BRS Politis Hottopic : తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను కూడా బడ్జెట్ వరకే పరిమితం చేయడం.. వేగంగా ముగించేయాలని నిర్ణయించడంతో ఆ తర్వాత సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంటోంది. దీనికి కారణం అసెంబ్లీ నిర్వహణలో కేటీఆర్ ప్రాధానయం పెరగడమే. కేసీఆర్ వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలిస్తున్న వారికి ఖచ్చితంగా సచివాలయం ప్రారంభం తర్వాత ఎప్పుడైనా కీలక నిర్ణయం తీసుకోవచ్నన్న నమ్మకం ఏర్పడుతోంది. అయితే ఆ నిర్ణయం ఎక్కువ మంది ముందస్తు ఎన్నికలు అనుకుంటున్నారు. దాంతో పాటు కేటీఆర్ ను సీఎం చేయవచ్చన్న మరో ప్రచారం కూడా ప్రారంభమయింది.
అసెంబ్లీలో కేటీఆర్ యాక్టివ్ రోల్ !
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టారు. గవర్నర్ ప్రసంగం రోజున ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ నుంచి ఆహ్వానించి.. వీడ్కోలు పలికేందుకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కానీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొనలేదు. నిజానికి సభాధ్యక్షుడు అయిన కేసీఆర్ ఈ తీర్మానానికి సమాధానం చెప్పాలి. కానీ కేటీఆర్ ఆ బాధ్యత తీసుకున్నారు. విపక్షాల విమర్శలన్నింటికీ ఆయనే సమాధానం చెప్పారు. తర్వాత తీర్మానం ఆమోదం పొందింది. కేసీఆర్ ఇలా తన బాధ్యతల్ని అసెంబ్లీలో కూడా కేటీఆర్‌కు అప్పగించడంపై బీఆర్ఎస్‌లోనూ విస్తృత చర్చ జరుగుతోంది.
కేటీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తారని ఓ వర్గం మీడియాలో ప్రచారం
బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్న ఓ వర్గంమీడియాలో కేటీఆర్ త్వరలో సీఎం అనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం అంటూ.. పదవి నుంచి వైదొలిగి..కేటీఆర్ ను సీఎం చేస్తారని.. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలు జరుపుతారని ఈ కథనాలతో ఊహాగానాలు ప్రారంభమ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. అయితే ముందస్తుకు వెళ్లడం.. లేకపోతే.. కేటీఆర్ ను సీఎం చేయడం.. ఈ రెండింటిలో కేసీఆర్ ఓ ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగా నమ్ముతున్నారు. బడ్జెట్ ను కూడా మార్చికి బదులు ఫిబ్రవరిలోనే పెట్టడం.. అసెంబ్లీ సమావేశాలు కూడా వేగంగా పూర్తి చేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. సచివాలయం ప్రారంభం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ తర్వాత బీఆర్ఎస్ రాజకీయాల్లో కీలక మలుపులు ఉంటాయన్న నమ్మకం ఎక్కువగా తెలంగాణ అధికార పార్టీలో ఉంది.
గవర్నర్‌తో రాజీ ఈ కోణంలోనేనా ?
గవర్నర్‌తో యుద్ధమే అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్ ఒక్క సారిగా వెనక్కి తగ్గారు. కోర్టుకెళ్లి మరీ వెనక్కి తగ్గారు. గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు విమర్శలు కూడా చేయబోమని హామీ ఇచ్చారు. ఇప్పుడు అటు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నా.. ఇటు కేటీఆర్ ను సీఎం చేయాలన్నా.. గవర్నర్ సహకారం అత్యంత కీలకం. తీసుకోబోయే కీలక నిర్ణయానికి గవర్నర్ సహకారం కోసమే... వెనక్కి తగ్గారని భావిస్తున్నారు. ఈ అంశాలపై స్పష్టత ఉండటంతోనే గవర్నర్ ఢిల్లీకి వెళ్తున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాలు రానున్న రోజుల్లో ఉత్కంఠగా సాగనున్నాయి.