గత వారం ఏపీలో పర్యటించిన బీజేపీ అగ్రనేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఏపీలోనే జరుగుతోందని ఆరోపించారు. దీనిపై వైసీపీ  కూడా ఘాటుగానే స్పందించింది. ఇరు పార్టీల మధ్య మాటల దాడి కొనసాగుతోంది. ఈ విషయంలో ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న టీడీపీ ఇప్పుడు గేర్ మార్చింది. నేరుగా చంద్రబాబే ఈ ఎపిసోడ్‌లో కీలకమైన కామెంట్స్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. 


కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్కడ నేతలను కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ప్రజలతో కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈక్రమంలోనే ఓ రోడ్‌షోలో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్‌షా చేసిన ఆరోపణలపై చేసిన ఈ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్‌లో చర్చకు దారి తీస్తున్నాయి. 


జగన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఏకంగా దేశ హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చెప్పారని చంద్రబాబు ప్రస్తావించారు. ఇన్ని ఆరోపణలు చేసిన వాళ్లు చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడిన  వైసీపీ నాయకులు తమ సొమ్ములను విదేశాల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. 2000 రూపాయలు రద్దు చేస్తే తేలు కుట్టిన దొంగలు మాదిరిగా ఆ డబ్బులను బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారని విమర్శించారు.  


బీజేపీలో చేరిన టీడీపీ నేతలు ఇచ్చిన స్క్రిప్టునే అగ్రనేతలు చదువుతున్నారన్న వైసీపీ చేస్తున్న విమర్శలకు ఇది ఓ కౌంటర్‌గా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ మధ్య సీఎం జగనే మాట్లాడుతూ తనకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని కామెంట్ చేశారు. అంటే బీజేపీ, టీడీపీ తమపై దాడి స్టార్ట్ చేశాయని వైసీపీ అటాక్ మొదలు పెట్టింది. 


వీటన్నింటికి కౌంటర్‌గానే చంద్రబాబు ఈ కామెంట్స్ చేశారన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తనకు బీజేపీ అండ ఉండకపోవచ్చని జగన్ అంటే... ఆరోపణలు సరే చర్యలు ఎప్పుుడు తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. తాము చెప్పినట్టు బీజేపీ వినడం లేదని... తాము కూడా బీజేపీని ప్రశ్నిస్తున్నామనే అభిప్రాయాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు 


దేశంలో వివిధ రాష్ట్రాల్లో అక్రమార్కులపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు తీవ్రమయ్యాయి. అవినీతిపరులను తాము రక్షించడం లేదని బీజేపీ పదే పదే చెబుతోంది. కానీ జగన్‌ అవినీతిపై ఆరోపణలు చేసిన వ్యక్తులు చర్యలు ఎప్పుడు తీసుకుంటారని  టీడీపీ ప్రశ్నిస్తోంది. జగన్‌పై బీజేపీకి సానుభూతి ఉందనే సంకేతాలు పంపించడంతోపాటు ఆ రెండూ కలిసే ఉన్నాయనే చెప్పడానికి కూడా టీడీపీ ప్రయత్నిస్తోంది. 


గత ఎన్నికల ముందు రాష్ట్రానికి అన్యాయం చేశారని ధర్మపోరాటాలు చేసి టీడీపీని బీజేపీ దూరం పెట్టింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత నేరుగా గానీ, పరోక్షంగా కానీ కేంద్రాన్ని, బీజేపీని ఎక్కడా చంద్రబాబు, టీడీపీ లీడర్లు విమర్శించింది లేదు. దగ్గర అయ్యేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నించారు. ఈ మధ్యే చంద్రబాబు నేరుగా వెళ్లి అమిత్‌షాను, నడ్డాను కలిసి వచ్చారు. ఆ తర్వాతే ఏపీ ప్రభుత్వంపై బీజేపీ విమర్శల ఘాటు పెరిగింది. ఇప్పుడు జగన్‌పై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ డెవలప్‌మెంట్స్ అన్నీ కూడా కాస్త ఆసక్తిగానే ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు.