AP Early Elections : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వారాల వ్యవధిలో రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. గత పర్యటనకు ఈ పర్యటనకు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత గవర్నర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఏం చర్చించారో స్పష్టత లేదు. అయితే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలపై చాలా క్లారిటీతో ఉన్నారని తెలంగాణతో పాటే ఎన్నికలు జరిగేలా చూడాలని ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కోరుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై స్పష్టత కోసమే పదే పదే ఢిల్లీ పర్యటనలకు వెళ్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ ముందస్తుకు వెళ్లడానికి బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న సూచనలు !
అధికారంలో ఉన్న పార్టీ గ్రాఫ్ పడిపోతోందని తేలిన తర్వాత ఎన్నికలు ఎంత ఆలస్యం అయితే విపక్ష పార్టీకి అంత బలం. ఎందుకంటే ఓ సారి పడిపోతున్న పార్టీని మళ్లీ నిలబెట్టడం చాలా కష్టం. దిద్దుబాటు చర్యలు కూడా మైనస్ అవుతాయి. ఇప్పటిదాకా తప్పులు చేసినట్లుగా ఒప్పుకున్నట్లవుతుంది. అందుకే సీఎం జగన్ వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తుననట్లుగా అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను బయట ఎంత తేలిగ్గా తీసుకున్నా అది విస్తృత ప్రజాభిప్రాయంగా అంతర్గతంగా వైఎస్ఆర్‌సీపీ పెద్దలు విశ్లేషణ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యతిరేకతను అధిగమించాలంటే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఐ ప్యాక్ బృందం కూడా ఎర్లీ ఎలక్షన్స్‌నుప సిఫారసు చేసినట్లుగా చెబుతున్నారు.
ఏడాది చివరి నాటికి చుట్టుముట్టనున్న ఆర్థిక సమస్యలు !
ఏపీ ప్రభుత్వం ఆర్థిక సమస్యల్లో ఉంది. కొత్త అప్పుల పరిమితి వచ్చే ఆర్థిక సంవత్సరానికి లభిస్తుంది. అయితే పెరిగిపోతున్న వ్యయం.. పెరగని ఆదాయం కారణంగా ఎన్ని అప్పులు చేసినా ... అప్పులు తీర్చడానికే సరిపోయే పరిస్థితి. పథకాలకు అదనంగా అప్పులు తెచ్చుకోవాలి. ఏప్రిల్‌లో కేంద్రం కొత్త అప్పులకు పర్మిషన్ ఇస్తుంది. ఆ రుణాలతో ఏడాది చివరి వరకూ సులభంగా ప్రభుత్వాన్ని నడపవచ్చు. ఆర్థిక పరిస్థితులు అక్టోబర్, నవంబర్ నాటికి తీవ్రంగా మారిపోతాయి. పథకాలన్నీ అమలు చేసేసి ఎన్నికలకు వెళ్తే.. సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో అసంతృప్తి ఉండదని నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది.
పార్లమెంట్‌తో కలిసి అసెంబ్లీ ఎన్నికలు ఇబ్బందికరమే !
ఏపీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ప్రజల ఓటింగ్ ప్రయారిటీ మారిపోయే అవకాశం ఉంది.గత టీడీపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని ఫేస్ చేసింది. ఈ సారి తాము అలాంటి తప్పు చేయకూడదని విడిగా రాష్ట్ర అంశాలు హైలెట్ అయ్యేలా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని జగన్ అనుకుంటున్నట్లుగా తలుస్తోంది. అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణతో పాటు జరగాలని కోరుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఎలా వచ్చినా … దానికి తగ్గట్లుగా వ్యూహాలు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అనుకూలమైన పోలీసు అధికారులందర్నీ కీలక స్థానాల్లో నియమించేసింది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవని చెప్పారు. ఎన్నికల సన్నాహాలు మాత్రం ఆపలేదు. మరో ఏడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆర్థిక సమస్యలే కాకుండా పార్లమెంట్‌తో పాటు ఎన్నికలు జరిగితే పరిస్థితులు మారిపోతాయని.. అంచనా వేస్తున్నారు. అందుకే అసెంబ్లీకి విడిగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
డిసెంబర్‌లో ఆరు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయా ?
ఈ ఏడాది డిసెంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించి అక్టోబర్‌లోనే షెడ్యూల్ విడుదల చేస్తారు. ఈ సారి ఈ ఐదు రాష్ట్రాలతో పాటు అదనంగా ఏపీ కూడా చేరడం ఖాయమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. మరి సీఎం జగన్ నిజంగానే ముందస్తు ఆలోచన చేస్తున్నారా ? లేకపోతే ఆయన ఢిల్లీ పర్యటనల్లో మరో మర్మమేమైనా ఉందా ?