YSRCP Early Polls :   తెలంగాణతో పాటు ముందస్తు ఎన్నికలు ఏపీకి కూడా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. దానికి తగ్గట్లుగానే సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు అక్టోబర్‌లో షెడ్యూల్ .. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ ఉండే అవకాశం ఉంది. ఏపీ కూడా కలిస్తే ఆరో రాష్ట్రం అవుతుంది. లేకపోతే పార్లమెంట్ ఎన్నికలతో పాటు మార్చిల మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. సీఎం జగన్ పార్లమెంట్ తో పాటు ఎన్నికలు జరగితే తన పథకాల అజెండాగా ఓట్లు అడగలేమని.. అప్పుటు టాపిక్ మారిపోతుందన్న ఉద్దేశంలో ఉన్నారని చెబుతున్నారు. అందుకే అసెంబ్లీకి ప్రత్యేకంగా ఎన్నికలు జరగాలని.. అందు కోసం ఐదారు నెలల ముందు అయినా  పర్వాలేదనుకుంటున్నారని  చెబుతున్నారు. 


ఆగస్టులో అసెంబ్లీ రద్దుపై సంకేతాలిస్తున్నారా ?


సీఎం జగన్ తాను మంచి చేస్తేనే ఓట్లు వేయమని ప్రజల్ని అడుగుతున్నారు. ఐదేళ్లలో  ప్రతీ ఇంటికి లబ్ది చేకూర్చానని చెబుతున్నారు. కొత్తగా ప్రకటించే పథకాలు ఏమీ ఉండవని.. మేనిఫెస్టోలో ఏమైనా కొత్తగా చెబుతారేమో తెలియదు కానీ..ఎన్నికలకు ముందు ఎలాంటి జనాకర్షక పథకాలు ఉండవని ఇప్పటికే ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. కానీ ప్రస్తుతం అమలవుతున్న పథకాలు తమకు అందడం లేదని ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించారు. జగనన్న సురక్షా ద్వారా కొత్తగా పథకాల లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. రాలేదనుకున్న వారికి ఇస్తారు. ఇలా అసంతృప్తిని పూర్తిగా తగ్గించుకునే ప్రణాళికలన్నీ.. సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలన్న లక్ష్యంతో  ఉన్నారు. 


ఆగస్టు తర్వాత ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టే అవకాశం ! 


ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు పెద్దగా లేవు. ఆర్థిక లోటు భర్తీ కింద రూ. పది వేల కోట్లకుపైగానే కేంద్రం ఇచ్చింది. రూ. 30వేల కోట్లకుపైగా రుణ పరిమితి లభించింది. ఇప్పటి వరకూ రూ. ఇరవై వేల కోట్ల వరకూ రుణాలు తీసుకున్నారు.ఈ రుణాలతో  కీలకమైన రైతు భ రోసా పథకానికి బటన్ నొక్కారు. నెలాఖరులో అమ్మఒడికి  కూడా బటన్ నొక్కుతారు. ఆ తర్వాత  పథకాలకు వేల కోట్లు అవసరం లేదు. అందుకే.. వీలైనంత వరకూ పార్టీ క్యాడర్ పెండింగ్ లో ఉన్న  బిల్లులను చెల్లించేసి.. ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు తీసుకుంటున్న విధంగానే తీసుకుంటే అప్పుల పరిమితి ముగిిపోతే ఆ తర్వాత నిధుల కోసం వెదుక్కోవాల్సి వస్తుంది. వచ్చే మార్చి  నాటికి అవి  చాలా ఎక్కువ అవుతాయి. ఆ సమయంలో ఎన్నికలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందనేది వైఎస్ఆర్సీపీ వ్యూహకర్తల అంచనాగా చెబుతున్నారు. 


అసంతృప్తి ఉన్న వర్గాలను చల్లబరిచే ప్రయత్నం ! 


ఇప్పటికే ఉద్యోగులకు వారికి ఇవ్వాల్సిన హామీలను ఇచ్చి చల్ల బరిచారు. వారు సంతృప్తి చెందారా లేదా అన్న సంగతి పక్కన పెడితే... ఉద్యోగ సంఘాల నేతలు మత్రం జగన్ ను పొగిడారు. వారికి ఇచ్చిన హామీలను అరవై రోజుల్లో అమలు చేస్తామన్నారు. అంటే..  ముందస్తు కోసం అసెంబ్లీని రద్దు చేసే సమయం అని కొంత మంది విశ్లేషిస్తున్నారు. తమపై ఏ వర్గానికి ఇక అసంతృప్తి ఉందో చూసి..ఆయా వర్గాలను సంతృప్తి పరిచే ప్రయత్నాలు ఇప్పటికే చేస్తున్నారని అంటున్నారు. ఈ లెక్క ప్రకారం చూసినా సీఎం జగన్ ముందస్తు కోసమేనని భావిస్తున్నారు. .