Will Jagan fight for special status :   వైఎస్ జ‌గ‌న్ కి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత ప‌రిస్థితులు త‌ల‌కిందుల‌య్యాయి. 151 సీట్ల నుంచి ఒక్క‌సారిగా 11 సీట్ల‌కు ప‌డిపోవ‌డంతోపాటు వైసీపీ అధినేత జ‌గ‌న్ తీవ్ర నిరాశ‌లో మునిగిపోయారు.  అసెంబ్లీలో కేవ‌లం 11 సీట్లే రావ‌డంతో ప్ర‌తిప‌క్ష హోదా క‌ల్పించమని అర్థించవ‌ల‌సి వ‌చ్చింది. అది కూడా త‌న‌ను ద్వేషిస్తున్నాడు, త‌న చావునే కోరుకున్నాడని చెప్పుకునే అయ్య‌న్న‌పాత్రుడుకి లేఖ రాయడం జగన్‌కు ఇబ్బందికరంగా మారింది. అయినా ప్రతిపక్ష హోదా వస్తుందన్న నమ్మకం లేదు. 


బీజేపీకే మద్దతు ప్రకటనలు 


మొన్నటిదాకా సిద్ధం స‌భ‌ల్లో నేను అభిమన్యుణ్న్ని కాదు అర్జునుడిని అని జ‌గ‌న్ చెప్పుకున్నప్ప‌టికీ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం  త‌ర్వాత చంద్ర‌బాబు త‌న‌ వ్యూహాల‌తో జ‌గ‌న్‌ని ప‌ద్మవ్యూహంలోకి నెట్టేశారన్న సైటైర్లు వినిపింస్తున్నారు.  ఆ విధంగా నువ్వు అర్జునుడివి కాదు.. అభిమ‌న్యుడివే అని చంద్రబాబు చెప్ప‌క‌నే చెప్పారు.  టీడీపీకి 16 మంది ఎంపీలుంటే, నాక్కూడా రాజ్య‌స‌భ 11, లోక్‌స‌భ‌లో 4 క‌లిపి 15 మంది ఎంపీలున్నార‌ని జగన్ పైకి చెప్పుకుంటున్న‌ప్ప‌టికీ బీజేపీ నుంచి ఆశించిన మ‌ద్ధ‌తు మాత్రం ల‌భించ‌డం లేదు. ఎన్డీఏలో టీడీపీ భాగ‌స్వామిగా ఉన్నా, జ‌గ‌న్ మాత్రం స్పీక‌ర్ ఎన్నిక‌ల్లో బీజేపీకే త‌న మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. ఇన్ని చేసినా జ‌గ‌న్ కోరుకున్న జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త కేంద్రం క‌ల్పించ‌లేదు.


ప్రత్యేకహోదా అస్త్రాన్ని చూపించిన నితీష్ కుమార్                      


బీహార్ సీఎం నితీశ్ కుమార్ రూపంలో ఆయ‌న‌కు ఒక‌దారి దొరికింది. బీహార్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల‌ని నితీశ్ డిమాండ్ చేయ‌డంతో జ‌గ‌న్‌కి వెయ్యి ఏనుగుల బ‌లం వ‌చ్చిన‌ట్ట‌యింది. టీడీపీని ఎదుర్కోవ‌డానికి స‌రైన స‌మ‌యంలో స‌రైన అస్త్రం దొరికిన‌ట్ట‌యింది వైసీపీకి. ఏపీకి సంబంధించి పోల‌వరం, ప్ర‌త్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశాల్లో ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా బీజేపీతో జ‌ట్టు క‌ట్టిన చంద్ర‌బాబు, భారీ విజ‌యం త‌ర్వాత క‌న్వినియంట్‌గా డిమాండ్‌లు ప‌క్క‌న‌పెట్టేసి అమ‌రావ‌తి మీద పూర్తిగా ఫోక‌స్ చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ నితీశ్ కుమార్ బీహార్ కు ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేయ‌డంతో బాబు కూడా ఇరుకున‌ప‌డిన‌ట్ట‌యింది.


చంద్రబాబుపై తృణమూల్ ఎంపీ విమర్శలు 


తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ క‌ల్యాన్ బెన‌ర్జీ వాషింగ్ పౌడ‌ర్ నిర్మా స్కీమ్‌లో భాగంగా ఎన్డీఏలో చేర్చుకుని చంద్ర‌బాబుపై కేసుల‌ని మాఫీ చేశార‌ని బీజేపీపై చేసిన‌ ఆరోప‌ణ‌లు స‌భ‌లో ఉన్న టీడీపీ ఎంపీలను ఇర‌కాటంలో ప‌డేశాయి.  ఎన్డీఏలో భాగ‌స్వామిగా ఉండి కూడా ప్ర‌త్యేక హోదా అడ‌గడం లేద‌ని రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చంద్ర‌బాబును దోషిగా నిల‌బెట్టేందుకు జ‌గ‌న్ వ్యూహ ర‌చ‌న చేసే అవ‌కాశం లేక‌పోలేదు. నితీశ్ చేసిన పని బాబుని ఇరకాటంలోకి నెట్టేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంతో పాటు తనపై ఉన్న కేసుల నేపథ్యంలో చంద్రబాబు సైతం గట్టిగా ప్రశ్నించలేడు. ఇది రాజకీయంగా చంద్రబాబుకి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంి.  చూడబోతుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం మొత్తం ప్రత్యేక హోదా చుట్టూనే తిరుగుతుందని అనుుకోవచ్చు.