TDP Vs YSRCP Vs BJP : అసలు ఆ రోజు ఏం జరిగింది.. ? తెలుగు రాజకీయాలను ఫాలో అయ్యే వారందరికీ ఇప్పుడు అదే డౌట్. జూన్ 3 వ తేదీ చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఏదో జరిగింది. అందకే తెలుగు రాజకీయ క్షేత్రంలో అంతటి మార్పు. దానిని అన్ని పార్టీల వాళ్లూ రకరకాలుగా అన్వయించుకుంటున్నారు. బీజేపీ మా నుంచి దూరం అయిందని వైసీపీ చెప్పగానే అంతా టీడీపీకి చేరువైందేమో అనుకుంటున్నారు. కానీ ఏపీ పొలిటికల్ సీన్ అలా కనిపించడం లేదు. అసలు ఏం జరిగి ఉండటానికి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం.
వారం రోజులుగా ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు !
వారం రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఒకటే అలజడి. ఉన్నట్లుండి బీజేపీ పెద్ద టర్న్ తీసుకుంది. ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా మాటల యుద్ధం ప్రారంభించింది. అది కూడా స్థానిక నాయకులు కాదు. భారతీయ జనతా పార్టీ టాప్ బాస్ లే వైసీపీపై ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... హోంమంత్రి అమిత్ షా బహింరంగ సభా వేదికల మీద వైసీపీని టార్గెట్ చేయడంతో అందరూ అసలేం జరిగిందనే చర్చ ప్రారంభించారు.
అమిత్ షాతో మీటింగ్‌పై టీడీపీ గుంభనం
కారణం ఏంటన్నది స్పష్టంగా తెలియడం లేదు కానీ.. మార్పు మొదలైంది మాత్రం జూన్ 3 న చంద్రబాబు ఢిల్లీ యాత్ర తర్వాతే. చాలా ఏళ్ల తర్వాత చంద్రబాబు బీజేపీ నేతల్ని నేరుగా కలవడానికి వెళ్లారు. పిలుపు కూడా వారి నుంచే వచ్చిందని టీడీపీ వర్గాల నుంచి ప్రచారం జరిగింది. అయితే ఏ విషయాన్నైనా భారీగా ప్రచారం చేసుకునే తెలుగుదేశం పార్టీ ఇంత ముఖ్యమైన మీటింగ్ తర్వాత మాత్రం మాట్లాడలేదు. చంద్రబాబు పర్యటన ఫెయిల్ అయిందని అక్కడ బీజేపీ నుంచి ఎలాంటి హామీ రాకపోవడం వల్లే బాబు సైలంట్ అయ్యారని వైసీపీ వర్గాలు ప్రచారం కూడా చేశారు. కానీ ఆ తర్వాత వారం రోజులకు దాని ఫలితం కనిపించింది. శ్రీకాళహస్తి నుంచి జేపీ నడ్డా, విశాఖ వేదికగా అమిత్ షా జగన్ ను ఊపిరితిప్పుకోనీయకుండా ఆరోపణలు చేశారు. బీజేపీ- వైసీపీ బంధం అన్నది బహిరంగమే. టీడీపీతోదూరం అయ్యాక బీజేపీ జగన్ మోహనరెడ్డికి అన్ని విధాలుగా సహకరిస్తున్న విషయం అందరికీ విదితమే. ఎప్పుడూ అందుతున్న అప్పుల సాయంతో పాటు...ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నిధులను కూడా విడుదల చేయడమే అందుకు సాక్ష్యం. మరి తమతో ఎంతో సఖ్యతగా ఉంటున్న వైసీపీ విషయంలో బీజేపీ స్టాండ్ మారడానికి కారణం ఏంటి... ?
అసలు భేటీలో ఏం జరిగింది?
