Cotton Price Record: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి ధర రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఒకవైపు పెద్దపల్లి జిల్లాలో రూ.8400 పలకగా.. జమ్మికుంటలో ఏకంగా రూ.8700 పలికి రికార్డు సృష్టించింది. అసలే ఈసారి అధిక వర్షాలు రావడంతో చాలా వరకు పత్తి పంట దెబ్బతింది. అయితే ధరల విషయంలో పెరుగుదలతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు సీజన్ ప్రారంభమైన వెంటనే ఈ రేటు లభించడంతో రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరుగుతుందని ఆశలు పెంచుకుంటున్నారు. గత ఏడాది పెద్దపల్లి జిల్లాలో 62,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు.


ఈసారి దాదాపుగా 8 ఎకరాలు పెంచాలని లక్ష్యంతో అధికారులు ప్రచారం చేయగా సాగు విస్తీర్ణం మాత్రం 63 వేల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. అయితే వర్షాలు పడిన తరువాత పత్తి ధర లభించదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈసారి దిగుబడి తగ్గడంతో పక్క దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలలో పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో దిగుమతులకు అవకాశం లేకుండా పోయింది. ఇక తక్కువ ధరకే దొరికే విదేశీ పత్తి లభించకపోవడంతో వ్యాపారులు మొదటి సీజన్ నుండే కొనుగోళ్ల కోసం పోటీపడ్డారు. దీంతో పత్తి ధర అమాంతం పెరిగింది ఒక వైపు పత్తి బేల్ లతోపాటు గింజలకు కూడా అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం బేల్ ధర రూ.65,000 వరకు పలుకుతుండగా గింజలకు కూడా మంచి ధర లభిస్తుందని కొనుగోలు సూచిస్తున్నాయి.


గణంకాలు ఇవీ...


ఈసారి పెద్దపల్లి మార్కెట్లో 10 రోజుల కిందట ప్రారంభమైన పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వ మద్దతు ధర రూ.6380గా ఉంది. అయితే మొదటి రోజే 7వేలకు పైగా ధర పలకగా తరువాత కొంత వరకు తగ్గుతూ వచ్చింది. అయితే ప్రభుత్వ మద్దతు ధర కంటే కూడా తగ్గిన ధర ఎక్కువగా ఉండడం విశేషం. ఇక మరోవైపు ఈనెల మూడవ తారీకు నుండి క్వింటాల్ కు 8000 మార్కులు దాటిన పత్తి ధర గురువారం  మరింత పెరిగి 8300 గా నమోదయింది. ఇక కనీస ధర 7300గా ఉంది. అలాగే శుక్రవారం ఏకంగా రూ.8410గా గరిష్ట ధర పెరిగింది. కనీస ధర రూ.7010 గా నమోదయింది. ఇప్పటి వరకు పెద్దపల్లి మార్కెట్లో గమనిస్తే నవంబర్ నెలలో లభించిన అత్యధిక ద్వారా ఇదే...


ఇక గత సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్ చివరి వారంలో కొనుగోలు మొదలయితే డిసెంబర్ చివరి వారం పత్తి ధర రూ.8,000 కి చేరింది. ఫిబ్రవరిలో పదివేలు దాటి ఏప్రిల్ చివరి నాటికి రూ.13500 గా పెరిగింది. సాధారణంగా నవంబర్లో ప్రస్తుతం వచ్చిన ధర అత్యధికం అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పత్తిలో తేమశాతం అధికంగా ఉండే నవంబర్, డిసెంబర్ లో ఈసారి ఇంత ధర లభిస్తే ఏప్రిల్ వరకు డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు డిమాండ్ కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతో వ్యాపారులు సైతం వీళ్లంతా త్వరగా ఎక్కువ ధర పెట్టిన సరే కొనుగోలు చేయాలని డిసైడ్ అయ్యారు. దీంతో చివరి నిమిషంలో పత్తి కోసం పంట మార్పిడి చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈసారి తేమ శాతాన్ని వ్యాపారులు పట్టించుకోకపోవడం కొసమెరుపు.