KCR Assembly Suspence: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సాగుతున్న ఈ రాజకీయ చదరంగం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాల్లో తరచుగా ఒక విషయం స్పష్టం చేస్తున్నారు.. అదే కేసీఆర్ పట్ల గౌరవం. ఒక సీనియర్ నాయకుడిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా కేసీఆర్ సలహాలు రాష్ట్రానికి అవసరమని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సభకు రండి.. మీ అనుభవంతో సూచనలు ఇవ్వండి.. మీకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం కలగనివ్వం అంటూ రేవంత్ రెడ్డి బహిరంగంగానే హామీ ఇస్తున్నారు. కానీ కేసీఆర్ వస్తారా రారా అన్నదానిపై స్పష్టత లేదు.
అది రేవంత్ రాజకీయ వ్యూహమా?
ఒక రకంగా రేవంత్ రెడ్డి వేస్తున్న రాజకీయ బాణం అని బీఆర్ఎస్ నమ్ముతోంది. కేసీఆర్ సభకు వస్తే ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది, రాకపోతే బాధ్యత గల విపక్ష నేతగా ఆయన విఫలమయ్యారు అని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు అనేది రేవంత్ వ్యూహం. కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి వచ్చేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. పదేళ్లపాటు అప్రతిహతంగా అధికారాన్ని చెలాయించిన కేసీఆర్, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో సామాన్య ఎమ్మెల్యే సీటులో కూర్చోవడానికి మానసిక ఇబ్బంది పడుతున్నారా అన్న సందేహం కలుగుతోంది. తనకంటే జూనియర్ అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేసే విమర్శలను భరించడం ఆయనకు ఇష్టం లేదన్నది ఒక వాదన. అందుకే, ఆయన తన స్థానంలో హరీష్ రావు , కేటీఆర్‌ను ముందు పెట్టి సభలో పోరాటం చేయిస్తున్నారు.
తగ్గిన సంఖ్యాబలం - నైతిక ఇబ్బందులు
కేసీఆర్ సభకు రాకపోవడానికి మరో ప్రధాన కారణం.. బిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేల వలసలు. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ వైపు వెళ్తుంటే, సభలో కూర్చుని వారిని చూడటం కేసీఆర్‌కు కచ్చితంగా ఇబ్బందికరమైన విషయమే. పైగా, ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వేస్తున్న శ్వేతపత్రాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలపై సభలో నేరుగా రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ అని ఆయన భావిస్తుండవచ్చు. రేవంత్ రెడ్డి వాక్చాతుర్యం ముందు తన పాత ప్రసంగాలు పారకపోతే అది పార్టీ కేడర్ మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందన్న భయం కూడా ఉండవచ్చుని అంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల బిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఒక ప్రతికూల సంకేతం వెళ్తోంది. ప్రజలు విపక్ష నేతగా బాధ్యత ఇచ్చినా, ఆయన సభకు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదు అనే విమర్శను కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తోంది. రేవంత్ రెడ్డి పదేపదే ఆహ్వానిస్తున్నా కేసీఆర్ మౌనం వహించడం, ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గౌరవం లేని వ్యక్తిగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
రాజకీయ వ్యూహం మారుతుందా?
ప్రస్తుతానికి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారు. కానీ నందినగర్ లో కార్యకర్తల్ని కలుస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడైనా వ్యతిరేకత మొదలైతే, అప్పుడు తురుపుముక్కలా సభలోకి ప్రవేశించి రేవంత్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టాలని కేసీఆర్ వేచి చూస్తున్నారా అనే సందేహం కూడా ఉంది. అయితే, అప్పటివరకు రేవంత్ రెడ్డి తన గౌరవ మర్యాదల మంత్రాన్ని జపిస్తూ కేసీఆర్‌ను ఇరకాటంలో పెడుతూనే ఉంటారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఆహ్వానం ఒక రాజకీయ ఎత్తుగడ అయితే, దానికి కౌంటర్ ఇవ్వలేకపోవడం బీఆర్ఎస్ వైఫల్యం.