తెలుగుదేశం మంత్రాంగం ఫలించిందా..? వైసీపీ ఆరోపిస్తున్నట్లు బీజేపీలోని టీడీపీ కోవర్టులు పనిని విజయవంతంగా చేయగలిగారా.. అన్నది తేలాలి. అదే నిజమైతే అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది ముఖ్యం. చంద్రబాబుతో సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డాతో పాటు, అమిత్ షా కూడా అన్నారు. పొత్తులకు సంబంధించిన సమీకరణాలు, పరిణామాలపై చంద్రబాబు ప్రజంటెషన్ కూడా ఇచ్చినట్లు తెలుగుదేశం వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇంకో పక్క ఈ మీటింగ్ చాలా తక్కువ సేపు జరిగిందని.. అమిత్ షా చంద్రబాబుతో సరిగ్గా మాట్లాడలేదని ఓ రకంగా మీటింగ్ ఫెయిల్ అని బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేకులు ప్రచారం చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే .. మీటింగ్ పొత్తుల విషయంలోనే సక్సెస్ అయ్యిండాల్సిన పనిలేదు. కొన్ని సందర్భాల్లో పొత్తు లేకపోవడం కూడా సక్సెస్ కిందే లెక్కే. ఒకవేళ పొత్తు కుదిరితే మరో పార్టీకి సక్సెస్ కింద లెక్క. అలాంటి సంక్లిష్టమైన పరిస్థితి ఏపీలో ఉంది..
1. ఇక్కడ కలిసిన పర్పస్ ఏంటన్నది ముఖ్యం కానీ.. పొత్తు కుదిదిందా లేదా అన్నది కాదు. ఏపీలో రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే.. ఏవీ కూడా బీజేపీని కాదనే పరిస్థితుల్లో లేవు. తమ తమ సమస్యల వల్ల జగన్ మోహనరెడ్డి కానీ.. చంద్రబాబు నాయుడు కానీ.. పవన్ కల్యాన్ కానీ బీజేపీని గట్టిగాఎదిరించే పరిస్థితి లేదు.
2. బీజేపీ ఎప్పటి నుంచో ఎన్డీఏ లో చేరాలని ఒత్తిడి తెస్తున్నా.. తనకున్న మైనార్టీ ఓట్లు దూరం అవుతాయాన్న ఉద్దేశ్యంతో జగన్ పార్టీకి దూరంగా ఉంటూనే ప్రభుత్వానికి మాత్రం దగ్గరగా ఉంటున్నారు.
3. బీజేపీని దూరం చేసుకుని నష్టపోయామని.. ఈ ఎన్నికల్లో గెలవాలంటే కేంద్రం అండ ఉండాలని తెలుగుదేశం అనుకుంటోంది. అదే సమయంలో బీజేపీతో కలిస్తే.. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్నభయమూ ఉంది. ఇవన్నీ తెలిసే.. బీజేపీ నేతలను కలవడానికి చంద్రబాబు వెళ్లారు. మరి ఆ కలవడం పొత్తు కోసమా.. లేక సయోధ్య కోసమా.. సయోధ్య ఫలించినందునే బీజీపీ వైసీపీమీద దాడులు మొదలు పెట్టిందా.. లేక టీడీపీతో చెడడం వల్లే వైకాపాను టార్గెట్ చేసిందా.. ?
టీడీపీని దెబ్బతీయడానికి ఇదో వ్యూహమా ?
