Congress guarantees are not guaranteed: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర ఏళ్లు గడుస్తున్న తరుణంలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు,  ఇతర ప్రధాన హామీల అమలు తీరుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో  పెళ్లైన మూడు నెలలకే బిడ్డ పుడతారా అంటూ హామీల అమలుకు సమయం కావాలని కోరుతున్నప్పటికీ, సామాన్య ప్రజానీకం మాత్రం ఫలితాల కోసం వేచి చూస్తోంది.  

Continues below advertisement

అమలులోకి వచ్చిన పాక్షిక హామీలు

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం , ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంపు,  200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలులోకి తెచ్చింది. ఇవి క్షేత్రస్థాయిలో ప్రజలకు కొంత ఉపశమనం కలిగించాయి. అలాగే, గ్యాస్ సిలిండర్లను రూ. 500 కే అందించే పథకం కూడా లబ్ధిదారులకు అందుతోంది. అయితే, ఇవి కేవలం ఆరు గ్యారంటీలలోని ఒక భాగం మాత్రమే. 

Continues below advertisement

అపరిష్కృతంగా ఉన్న ప్రధాన హామీలు

అత్యంత కీలకమైన  మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2,500 నగదు బదిలీ హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీనిపై కోట్లాది మంది మహిళలు ఆశలు పెట్టుకున్నారు. అలాగే, రైతులకు ఇస్తామన్న రూ. 15,000 రైతు భరోసా  పంపిణీలో కూడా జాప్యం జరుగుతోంది. పాత బకాయిలు తీర్చడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో, కొత్తగా పెంచిన మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారనే దానిపై స్పష్టత కరువైంది. యువతకు ఇస్తామన్న యువ వికాసం కార్డులు, నిరుద్యోగ భృతి వంటివి కూడా ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. అతి పెద్ద సవాల్ పెన్షన్ల పెంపు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు సహా అనేక వర్గాలకు ఇస్తున్న పెన్షన్లను భారీగా పెంచుతామని రేవంత్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.కానీ ఇప్పటి వరూక అమలు కాలేదు.  ఆర్థిక ఇబ్బందులు - రేవంత్ రెడ్డి సమర్థన

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచుగా గత ప్రభుత్వం వదిలి వెళ్లిన  7 లక్షల కోట్ల అప్పుల గురించి ప్రస్తావిస్తూ, ఖజానా ఖాళీగా ఉండటం వల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందని వివరిస్తున్నారు. ఈ  వ్యాఖ్యలు రాజకీయంగా తనను తాను సమర్థించుకోవడానికి ఉపయోగపడవచ్చు కానీ, ప్రజల్లో ఉన్న అసహనాన్ని తగ్గించలేకపోతున్నాయి. సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడం కోసం ప్రభుత్వం కొత్త అప్పులు చేయాల్సి రావడం లేదా ఇతర అభివృద్ధి పనులకు నిధులు కోత విధించడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఆరు నెలల నుండి ఏడాది లోపు కనీస మార్పును ఆశిస్తారు. రెండున్నర ఏళ్లు దాటినా కీలక హామీలు అందకపోవడం వల్ల ప్రజల్లో నెమ్మదిగా వ్యతిరేకత  మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి , గ్రామీణ ఓటర్లు కేవలం వివరణల కంటే, తమ ఖాతాల్లోకి వచ్చే నగదు లేదా తమ బతుకుల్లో వచ్చే మార్పునే గమనిస్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వాక్చాతుర్యంతో ఎంతకాలం నెట్టుకొస్తుందో కానీ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి హామీల అమలులో పురోగతి చూపకపోతే అది పార్టీకి నష్టం చేకూర్చవచ్చు.

మాటలు కాదు.. చేతలు కావాలి

ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒక పవిత్రమైన పత్రం. దానిని కేవలం ఓట్లు దండుకోవడానికి ఉపయోగించే  కాగితం గా కాకుండా, ప్రజలతో చేసుకున్న ఒప్పందంగా భావించాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరణలను పక్కన పెట్టి, ఆర్థిక వనరులను సమకూర్చుకుని మిగిలిన హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో,  మరో అవకాశం ఇస్తాం అని చెప్పే లోపే ప్రజల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురయ్యే ప్రమాదం ఉంది.