AP Cabinet :  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం అప్పుడే కనిపిస్తోంది.  ముఖ్యమంత్రి జగన్  ముందస్తుకు సిద్దమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.  తెలుగు దేశం  అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత ఏపీ ప్రభుత్వం పాలన పరమైన నిర్ణయాల్లో వేగం పెంచింది. జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి  యాత్రకు సిద్దమయ్యారు. ఈ సమయంలో బుధవారం ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ ఈ కేబినెట్ భేటీ పై ఉత్కంఠ  ప్రారంభమయింది. 


ముందస్తు నిర్ణయం ఉంటుందా ? 
 
ప్రతిపక్షాలు ముందస్తు ఖాయమనే అంచనాతో ఉన్నాయి. పొత్తుల ప్రక్రియ వేగంగా ముగించేందుకు నిర్ణయించారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది.  బీజేపీ కలిసి వస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.  దసరా నాడు మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం నిర్ణయించాయి. ఇప్పటికే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. మహిళలు..యువత…రైతులు..బీసీ వర్గాల కోసం మేనిఫెస్టో ప్రకటన చేసారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని..ఎప్పుడు ఎన్నికలు జరిగినా సిద్దంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.


ముందస్తు ఉండదంటున్న వైసీపీ ! 


ఏపీలో ముందస్తు ఎన్నికల దిశగా వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం కొంత కాలంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఈ దిశగానే సంకేతాలు ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్నారు. కేంద్రం )తో ముందస్తు ఎన్నికల పైన చర్చించారని..వారి నుంచి అభయం పొందారని ప్రచారం సాగుతోంది. ఈ ఆర్దిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వానికి తొలి రెండు నెలల్లోనే కేంద్రం నుంచి ఆర్దికంగా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయాలు వెలువడ్డాయి. ప్రతిపక్షాలు పొత్తుల లెక్కలు..సీట్ల సర్దుబాటు.. ఓట్ల బదిలీ పైన స్పష్టతకు రాకముందే ఎన్నికల బరిలోకి దిగాలనేది ముఖ్యమంత్రి జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. కేంద్రం నుంచి ఆర్దికంగా తోడ్పాటు అందుతున్న సమయంలో నిర్ణయాల వేగం పెంచారు. రేపు ఏపీ మంత్రవర్గం భేటీ జరగనుంది. ఈ భేటీలో ఉద్యోగుల పీఆర్సీ, పెండింగ్ అరియర్స్ చెల్లింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ల పైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రతిపక్షాల పొత్తులు..తన ఆలోచనలను మంత్రివర్గ సహచరులతో షేర్ చేసుకొనే అవకాశం ఉంది. ముందస్తు పైన స్పష్టంగా చెప్పకపోయినా.. తీసుకొనే నిర్ణయాలు ఆ దిశగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ప్రచారం వేళ రేపు జరిగే మంత్రివర్గ సమావేశం..నిర్ణయాలపైన ఉత్కంఠ ఏర్పడుతోంది.


అసెంబ్లీ రద్దుపై ఇప్పుడు నిర్ణయం తీసుకుంటేనే ముందస్తు ఎన్నికలు


ఎన్నికలు నిర్వహించాలంటే ఈసీ చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది.  ఇవాళ అసెంబ్లీ రద్దు చేస్తే రేపు షెడ్యూల్ ప్రకటించడానికి ఉండదు. అసెంబ్లీ కాలపరిమితి ముగిసే ఆరు నెలల ముందుగానే ఈసీ సన్నాహాలు చేస్తుంది. ముందస్తు పెట్టాలన్నా అంతే. ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.  అధికారుల బదిలీలు చేపట్టాలని ఐదు రాష్ట్రాల ప్రభు్తవాలకు ఈసీ ఆదేశాలిచ్చింది. ఇప్పుడు ఎన్నికల నిర్వహణపై  ఆఫీసర్లకు   మాస్టర్ ట్రైనింగ్ కూడా ప్రారంభించారు.   ఈ ఏడాది అక్టోబర్​ చివరలో లేదంటే నవంబర్​లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉంది.   కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకుంటే మాత్రమే  నవంంబర్, డిసెంబర్‌ లో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీ ఎన్నికలు జరుగుతాయి.    అక్టోబర్ లో రద్దు చేసినా చేయకపోయినా... ఎన్నికలు జరిగేది మాత్రం మార్చిలోనే. ఎందుకంటే.. అక్టోబర్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది.  ఏపీలోనూ ఇలాంటి సన్నాహాలు ప్రభుత్వం పూర్తి చేయాలంటే... తక్షణం అసెంబ్లీని రద్దు చేయాలి. అనధికారికంగా ఇలాంటి సన్నాహాలను ఈసీ చేయదు.