TDP 41 Years :  ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల గతిని మార్చేసిన తెలుగుదేశం పార్టీ 41వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఎన్టీఆర్ పార్టీ ప్రారంభించిన నాటి నుండి ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. ఓ ప్రాంతీయ  పార్టీ వరుసగా రెండు సార్లు ఓడిపోతే ఇక ఆ పార్టీ చరిత్రలో కలిసిపోవడమే. ఇప్పటికే ఎన్నో పార్టీలు అలా కలిసిపోయాయి. కానీ టీడీపీ మాత్రం వరుసగా రెండు సార్లు ఓడినా అత్యంత ఘోర పరాజయాలు చవి చూసినా ఎప్పటికప్పుడు ప్రజల అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వస్తూనే ఉంది. 2019లో ఎదురైనా పరాజయంతో ఇక టీడీపీ కోలుకుంటుందా అనే పొజిషన్ నుంచి మరో ఏడాదిలో జరగనున్న ఎన్నికల్లో తామే హాట్ ఫేవరేట్లమని ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలతో నిరూపించుకుంది. 41ఏళ్ల టీడీపీ మళ్లీ అధికారం సాధిస్తుందా ? పూర్వ వైభవం పొందుతుందా ?


ఆత్మగౌరవ నినాదంతో తెలుగు వెలుగు ! 


 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ సంచలనం. నవరస నటనా సార్వభౌముడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని పదిలం చేసుకున్న నందమూరి తారక రామారావు రాజకీయ అరంగేట్రం సమాచారం ప్రజల్లో సరికొత్త ఉత్సాహానికి కారణమైన సందర్భం.  తెలుగుదేశం అంటే.. ఆత్మగౌరవ నినాదం. తెలుగు జాతి చరిత్రను మలుపు తిప్పిన ఘట్టం అది. ఢిల్లీ పెత్తనంపై చేసిన తిరుగుబాటు.   ఎన్టీఆర్‌స్థాపించిన తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది.  పార్టీ ప్రారంభించిన 9 నెలల్లోనే అధికారాన్ని అందిపుచ్చుకున్న టీడీపీ.. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు... విమానాశ్రయంలో అవమానం జరిగింది. ఎలాంటి పదవి లేని రాజీవ్ గాంధీ.. ముఖ్యమంత్రిని తోసేయడం సంచలనం సృష్టించింది. దీంతో... తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించారు. అంతకు ముందే .. అరవై ఏళ్లు నిండిన తర్వాత ప్రజల కోసం పనిచేస్తానని ఎన్టీఆర్ ప్రకటించారు. అన్నట్లుగానే 1982 మార్చి 29న టీడీపీని ప్రారభించారు.అప్పుడు తెలుగువారికి సరైన గుర్తింపు లేదు. ఢి  దీన్ని ఎన్టీఆర్..తెలుగుదేశం పార్టీతో సమూలంగా మార్చి వేశారు.  ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చారు. ఆత్మగౌరవంతో... ఢిల్లీలోనూ రాజకీయాలు చేశారు. ప్రధానప్రతిపక్షంగా వ్యవహరించిన ఒకే ఒక్క ప్రాంతీయపార్టీ తెలుగుదేశం.  


ఢిల్లీని గడగడలాడించింది..! బడుగులకు రాజ్యాధికారం అందించింది..!


బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి, అప్పటివరకూ రాజ్యాధికారానికి దూరంగా వున్న కులాలకు రాజ్యాధికారంలోకి తెచ్చింది టీడీపీ.  స్త్రీలకు ఆస్తి హక్కును కల్పించినది తెలుగుదేశం. ఆంధ్రుల ఆత్మ గౌరవం పేరిట చేసిన నినాదం ఢిల్లీ గుండెల్లో ప్రకంపనలు సృష్టించింది. తెలుగువారి ఆత్మగౌరవ జెండాగా ఢిల్లీవీధుల్లో సంచరించారు. తెలుగు భాషకి, జాతికి ప్రత్యేక గుర్తింపును సంపాదించి పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్‌. గ్రామీణ జీవనంలో తిష్టవేసిన కరణం, మునసబు వంటి ఫ్యూడల్‌ వ్యవస్థలను రద్దుచేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలను దగ్గర చేసింది తెలుగుదేశం. అనేకమందికి రాజకీయ అవకాశాలు కల్పించి నేతలుగా తీర్చిదిద్దారు. ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న కీలక నేతల్ని చూస్తే వారి రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమయి ఉంటుంది. అందుకే చాలా మంది టీడీపీని ఓ రాజకీయ యూనివర్శిటీ అంటూంటారు. 


టీడీపీలో ఎన్నో సంక్షోభాలు - అయినా ఎప్పటికప్పుడు ముందడుగే !


తెలుగుదేశం పార్టీ ఎదుర్కోని సంక్షోభం అంటూ లేదు. తొలిసారి పార్టీ గెలిచినప్పుడే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు.. నాదెండ్ భాస్కరరావు దెబ్బకు అధికారం కోల్పోయినంత పనైంది. అయితే అదే పునాదిగా ఎదిగింది. తర్వాత ఎన్నికల్లో ఓటములు వచ్చాయి. అత్యంత ఘోరమైన ఓటములు వచ్చాయి.   ఎన్టీఆర్ నుంచి టీడీపీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చింది. తాను పెట్టిన పార్టీ తనతోనే అంతమవుతుందని అప్పట్లో ఎన్టీఆర్ అన్నారు కానీ..  టీడీపీ ఇప్పటికీ గట్టిగా నిలబడి పోరాడుతూనే మధ్యలో టీడీపీ పదేళ్లు అధికారానికి దూరమయింది. ఈ మధ్యలోనే రాష్ట్ర విభజన కూడా జరిగింది. దీంతో ఏపీకే పరిమితవ్వాల్సిన పరిస్థితి. తర్వాత ఏపీలో ఐదేళ్లు అధికారంలో ఉన్నా 2019లో దారుణ పరాజయం. నాలుగేళ్లు అష్టకష్టాలు పడి ఇప్పుడు మళ్లీ పార్టీ గాడిలో పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల విజయాల తర్వాత ఆ పార్టీలో ఉత్సాహం పెరిగింది. తెలంగాణలోనూ కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తున్నారు. 
 
 పూర్వ వైభవమే లక్ష్యంగా టీడీపీ పోరాటం ! 
    
ఏకపక్ష పార్టీ విధానాలతో విసిగి వేసారిపోయి ఉన్న తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశానికి సాదర స్వాగతం పలకడమేకాదు కొద్దిరోజుల్లోనే అనితర సాధ్యమైన విజయాన్ని కట్టబెట్టి రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఏపీలో అంత కంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని.. టీడీపీ భావిస్తోంది. అందుకే  అలుపెరుగని పోరాటం చేస్తామని అంటోంది. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకు వస్తే... ప్రాంతీయ పార్టీల చరిత్రలో ఆ పార్టీది సువర్ణ అధ్యాయమే అవుతుంది.