Telangana BJP : తెలంగాణ బీజేపీలో నెలకొన్న డైలమాకు ఆ పార్టీ హైకమాండ్ తెర దించింది. బండి సంజయ్ నే పార్టీ అధ్యక్షుడుగా ఉంటారని.. ఆయనను మార్చేది లేదని మరోసారి ఖరాఖండిగా తేల్చేసింది. నిజానికి గత నెల రోజుల వ్యవధిలో ఇలా చెప్పడం రెండో సారి. పదే పదే ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. తెలంగాణ బీజేపీలో పరిస్థితులు అలా ఉన్నాయి మరి. గతంలో యాక్టివ్ గా పాదయాత్రలు చేసిన బండి సంజయ్.. ఇప్పుడు నెమ్మదించారు. పెద్దగా కార్యక్రమాలు చేపట్టడం లేదు. అదే సమయంలో ఆయనకు బదులుగా మరొకరికి చాన్సివ్వాలని బలమైన నేతల వర్గం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తోంది. లేకపోతే వారంతా పార్టీ మారుతారన్న ప్రచారంతో బీజేపీలో గందరగోళం ఏర్పడింది.
బీజేపీపై గట్టిగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం
బీజేపీ కర్ణాటకలో ఓడిపోవడం.. ఆ పార్టీ కర్ణాటక శాఖకే కాదు.. తెలంగాణలోని బీజేపీకి కూడా ఇబ్బందికరంగా మారింది. అక్కడ ఓడిపోవడంతో.. తెలంగాణలోనూ సానుకూల వాతావరణం ఉండదన్న ప్రచారం ప్రారంభమయింది. దీంతో చేరికలు జరుగుతాయని ఆశపడుతున్న నేతలకు.. షాక్ తగిలినట్లయింది. చేరుతారనుకున్న వారు వెనక్కి తగ్గడమే కాదు.. ఉన్న వారు కూడా.. పక్క చూపులు చూస్తున్నారన్న భావన బలంగా ఏర్పడింది. కొంత మంది నేతలు వివాదాస్పద ప్రకటనలు చేయడమే దీనికి కారణం. పార్టీని ఇబ్బంది పెట్టే ప్రకటనలు చేస్తే సహించేది లేదని ఈ ప్రకటనల తర్వాత హైకమాండ్ ప్రతినిధుల నుంచి ప్రకటన వచ్చింది. తర్వాత వారు సైలెంట్ అయ్యారు..అయితే వివాదాస్పద ప్రకటనలతో నే కాదు...అసలు పార్టీ పరమైన వ్యవహారాల్లోనూ కనిపించడం లేదు.
బీఆర్ఎస్‌కు .. బీజేపీనే ప్రత్యామ్నాయం అని పార్టీలో చేరిన వారికి ఉక్కపోత !
కర్ణాటక ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అవుతుందని చాలా మంది నమ్మలేదు. అదే కారణం చెప్పి.. కేసీఆర్ ను ఓడించాలంటే బీజేపీ వల్లనే అవుతుందని చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరిపోయారు. అయితే ఇటీవలి కాలంలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్ స్టాండింగ్‌పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇది ఆ నేతల్ని ఉక్కపోతకు గురి చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు కవిత జోలికి రాకపోవడం.. కేసీఆర్ కూడా బీజేపీపై విమర్శలు చేయకపోవడం కొత్త సమస్యగా మారింది. దీంతో వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరగడానికి కారణం అవుతోంది. అదే సమయంలో బండి సంజయ్ దూకుడు.. ఇతర నేతల్ని కలుపుకెళ్లలేకపోవడం.. పూర్తిగా మత పరమైన రాజకీయానికే ప్రాధాన్యం ఇవ్వడం వంటివి ఆ సీనియర్ నేతలకు నచ్చడం లేదు. ఇలాంటి వాతావరణాన్ని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారు.
తరుణ్ చుగ్ క్లారిటీ ఇచ్చినందున సైలెంట్ అయిపోతారా?
తెలంగాణ బీజేపీ సీనియర్లకు ముఖ్యంగా అసంతృప్తితో ఉన్నారనుకుంటున్న వారికి స్పష్టమైన సంకేతాన్ని బీజేపీ హైకమాండ్ పంపింది. బండి సంజయ్ ను మార్చేది లేదని చెప్పేసింది. సీనియర్లకు కీలక పదవులు ఉంటాయో ఉండవో చెప్పడం లేదు. బీజేపీలో ప్రచార కమిటీ చైర్మన్ లాంటి పదవులు ఉండవు. మరి బీజేపీలో ఉన్న నేతలంతా.. సర్దుకుపోతారా.. పోలోమంమటూ కాంగ్రెస్ కు పోతారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. వారి నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు కానుంది.