Telangana Model Munugode Election : మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఆయన గుజరాత్‌ మోడల్‌కు పోటీగా తెలంగాణ మోడల్‌ను దేశం ముందు ఆవిష్కరిస్తున్నారు గుజరాత్ మోడల్ అంతా గోల్ మాల్ అంటున్నారు. తెలంగాణ మోడల్ అచ్చమైన అభివృద్ధి అంటున్నారు. మరి ఈ ఉపఎన్నిక ఫలితంతో తెలంగాణ మోడల్‌పై కేసీఆర్ దేశవ్యాప్తంగా మరింత చర్చ జరపగలుగుతారా ?
 
తెలంగాణ మోడల్‌తో అంతా అభివృద్ధేనని టీఆర్ఎస్ ప్రచారం
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి 967 ప్రాంతాలు ఫ్లోరోసిస్‌ బాధిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ సమస్యను తీర్చడంలో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పూర్తి స్థాయిలో సఫలీకృతమైంది. ప్రస్తుతం తెలంగాణలో ఫ్లోరోసిస్‌ బాధిత ప్రాంతాలు సున్నా అని జల శక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితమేని టీఆర్ఎస్ చెబుతోంది.   మానవ వికాసం, ప్రజాసంక్షేమం, సామరస్యం లక్ష్యంగా కేసీఆర్‌ ప్రజారంజక పాలనను అందిస్తున్నారు. ఆయన పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నివర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దేశ ప్రజలందరూ తెలంగాణ ప్రజా సంక్షేమ అభివృద్ధిని, కేసీఆర్‌ నమూనాను కోరుకుంటున్నారని టీఆర్ఎస్ వాదన .


దేశంలో తెలంగాణ వ్యవసాయ రంగమే టాప్ !


 తెలంగాణ వ్యవసాయరంగ అభివృద్ధికి కేసీఆర్‌ ఏం చేశారో కళ్ల ముందు కనిపిస్తోందని టీఆర్ఎస్ చెబుతోంది.  తెలంగాణ వ్యవసాయరంగంలో కేసీఆర్‌ది ఒక సువర్ణ అధ్యాయం. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌తో పాటుగా, గ్రామాల్లోనే పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. సాగునీటి రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అద్భుత ప్రగతిని సాధించింది. కేసీఆర్‌ అవలంబించిన ఈ వ్యవసాయ నమూనా తమకూ కావాలని దేశవ్యాప్తంగా రైతాంగం కోరుకుంటున్నదని  ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా రైతాంగం వెన్ను విరిచేలా, వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేలా బీజేపీ నల్ల చట్టాలు తెచ్చే ప్రయత్నం చేసి దేశవ్యాప్తంగా రైతాంగం నుంచి తీవ్ర నిరసనలు రావడంతో చివరికి వెనుకడుగు వేసిందని..గుర్తు చేస్తోంది. తమ మోడలే రైతుల్ని ఆకట్టుకుంటుందని చెబుతోంది. 


దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ప్రచారం 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు.  విద్యుత్‌రంగాన్ని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగా బీజేపీ ఉచిత విద్యుత్‌ నిలిపివేసి మోటర్లకు మీటర్లు పెట్టాలని రాష్ర్టాలకు హుకుం జారీ చేసింది. కేంద్రం తెలంగాణ ధాన్యాన్ని కొనేందుకు విముఖత చూపిందని దీన్ని దేశ ప్రజలు గుర్తిస్తారని అంటోంది.  బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలంటే అందుకు కేసీఆరే ప్రత్యామ్నాయం అని యావత్‌ దేశం బలంగా విశ్వసిస్తున్నది. అందుకు మునుగోడు నుంచే తొలి అడుగు దేశవ్యాప్తంగా పడిందని టీఆర్ఎస్ నమ్మకంగా ఉంది. ఇప్పటికే తెలంగాణ మోడల్‌లో తొలి హామీ దేశవ్యాప్తంగా అందరికీ ఉచిత విద్యుత్, రైతు బీమా అని కేసీఆర్ ప్రచారం కూడా చేస్తున్నారు. దీనిపై జాతీయ మీడియాలో చర్చ కూడా జరిగింది. అందుకే మునుగోడుతో .. తెలంగాణ మోడల్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుందని.. టీఆర్ఎస్ నమ్మకంగా ఉంది.