Telangana BJP :  తెలంగాణ భారతీయ జనతా పార్టీతో ఆ పార్టీ హైకమాండ్ ఎన్నికలకు ముందు  ఆ ఆట ఆడుకుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడ్ని మార్చడం ద్వారా మొత్తం సిస్టమ్ కదిలిపోయేలా చేసింది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఒక్కరు కూడా ఎన్నికల గురించి ఆలోచించడం లేదు. పార్టీలో ఎవరు ఉంటారు.. ఎవరు వెళ్లిపోతారు.. ఎవరికి ఎలాంటి పదవులు దక్కుతాయన్న చర్చలే జరుపుతున్నారు.  అసలు బీజేపీ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే దానిపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటపడి మళ్లీ బీజేపీ రేసులోకి రావాలంటే చాలా సవాళ్లనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


బీఆర్ఎస్‌తో ఎలాంటి  బంధం లేదని నిరూపించుకోవాలి !


ముఖ్యంగా బీజేపీలో జరిగిన అనూహ్య మార్పులతో ఎక్కువగా జరుగుతున్న ప్రచారం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదిరిందన్నదే. ఇది ఆ రెండు పార్టీలనూ ఇబ్బంది పెట్టే అంశమే. కారణాలు ఏవైనా ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలు కాకుండా..  కొన్ని పరిణామాల వల్ల ప్రజలు కూడా దీన్ని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే.. బీజేపీ ఇప్పుడు ఎదుర్కోవాల్సిన మొదటి సవాల్.. బీఆర్ఎస్‌తో ఎలాంటి లోపాయికారీ ఒప్పందం లేదని ప్రజలను నమ్మించగలగడం. మాటలతో చెబితే ప్రజలు నమ్మలేరు. చేతల్లో చూపించాలి. అవి ఎలాంటి చేతలనేది రాజకీయాల్లో పండిపోయిన బీజేపీ నేతలే నిర్ణయించుకోవాల్సి ఉంది.  ఈ విషయంలో ఫెయిలయితే.. తెలంగాణలో బీఆర్ఎస్ బీ టీంగా ఉండిపోవాల్సి వస్తుంది. 


నేతల్లో ఐక్యత సాధించడం మరో సవాల్ ! 


బండి సంజయ్ నాయకత్వాన్ని కొంత మంది వ్యతిరేకించారనేది  నిజం. కానీ బీజేపీ హైకమాండ్ ఆ వ్యతిరేకత  కారణంగా బండి సంజయ్ ను మారుస్తారని ఎవరూ అనుకోలేదు. దీనికి బలమైన కారణం ఉంది. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గ్రామ స్థాయికి పార్టీని తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. పాదయాత్ర ద్వారా పార్టీకి ఊపు తెచ్చారు. అందుకే బండి సంజయ్ ను వ్యతిరేకించే వారిని సంతృప్తి పరిచేందుకు పదవులు ఇస్తారని ఇంకా మంకు  పట్టు  బడితే.. వేరే దారి చూసుకోమని చెబుతారని అనుకున్నారు. కానీ బండి సంజయ్ ను మార్చడం వల్ల.. ఇప్పుడు ఆయనపై సానుభూతి పెరుగుతోంది. ఆయనకు మద్దతుగా కొత్త నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు అందర్నీ ఏకతాటిపైకి తీసుకు రావడం బీజేపీ ముందున్న అతి పెద్ద సవాల్ . 


ఇక ముందు చేరికల్నీ పెంచుకోవాలి !


ఇప్పటి వరకూ బీజేపీలో వారు చేరుతారు.. వీరు చేరుతారని చెప్పుకున్నారు. బండి సంజయ్ ఏకపక్ష పోకడల వల్లే చేరడం లేదని సాకులు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు మొత్తం పరిష్కారం అయిపోయాయి. నాయకత్వం మారిపోయింది. ఇప్పుడు బీజేపీ ముఖ్య నేతలు చేయాల్సింది బీజేపీలో చేరికల్ని పెంచుకోవడం.  ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఎక్కువగా నేతల్ని ఆకర్షిస్తే.. మళ్లీ ట్రాక్ లోకి రావడానికి అవకాశం ఉంది. 


ఏం జరిగినా తెలంగాణ బీజేపీకి పెద్దగా సమయం లేదు. నిర్ణయాలన్నీ వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు ముంచుకొస్తున్నాయి మరి !