అసెంబ్లీలో రాష్ట్ర ఆర్దిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ అంతా డొల్ల అని, కేవలం ఎలక్షన్ స్టంట్ ను తలపిస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ‘ఆత్మస్తుతి – పరనింద’గా మాదిరిగా కేంద్రాన్ని తిట్టడం, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడటం తప్ప ఏమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సహా అన్ని వర్గాలను పూర్తిగా వంచించేలా బడ్జెట్ ను రూపొందించారని ఓ ప్రకటన విడుదల చేశారు బండి సంజయ్.
- ఎన్నికల మేనిఫెస్టోలో, వివిధ సందర్భాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు ఈసారి కూడా మొండి చేయి చూపించారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదు. ప్రతిపాదిత బడ్జెట్ లో 50 శాతం నిధులను కూడా ఖర్చు చేయని కేసీఆర్ ప్రభుత్వ తీరును చూస్తుంటే... మాటలు కోటలు దాటుతున్నయ్... చేతలు గడప దాటడం లేదనే సామెతకు అద్దం పడుతోందన్నారు.
‘దళిత బంధు’ పథకంతో ప్రజలను మరోసారి దగా
- రూ.లక్షలోపు రైతులకు రుణమాఫీ చేయాలంటే రూ.19,700 కోట్లు నిధులు కావాలి. కానీ ఈ బడ్జెట్ లో రూ.6,285 కోట్లు మాత్రమే కేటాయించారు. ‘దళిత బంధు’ పథకంతో ప్రజలను మరోసారి దగా చేశారు. గతేడాది దళిత బంధు పథకం కింద కూడా రూ. 17,700 కోట్లు కేటాయించినా పెద్దగా ఖర్చు చేయలేదు. రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలంటే మరో శతాబ్దం సమయం కూడా సరిపోదు. యావత్ దళిత సమాజాన్ని మోసం చేసే బడ్జెట్ ఇది. గిరిజన శాఖకు కేటాయించిన నిధులు గిరిజన బంధు అమలుకు ఏ మాత్రం చాలని పరిస్థితి. ఇది ముమ్మాటికీ గిరిజనులను మోసం చేయడమే. రాష్ట్రంలో 52 శాతానికిపైగా ఉన్న బీసీలకు బడ్జెట్ లో 2 శాతం నిధులే కేటాయించడం బాధాకరం.
- విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసేలా బడ్జెట్ కేటాయింపులున్నాయి. తెలంగాణలోని ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబం తమ సంపాదనలో విద్య, వైద్యానికి 50 శాతానికిపైగా ఖర్చు చేస్తున్నారు. మొత్తం బడ్జెట్ లో విద్యకు 7 శాతం, వైద్యానికి 4 శాతంలోపు మాత్రమే నిధులు కేటాయించడాన్ని చూస్తుంటే పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపేలా బడ్జెట్ కేటాయింపులు ఉండటం దారుణం.
- సాగునీటి పారుదల శాఖకు కేటాయించిన నిధులు అప్పులకు వడ్డీలకు కట్టడానికి, సిబ్బంది జీతభత్యాలకే సరిపోయేలా ఉంది. విద్యుత్ శాఖకు ఈ బడ్జెట్ లో కేటాయించిన రూ. 12 వేల కోట్లు ప్రభుత్వ శాఖల కరెంట్ బిల్లుల బకాయిలు కట్టడానిక కూడా సరిపోవు. కరెంట్ బకాయిలే రూ.20 వేల కోట్లకు పైగా ఉన్నాయి. మొత్తంగా డిస్కంలు 60 వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి. డిస్కంలను మరింత సంక్షోభంలో నెట్టేలా కేటాయింపులున్నాయి. రాష్ట్రంలో ఇండ్లు లేని వారి సంఖ్య లక్షల్లో బడ్జెట్ లో డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటాయించిన రూ. 12 వేల కోట్లు ఏమూలకు సరిపోవు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి చెల్లిస్తున్న రూ.2.63 లక్షల సొమ్మును తన ఖాతాలో వేసుకోవడానికి బడ్జెట్ లో నిధులను చూపారన్నారు బండి సంజయ్.
ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పెద్ద జోక్
- కేంద్రం నిధులతో నిర్మించిన రైతు వేదికలు, వైకుంఠధామాలు, పల్లె ప్రక్రుతి వనం, డంపింగ్ యార్డుల, వీధి దీపాల ఏర్పాట్లన్నీ తామే చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ చెప్పుకోవడం నీచ రాజకీయాలకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో సాగునీటి ఆయకట్టు భారీగా పెరిగిందని పచ్చి అబద్దాలు వల్లించారు. కేసీఆర్ సర్కార్ కు దమ్ముంటే ఏ ప్రాజెక్టు నిర్మాణంవల్ల ఎన్ని ఎకరాల సాగు పెరిగిందో వివరించాలి. తెలంగాణలో ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అనే పదమే ఉండదని, అందరినీ పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి 9 ఏళ్లుగా రెగ్యులరైజ్ చేయకపోగా.. ఉన్న ఉద్యోగాలను ఊడబీకిన కేసీఆర్ బడ్జెట్ లో మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామనడం పెద్ద జోక్.
దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పరుడు
- పరిపాలనా వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నదే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని బడ్జెట్ లో పేర్కొనడం మిలీనియం ఆఫ్ ది జోక్. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 50 వేల జీవోలను బయటపెట్టకుండా దాచేశారు కేసీఆర్. సెక్రటేరియేట్ ను కూల్చేసి పాలనా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. దేశంలోనే నెంబర్ వన్ అవినీతి పరుడు కేసీఆర్. అవినీతిరహిత, పారదర్శకత పాలన గురించి ఆయన చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించడమే అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయానికి, కేటాయింపులకు, ఖర్చులకు ఏ మాత్రం పొంతన లేని బడ్జెట్ అన్నారు.
- రూ. 2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆదాయం రూ.1.31 లక్షల కోట్లు చూపింది. మిగిలిన రూ.1.60 లక్షల కోట్లు ఎలా సమకూరుస్తారో చెప్పకపోవడం సిగ్గు చేటు. కేంద్రం గ్రాంట్లు, పన్నుల వాటా రూపేణా ఈ బడ్జెట్ లో రూ.62 వేల కోట్లకు పైగా చెల్లిస్తోంది. ఇవిపోగా మిగిలిన ఆదాయాన్ని కేసీఆర్ ప్రభుత్వం మద్యం, భూముల అమ్మకంతోపాటు అప్పుల ద్వారా, ప్రజలపై భారం మోపి సమకూర్చుకునేందుకు కుట్ర చేస్తోంది. కేసీఆర్ సర్కార్ డొల్ల బడ్జెట్ ను బీజేపీ పక్షాన ప్రజల్లో ఎండగడతాం అన్నారు బండి సంజయ్.