ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొద్ది రోజులుగా అంచనా వేస్తూ వస్తున్నారు. బీజేపీకి విమర్శించేందుకు పెట్టిన ప్రెస్‌మీట్లలోనూ అదే చెప్పారు. ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్‌లతో జరిగిన భేటీల్లోనూ ఇదే అంచనా వేసినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ముందు నుంచీ హోప్స్ లేని పంజాబ్ మినహా మిగిలిన చోట్లా బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది ? బీజేపీ విషయంలో తీవ్రత తగ్గిస్తారా ? మరింత దూకుడుగా ముందుకెళ్తారా ?
2020 నవంబర్ తరహా ఘటనలు ప్రత్యక్షమవుతాయా ?
2020 నవంబర్‌లో తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగుతున్నాయి. ఆ సమయంలో కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. బీజేపీపై నిప్పులు చెరిగారు., కేంద్రం తీరుపై తీవ్రఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ.. బీజేపీతో యుద్ధమేనని ప్రకటించారు. జాతీయ స్థాయిలో బీజేపీ విధానాల్ని.. మోడీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టేందుకు కూటమి కడతానని ప్రకటించిన ఆయన.. అందులో భాగంగా కమ్యునిస్టులు మొదలు పలు పార్టీ నేతలతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. 2020 డిసెంబరు రెండో వారంలో ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి హైదరాబాద్ లో సమావేశాన్ని నిర్వహిస్తానని చెప్పారు. కానీ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఆయన ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని మోడీ, అమిత్ షాలతో సమావేశమయ్యారు. అప్పటి వరకూ బీజేపీకి వ్యతిరేకంగా చేసిన విమర్శలన్నింటినీ నిలిపివేశారు. బీజేపీ నేతలు ఎంత దారుణంగా విమర్శిస్తున్నా వీలైనంత సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఓ సారి పార్టీ కార్యవర్గ సమావేశంలో... బీజేపీతో రణం లేదు ...రాజీ లేదని పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. అన్నీ చెప్పలేనని పార్టీని కాపాడాకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికలకు ముందు చెప్పిన రణం .. యుద్ధం మాటలన్నీ తేలిపోయాయి. బీజేపీతో పోరాటంలో సైలెంటయ్యారు. కానీ అనూహ్యంగా మళ్లీ దాదాపుగా ఏడాది తర్వాత బీజేపీపై యుద్ధమేనంటూ మాట్లాడుతున్నారు.
2022 ఫిబ్రవరి నుంచి మళ్లీ బీజేపీతో యుద్ధం !
అప్పట్లో సైలెంట్ అయిన కేసీఆర్ మళ్లీ ఇటీవలే బీజేపీపై యుద్దం ప్రకటించారు. వడ్ల కొనుగోలు అంశంతో పాటు ... తెలంగాణపై పార్లమెంట్‌లో మోదీ చేసిన వ్యాఖ్యలు సహా ఏది చేతికి అందితే.. దానితో బీజేపిపై యుద్ధం చేయడం ప్రారంభించారు. పనిలో పనిగా దేశానికి మంచి నాయకత్వం రావాలని.. ఆయన చెబుతున్నారు. తన విజన్‌ను ఆవిష్కరిస్తున్నారు. సభ జరుగుతోందని.. వనపర్తిలోనా. .. వరంగల్‌లోనా అన్నదానితో సంబంధం లేకుండా బీజేపీపై విరుచుకుపడుతున్నారు. చివరికి బడ్జెట్ ప్రసంగంలోనూ బీజేపీపై విమర్శలను హైలెట్ చేశారు.
యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలేనని గట్టిగా నమ్మిన కేసీఆర్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని సీఎం కేసీఆర్ ఓ సారి ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా దేశ రాజకీయాలు, సమీకరణాలు, ప్రజల అభిప్రాయాల్లో మార్పు చూస్తామని.. వచ్చే సార్వత్రిక ఎన్నికలపైనా ఆ ప్రభావం ఉంటుందని ఆయన విశ్లేషించారు. అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ 175కి పైగా అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే మాత్రం బీజేపీ ఖతం అవుతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా శక్తులు బలం పుంజుకుంటున్నాయని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఆయన నమ్మకానికి ఈ ఎన్నికల ఫలితాలు చెక్ పెట్టినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ హవా ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.
ఇప్పుడు కేసీఆర్ అదే దూకుడు చూపిస్తారా ? వెనక్కి తగ్గుతారా ?
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం రెడీ కాలేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కేసీఆర్ రాజకీయాల గురించి తెలిసిన వారు.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ వెనుకబడితే తప్ప కేసీఆర్ దూకుడు కొనసాగించరని... ఏ మాత్రం బీజేపీకి సానుకూలత ఉన్నట్లుగా తేలినా మళ్లీ సైలంట్ అయిపోతారని విశ్లేషిస్తూ వస్తున్నారు. ఇప్పడు సీఎం కేసీఆర్ ఏం చేస్తారు ? అందరూ అనుకున్నట్లుగా పునరాలోన చేస్తారా ? గతంలోప్రకటించినట్లుగా యుద్ధం కొనసాగిస్తారా..? ఎందుకొచ్చిన జాతీయ రాజకీయాలులే అని మళ్లీ రాష్ట్రానికే ప్రాధాన్యం ఇస్తారాఅన్నది వేచి చూడాలి. ఆయన రాజకీయంగా తీసుకోబోయే నిర్ణయాల ఆధారంగా స్ట్రాటజీని అర్థంచేసుకోవచ్చు.