అదేంటి టీడీపీ తో సయోధ్య కుదరకపోతే.. వేసీపీని టార్గెట్ చేయడం ఏంటి.. టార్గెట్ చేయాల్సింది టీడీపీని కదా అన్న అనుమానం రావొచ్చు. ఇక్కడే చాలా మందికి అనుమానాలున్నాయి. బీజేపీ పర్పస్ ఫుల్ గా వైసీపీని టార్గెట్ చేస్తుందా అన్న అనుమానాలు అవి. మైనార్టీ ఓట్లను కన్సాలిడేట్ చేసి.. మెజార్టీ ఓట్లను పొందడం కోసం.. ఎంఐఎం బీబేపీ రహస్య అవగాహనకు వచ్చాయన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా అదే ట్రిక్ వాడబోతున్నారని కొంతమంది టీడీపీ నేతల అనుమానం. కిందటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు నోటా కన్నా తక్కువ. 0.8శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఆ పార్టీ బలం పుంజుకున్న సూచనలైతే లేవు. మరి ఇంత తక్కువ ఓటు శాతంతో బీజేపీ ఏ పార్టీకైనా ఏం సాయం చేయగలుగుతుంది... ? కాబట్టి ఓట్ల మద్దతు ద్వారా కాకుండా.. ఓట్లను కన్సాలిడేట్ చేయడం ద్వారా సాయం చేసే అవకాశం ఉంది. మైనార్టీలు వైసీపీకి దూరం కాకుండా వారి ఓట్లను పటిష్టం చేసే ఉద్దేశ్యంతోనే ఉత్తిత్తి ఫైటింగ్ చేస్తున్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి.. వైసీపీ నేతలు బీజేపీ విషయంలో డౌన్ టోన్ తో మాట్లాడటం చూస్తుంటే ఆ అనుమానాలు మరింతగా కలుగుతున్నాయని మొదటి రెండు రోజులూ విశ్లేషణలు నడిచాయి.
జగన్‌పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నిస్తున్న టీడీపీ
ఇప్పుడు ఆ అనుమానాలు మరింతగా పెరగడానికి కూడా ఆస్కారం కలుగుతోంది. ఎందుకంటే బీజేపీ రియాక్షన్ తర్వాత తెలుగుదేశం స్పందించిన తీరు అలా ఉంది. బీజేపీ సభలు జరిగిన తర్వాత టీడీపీ నుంచి ఎవరూ మద్దతుగా మాట్లాడలేదు. పైగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు.. ఇన్నాళ్లూ వైసీపీకి సాయం చేసింది మీరు కాదా అని బీజేపీని నిందించారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు కూడా అదే టోన్ లో మాట్లాడారు. “బీజేపీ చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వండి “ అనకుండా మరి “తప్పు చేస్తే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు” అని బీజేపీనే ప్రశ్నించారు. టీడీపీ ప్సందిస్తున్న తీరు చూస్తుంటే.. బీజేపీ – వైసీపీ మధ్య రహస్య అవగాహన ఉందా అన్న అనుమానాలకు ఆజ్యం పోస్తున్నట్లు ఉంది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అండ లేకుండానే ఇన్నాళ్లూ అప్పులు తెచ్చుకున్నారా అన్నారు.
మొత్తానికి ఈ పరిణామాలు అన్నీ చూశాక.. ఆ రోజు ఏదో కీలకమైన పరిణామమే జరిగిందన్న విషయం రూఢీ అవుతోంది. ముందుగా చెప్పుకున్నట్లు మీటింగ్ పర్పస్ పొత్తు కుదరడం ఒక్కటే కాకపోవచ్చు. వాళ్ల ఉద్దేశ్యం ఏంటన్నదే ముఖ్యం. టీడీపీ పర్పస్ నెరవేరినట్లైతే.. బీజేపీ నిజంగానే వైసీపీని ఎదిరిస్తోందనుకోవాలి. అదే సమయంలో బీజేపీని నేరుగా సమర్థిస్తే.. కలిగే నష్టాన్ని గుర్తించి... టీడీపీ బీజేపీని కూడా ఓ మాట అంటోందనుకోవాలి. లేదా బీజేపీ తమకు సహాయకారిగా ఉన్న జగనే కావాలనుకుంటుంటే.. చంద్రబాబు మీటింగ్ ఫెయిల్ అయి ఉండాలి. రహస్య అవగాహనలో భాగంగా పైకి ఫైట్ చేస్తూ ఉండాలి. ఏ రెండిట్లో ఏది నిజమో తెలీడం లేదు కానీ.. రాజకీయాలు మాత్రం పైకి కనిపించేంత ప్లెయిన్ గా లేవన్నది మాత్రం నిజం.