Karnataka BRS :   తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్పు చేసినప్పుడు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలో కీలక అంశం ... బీఆర్ఎస్ మొదటి టార్గెట్‌ను కర్ణాటకగా ప్రకటించడం.  బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిపోటీ కన్నడ గడ్డ నుంచి ఉంటుందని కేసీఆర్ కార్యవర్గ సమావేశంలో తెలిపారు.  హైదరాబాద్ – కర్నాటక జిల్లాల్లో జేడీఎస్ తో కలిసి పోటీ చేయనున్నట్లుగా తెలిపారు.  కర్నాటక రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుందని..  . గుల్బర్గా నుంచి బీదర్ వరకు పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగాచెప్పారు. కానీ తర్వాత సైలెంట్ అయిపోయారు. 
 
మహారాష్ట్రలో రెండు బహిరంగసభలు - కర్ణాటకపై సైలెంట్ !


మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. పార్టీ విస్తరించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.  రెండు బహిరంగసభలు ఏర్పాటు చేశారు. రెండింటికీ కేసీఆర్ హాజరయ్యారు. పలువురు నేతల్ని చేర్చుకుంటున్నారు. అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయని గెలిచి చూపిస్తామని అంటున్నారు.  దీనికి సరిహద్దు ప్రాంతాల బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాకుండా ... తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కర్ణాటక ఎన్నికలపై మాత్రం ఇంత వరకూ ఎలాంటి ఆలోచనలు చేయలేదు.   ఇప్పుడు కర్ణాటక ఎన్నికల షెడ్యూల్  వచ్చేసింది. కానీ కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్రేమిటన్నది స్పష్టత రాలేదు. ఏపీ, ఒడిషా లాంటి రాష్ట్రాలకు బీఆర్ఎస్ శాఖల అధ్యక్షుల్ని ఖరారు చేశారు కానీ కర్ణాటక విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఎవరినైనా చేర్చుకునే ప్రయత్నాలు కూడా చేయలేదు. 


బీఆర్ఎస్ మద్దతు కోసం పెద్దగా ప్రయత్నించని జేడీఎస్ !


దేవేగౌడ పార్టీ జేడీఎస్ తో పొత్తులు కన్ఫర్మ్ అయ్యాయని.. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.  బీఆర్ఎస్ పార్టీ ప్రతి అడుగులోనూ కుమారస్వామి కనిపించారు.  హైదరాబాద్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో ముఖ్యంగా తెలుగువారున్న చోట్ల బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మిగతా చోట్ల జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందన్నారు.   మొదట్లో బీఆర్ఎస్ కార్యక్రమాలకు పిలిచినప్పుడల్లా వచ్చిన కుమారస్వామి తర్వాత ముఖం చాటేస్తున్నారు. హైదరాబాద్ వైపు రావడం లేదు. బీఆర్ఎస్‌తో పని లేనట్లుగా రాజకీయం చేసుకుంటున్నారు. అభ్యర్థులను కూడా ప్రకటించుకుంటున్నారు. కారణం ఏదైనా కుమారస్వామి మొత్తంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  మద్దతును పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.  జేడీఎస్ సపోర్టుగా కర్ణాటకలో అడుగుపెడదామనుకున్న బీఆర్ఎస్ చీఫ్ కు పరిస్థితులు కలిసి రావడం లేదు. అయితే కుమారస్వామి మాత్రం కేసీఆర్ పై వ్యతిరేక ప్రకటనలు చేయడం లేదు. ఆయన మా మార్గదర్శి అని చెబుతున్నారు. కానీ ఎన్నికల పొత్తుల గురించి మాత్రం మాట్లాడటం లేదు. 


హఠాత్తుగా బీఆర్ఎస్ రాజకీయాల నుంచి అదృశ్యమైన ప్రకాష్ రాజ్ !


కేసీఆర్ .. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చాలనుకున్నప్పుడు  ప్రతి సమావేశంలోనూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించేవారు. ఓ సారి ప్రశాంత్ కిషోర్ తోనూ సమావేశం అయ్యారు. ప్రకాష్ రాజ్ కన్నడిగుడు కావడం అక్కడ ఆయనకు .. రాజకీయంగానూ కొంత ఇమేజ్ ఉండటంతో బీఆర్ఎస్ తరపున ప్రకాష్ రాజ్ అక్కడ పార్టీని లీడ్ చేస్తారేమో అనుకున్నారు. అయితే అనూహ్యంగా ప్రకాష్ రాజ్ సైలెంట్ అయిపోయారు. దీంతో కర్ణాటకలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థమవుతోంది. పొరుగు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఇక జాతీయ పార్టీ అర్థం ఏముంటుందన్న విమర్శలు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. 


ఇప్పటికే ఆలస్యం.. ఇప్పటికైనే కేసీఆర్ ప్లాన్ ప్రకటిస్తారా ?


ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ బీఆర్ఎస్ ఎలాంటి అడుగులూ వేయలేదంటే ఇక కర్ణాటక ఇప్పుడు పరుగులు పెట్టినా ఏమీ చేయలేరని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదంతా కేసీఆర్ వ్యూహామని.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనకుకోలేదని.. జేడీఎస్‌కు మద్దతిస్తారని అటంటున్నారు. ఏదైనా కానీ వీలైనంత త్వరగా ప్రకటన  చేయాలని బీఆర్ఎస్ క్యాడర్ కూడా కోరుకుంటున్నారు.