత్రం కేంద్రంలో ఓ మంత్రి లేరు. బీజేపీకి సీఎం రమేష్ రూపంలో ఒక్కరే ఎంపీగా ఉన్నారు. జీవీఎల్ నరసింహారావు యూపీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అందుకే వైసీపీని కేబినెట్ లోకి తీసుకుని వారికే మంత్రి పదవులు ఇస్తే ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుందన్న అంచనాలతో జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.
ఎన్డీఏలో జగన్ చేరితే రాజకీయాల్లో పెను మార్పులు !
ఎన్డీఏలో జగన్ చేరితే.. ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి. ఇప్పుడు బీజేపీతో పొత్తులో జనసేన ఉంది. అదే్ వైసీపీ ఎన్డీఏలో చేరితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన ఉండదు. బయటకు వచ్చేస్తుంది. టీడీపీతో కలిసి పోటీ చేస్తుంది. బీజేపీ, వైసీపీ కూటమితో.. టీడీపీ, జనసేన పోటీ పడతాయి. అయితే బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా పొత్తులు పెట్టుకుని సీట్లు ఇవ్వడం దండగేనన్న అభిప్రాయం ఉంది. కానీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా.. ఆ పార్టీ సహకారం .. ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీలు కోరుకుంటున్నాయి. సహకారం లేకపోయినా న్యూట్రల్ గా ఉంటే చాలని టీడీపీ నేతలనుకుంటున్నారు.
బీజేపీతో పొత్తంటే వైసీపీకి సాహసమే !
నిజానికి బీజేపీతో పొత్తు అంటే.. వైసీపీ సాహసం చేస్తోందనే అనుకోవాలి. ఎందుకంటే... వైసీపీ కోర్ ఓటు బ్యాంక్ లో ముస్లింలు ఉంటారు. దళితులు ఉంటారు. బీజేపీతో పొత్తును వీరు స్వాగతించరు. ఓ పదిశాతం వీరు వ్యతిరేకం అయినా.. బీజేపీ తరపున కలిసి వచ్చే ఓటు బ్యాంక్ ఉండదు. ఇలాంటి సమీకరణాలు చూసుకుంటే వైసీపీకి బీజేపీతో రిస్కేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముందు ముందు ఈ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. వైసీపీ కేంద్ర కేబినెట్ లో చేరుతుందా లేదా అన్నది రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.