Congress Powe rPoint presentation:  తెలంగాణ అసెంబ్లీ  సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య  పవర్ పాయింట్ ప్రజెంటేషన్  రాజకీయాలు ముదురుతున్నాయి. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను ఎండగట్టేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో పీపీటీని ఒక అస్త్రంగా ఎంచుకుంది. ఇందుకు ప్రతిగా తాము చేసిన అభివృద్ధిని వివరించేందుకు తమకూ పీపీటీ ఇచ్చే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది.

Continues below advertisement

అసెంబ్లీలో కాంగ్రెస్ వ్యూహం 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగంలో జరిగిన  విధ్వంసం పై ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్, అదనపు ఖర్చు,   మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వంటి అంశాలపై పక్కా ఆధారాలతో కూడిన పీపీటీని సభలో ప్రదర్శించేందుకు సిద్ధమైంది. సభ మధ్యలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి, ప్రతిపక్షాన్ని ఇరకాటంలో పెట్టడమే కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశం. 

Continues below advertisement

తమకూ చాన్సివ్వాలంటున్న బీఆర్ఎస్

ప్రభుత్వ పీపీటీకి దీటుగా సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ఏకపక్షంగా తన వాదనను వినిపిస్తే సరిపోదని, ప్రధాన ప్రతిపక్షంగా తమ వెర్షన్ ప్రజలకు తెలియజేయడానికి తమకూ పీపీటీ చాన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఒకవేళ తమకు అవకాశం ఇవ్వకపోతే, గతంలో ఇలాగే అవకాశం నిరాకరించినప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభను బహిష్కరించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

గతంలో కాంగ్రెస్‌కు చాన్సివ్వని బీఆర్ఎస్               

అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో  పీపీటీ అంశం చర్చకు వచ్చింది. శీతాకాల సమావేశాల కాలాన్ని పెంచాలని, తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరగా.. స్పీకర్ ఆ వినతిని పరిశీలిస్తామని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాత సంప్రదాయాలను తెరపైకి తెస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పీపీటీలు ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలకు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదని, ఇప్పుడు తాము కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తామని కాంగ్రెస్ మంత్రులు స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.               

పాత సంప్రదాయాలు పాటిస్తామంటున్న కాంగ్రెస్                                  

2016లో అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రాజెక్టులపై పీపీటీ ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ కూడా తమకు అవకాశం ఇవ్వాలని అడిగింది. కానీ అప్పుడు బీఆర్ఎస్  ప్రభుత్వం నిరాకరించింది. ఇప్పుడు సీన్ రివర్స్ కావడంతో, అప్పుడు మీరు మాకు ఇవ్వలేదు.. ఇప్పుడు మేము మీకు ఇవ్వం  అనే  కాంగ్రెస్ వాదిస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తామని అంటున్నారు.  తమకు అసెంబ్లీలో పీపీటీ చాన్స్ ఇవ్వకపోతే..  కాంగ్రెస్‌కు కౌంటర్ గా  తెలంగాణ భవన్‌లో పీపీటీ ఇచ్చేందుకు హరీష్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు.