మునుగోడు ఉపఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డిపైనే ఎక్కువ ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆయన పార్టీ తరఫున ప్రచారం చేయకుండా ఎస్కేప్ అయ్యారు. అంతే కాకుండా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి ఓటు వేసేలా ప్రచారం చేయాలంటూ కాంగ్రెస్ లీడర్లకు ఫోన్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. 


కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన పనిపై ఏఐసీసీ సీరియస్ అయింది. దీనిపై పదిరోజుల్లో వివరణ ఇవ్వాలంటూ మొదట నోటీసు ఇచ్చింది. మొదటి నోటీసులకు ఆయన స్పందించలేదు. దీంతో శుక్రవారం మరోసారి నోటీసులు జారీచేసింది. 


ఏఐసీసీ ఇచ్చిన నోటీసులపై కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పందించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కారణంగా మొదటి నోటీసులకు స్పందించలేదని.. రెండోసారి వచ్చిన నోటీసులకు ఆయన వివరణ ఇచ్చారు. అది ఫేక్‌ ఆడియో అని తెలిపారు. ఆ వాయిస్‌ తనది కాదన్నారు. 






పార్టీలో తాను చాలా సీనియర్ నేతనని చెప్పుకొచ్చారు వెంకట్‌రెడ్డి. ఎన్‌ఐయూఐ విద్యార్థి విభాగం నుంచి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నానని... తన సీనియార్టీకి తగిన ప్రాధాన్యత, గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


తాను బీజేపీ అభ్యర్థికి ఓటు వేయమని చెప్పినట్టు సోషల్ మీడియాలో వచ్చిన ఆడియో,వీడియో ఫేక్ అని చెబుతున్న వెంకట్‌రెడ్డి సమాధానంపై కాంగ్రెస్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.