BRS Vs BJP :   మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల తర్వాత..  ఏం జరిగిందో కానీ..  కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా వరకూ సైలెంట్ అయ్యాయి. తెలంగాణలో పెద్దగా సోదాలు చేయలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల జోలికి వెళ్లలేదు. నిజానికి మల్లారెడ్డి ఇళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో చాలా అక్రమాలు బయటపడ్డాయని.. మనీలాండరింగ్ జరిగిందని ఐటీ శాఖ ఈడీకి కూడా లేఖ రాసింది. కానీ ఈడీ ఇప్పటి వరకూ స్పందించలేదు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజీ కుదిరిందని అందుకే సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా ఇప్పుడు మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణలో విరుచుకుపడుతున్నాయి. దీంతో మళ్లీ కేసీఆర్ యుద్ధం ప్రకటించే సమయం వచ్చిందా అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభమయింది. 


కేసీఆర్‌కు అత్యంత  సన్నిహితులపైనే ఐటీ దాడులు ! 


బుధవారం ఐటీ దాడులు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీపై జరిగాయి. వీరంతా కేసీఆర్‌కు నమ్మకస్తులు, సన్నిహితులు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి .. సీఎం కేసీఆర్ తరపున చాలా కార్యక్రమాలు చక్కబెడతారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అయినప్పటికీ ఆ నియోజకవర్గ బాధ్యత అంతా కొత్త ప్రభాకర్ రెడ్డి చూసుకుంటారు. ఇక  షాపింగ్ మాల్స్ అధినేత,  నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కూడా కేసీఆర్ ఆత్మీయులే. వీరిని టార్గెట్ చేసి ఐటీ దాడులు చేయడం అంటే.. బీజేపీ ఏదో పక్కా  ప్లాన్ వేసిందన్న అభిప్రాయం ఏర్పడటం సహజమే. ఒకే సారి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీపై ఐటీ దాడులు చేయడాన్ని యాధృచ్చికంగా జరిగిన  అంశంగా కూడా బీఆర్ఎస్ నేతలు చూడలేకపోతున్నారు. 


బీజేపీ మళ్లీ టార్గెట్ చేస్తోందా ?


బీజేపీ ఏదైనా  రాష్ట్రంలో అడుగు పెట్టాలనుకుంటే ముందుగా  త్రివిధ దళాలను పంపుతుందని చెబుతూంటారు. ఆ త్రివిద దళాలు ఐటీ, ఈడీ, సీబీఐ. పశ్చిమ బెంగాల్ లో గత ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ ను ఈ దర్యాప్తు సంస్థలు ఎలా ఉక్కిరిబిక్కిరి చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపుగా సగం మంది తృణమూల్ నేతలు బీజేపీలో చేరిపోయారు. అయినప్పటికీ అక్కడ మమతా బెనర్జీనే విజయం సాధించారు.. అది వేరే విషయం. తెలంగాణలోనూ కేసీఆర్ ను అలాగే ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటి దాడులు జరిగిన తర్వాత ఆగిపోయాయి. మళ్లీ ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఈ దాడులు ఇలాగే కొనసాగితే మాత్రం బీజేపీ బెంగాల్ ప్లాన్ అమలు చేస్తోందని అనుకోక తప్పదంటున్నారు. 


కేసీఆర్  వేచి చూస్తారా ? మళ్లీ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తారా ?


గతంలో దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్న కేసీఆర్ బీజేపీపై యుద్ధం ప్రకటించారు. దేనికైనా సిద్ధమన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా మార్చారు. అయితే తర్వాత కాస్త దూకుడు తగ్గించారు. ఇప్పుడు మళ్లీ బీజేపీపై విరుచుకుపడే సందర్భం వచ్చిందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. బీజేపీపై దూకుడు తగ్గించడం వల్ల ప్రజల్లో ఇప్పటికే తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని.. ఇప్పుడు మళ్లీ యుద్ధం ప్రారంభిస్తే.. బీజేపీ విషయంలో రాజీ పడలేదని ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు. అయితే రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో కేసీఆర్ ను మించిన వారు లేరు. ఆయన కొద్ది రోజులు వేచి చూసి పరిస్థితిని బట్టి స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.