AP CM Jagan :   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి సభలో విపక్ష నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎలాంటి ఘటనకు అయినా వంద శాతం వ్యతిరేకత.. లేదా వంద శాతం సానుకూలత రానట్లే.. సీఎం జగన్ చేసిన వ్యక్తిగత విమర్శల వీడియోలకూ అలాగే మిశ్రమ స్పందన వచ్చింది. వైఎస్ఆర్‌సీపీ సానుభూతిపరులు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిందాంట్లో తప్పేముందని.. వాదిస్తున్నారు. కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం..  చీఫ్ మినిస్టర్ పదవికి ఉన్న  ఔన్నత్యాన్ని కూడా ఆయన దిగజార్చేశారని.. అంటున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఆవేశంలో చేసినవి కావు. ప్రణాళిక ప్రకారం చేసినవే.  స్పీచ్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నట్లుగా  చూసి చదవడమే దీనికి సాక్ష్యం. తనకు రాజకీయంగా డ్యామేజ్ అవుతుందని ఆయన అనుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. చేశారంటే రాజకీయ లెక్కలు వేసుకునే ఉంటారని భావిస్తున్నారు. 


ఐప్యాక్  రాజకీయ లెక్కలేసి స్పీచ్‌లలో డోస్ పెంచుతోందా ?


సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్ట్రాటజీల విషయంలో  ఐ ప్యాక్‌పై పూర్తి స్థాయిలో ఆధారపడతారన్నది బహిరంగ రహస్యమే.  ముఖ్యమంత్రి విపక్షాలపై ఏ స్థాయిలో ఎదురుదాడి చేయాలన్నది కూడా వారే నిర్ణయిస్తారని .. పొలిటికల్‌గా ఆ లాంగ్వేజ్ వాడటం వల్ల.. ఉపయోగమేననని తేల్చి ఉంటారని అంటున్నారు. అందుకే.. జగన్మోహన్ రెడ్డి నిర్మోహమాటంగా.. విపక్ష నేతలపై కాస్త అనుచితంగా అనిపించినప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారని అంటన్నారు. గత కొంత కాలంగా జగన్మోహన్ డ్డి పథకాల  బటన్లు నొక్కే సభల్లో వ్యక్తిగత విమర్శలే హైలెట్ అవుతున్నాయి. చివరికి స్కూలు పిల్లలు పాల్గొన్న అమ్మఒడికి బటన్ నొక్కే ప్రోగ్రాంలోనూ పెళ్లాలు అంటూ  పవన్ పై విమర్శలు చేశారు. 


సీఎం జగన్ వ్యక్తిగత విమర్శలకు మద్దతు లభిస్తుందని అనుకుంటున్నారా ?


వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీ రాజకీయాల్లో రాజకీయ విమర్శలు అనే దానికి కొత్త అర్థాలు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ నేతలు .. విపక్ష నేతల్ని అసభ్యంగా దూషించడమే రాజకీయ విమర్శలు అయిపోయారు. ఇతర పార్టీల మహిళా నేతలు అయితే తమపై సోషల్ మీడియాలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాలపై కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నారు. పోలీసులకు ఫిర్యాదులు చేస్తే పట్టించుకోవడం లేదు. అందుకే పోస్టుల పెట్టిన వారి ఇళ్లపైకి వెళ్తున్నారు. ఇలాంటి వాటికి తమ పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభిస్తుందని వైసీపీ అగ్రనేతలు అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు. తమను అభిమానించే వారు విపక్ష నేతలపై వ్యతిరేకతతో ఉంటారని వారిని ఎంత ఎక్కువగా తిడితే తమపై అంత అభిమానం పెరుగుతుందన్న లెక్కల్లో ఏపీ అధికార పార్టీ ఉన్నట్లుగా చెబుతున్నారు. 


మరి న్యూట్రల్ ఓటర్ల సంగతేంటి ?


ప్రతీ రాజకీయ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంటుంది. అలాంటి ఓటు బ్యాంక్ ఉన్న పార్టీలో నిలబడతాయి. కానీ ఫలితాలను తేల్చేది మాత్రం న్యూట్రల్ ఓటర్లే. అధికారంలో ఉండే ప్రభుత్వానికి ఒక్కో సారి ఓటు బ్యాంక్ ఓటర్లు కూడా షాక్ ఇస్తారు. దానికి కారణం పరిపాలన సరిగా లేకపోవడం..అనుకున్నంతగా లబ్ది పొందలేదని బాధపడటం వంటివి. అలాగే చదువుకున్న వారు.. ప్రశాంతంగా జీవనం సాగాలనుకునేవారు.. పాలకుల నుంచి విపరీత ధోరణులను ఎక్స్ పెక్ట్ చేయరు. అధికార దుర్వినియోగం జరిగిందని భావిస్తే.. ఎక్కువ మంది తీవ్రంగా స్పందిస్తారు. ఫలితాలను తేల్చేది వీరే కావడంతో ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను వీలైనంతగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విపక్షాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. 


అయితే సీఎం జగన్ అన్ని లెక్కలేసుకునే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని.. తమకు లాభమేనని వైసీపీ కార్యకర్తలు భావిస్తూండగా.. అలాంటి సీఎంను ప్రజలు క్షమించరని.. ఆయనపై వ్యతిరేకత పెంచడానికి బాగా ఉపయోగపడతాయని విపక్షనేతలనుకుంటున్నారు. ఏది కరెక్టో ఎన్నికల ఫలితాలే తేల్చాలి.